-

లాక్‌డౌన్‌ జిందాబాద్‌! కరోనా ముర్దాబాద్‌

3 Apr, 2020 01:23 IST|Sakshi

సందర్భం 

ఎప్పుడో మార్క్స్‌ ‘దాస్‌ క్యాపిటల్‌’ రాసినప్పుడు ప్రపంచాన్ని కమ్యూనిజం అనే భూతం కమ్మేసిందని పెట్టుబడుల స్వర్గధామాలు బెంబేలు పడ్డాయని చది వాం. అది 150 ఏండ్ల కింది ముచ్చట.  ఇప్పుడు పెట్టుబడులు ‘గ్లోబల్‌ మార్కె ట్‌’గా వేళ్ళూనికొని సామ్రాజ్యాలు నిర్మిస్తున్న కాలంలో జీవమో కాదో, తెలియని వైరస్‌ రాణి మృత్యు కిరీటం (కరోనా) తొడుక్కొని విధ్వంస ‘కోవిడ్‌’ రాలై పెట్టుబడిని, మానవ నిర్మిత మహా కట్టుబడిని, కట్టుబాట్లను అన్నింటినీ కుప్పకూలుస్తున్న భీతావహ కాలంలో మనమున్నాం. మన శరీరమే ‘వైరి’పక్షమైనాక కుచ్‌న కరోనా ప్లీజ్‌ కరోనా అంటున్నాం. నిన్నటి జన చైనా లాంగ్‌మార్చ్‌ నెత్తుటి చిత్తడి వూహాన్‌ ఊహకందని ప్రపంచ మహా పారిశ్రామిక నగరమై, ఎదిగి, ఏ కారణం చేతనో ప్రపంచాన్ని కమ్మేసిన వైరస్‌ దాడికి జన్మస్థలమయ్యింది. మనుషుల ఆహారపు అలవాట్ల మీద చర్చకు ఒకనాటి విప్లవ విముక్తి ప్రాంతం, బుద్ధుని శాంతి ప్రదేశం వూహాన్‌ కేంద్రమవడం విషాదమే. పాపమంతా చైనాదే అని ట్రంప్‌ దుమ్మెత్తి పోయడం, యూరప్‌ దేశాలు భజన చేయడం తప్పితే ఈ ఆధునిక, నాగరిక దేశాలు తమ ప్రజల్ని తాము రక్షించుకోలేని ఆత్మరక్షణలో ప్రాణాల కోసం పరుగెత్తడం ఇంకా విషాదం.

మార్చి, 22న జనతా కర్ఫ్యూ, ఆ తెల్లారి నుండి ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశం ఇంటికి పరిమితమయ్యే ఆచరణను అలవాటు చేసుకునే పనిలో ఉంది. దేశంలోని కోట్లాది మంది నిరుపేదలకు కరోనా గండం. పూట గడవని ఆకలి గండం.. నిత్యం నిద్రలేని రాత్రుల్ని పోలీసుల లాఠీ చప్పుళ్ల మధ్య వినిపిస్తూనే ఉన్నది. ఢిల్లీ, ముంబైలో వందల కిలోమీటర్లు ప్రభుత్వాలు ఏ రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో ‘కరోనా కత్తుల వంతెన’పై మహానగరాలు దాటుతూ పల్లెకు ప్రయాణం... దేశం ఎటుమూల చూసినా ఈ పరిస్థితి దీనంగా వుంది కాబట్టే ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌లో ఈ అకాల కష్టానికి మన్నించమని వేడుకున్నారు.

ఎప్పుడో చైనా యుద్ధ క్షేత్రాల్లో నార్మన్‌బెతూన్‌ ‘డాక్టర్లారా! గాయపడిన వాళ్ళు మన దగ్గరకు రాలేరు... మనమే టీమ్‌లుగా వెళ్ళాలని అన్నమాట ఇప్పుడు ఆచరిద్దాం. ఇప్పుడు ట్రంప్‌కు ఇష్టమైన పదం ‘చైనా వైరస్‌’కు కూడా అదే పద్ధతి. దక్షిణ కొరియా చేసింది అదే. ఆ పని చేయని, అవకాశం రాని ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇరాన్‌ ఎంత నష్టపోయినవో ఎంత రక్తమోడ్చుతున్నాయో మనకు తెలుసు. మన దేశపు దేశవాళీ అంతర్గత (హెర్డ్‌) ఇమ్యూనిటీ పుణ్యమో, అధిక ఉష్ణోగ్రతో, మ్యుటేషన్స్‌ మహత్యమో ఏదైనా కానీ మనం రెండో దశను దాటి ప్రమాదకర మూడో దశలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నాము. దేశంలో 11 లక్షల మంది డాక్టర్లు, ఇతర వైద్య విధానాలు, మహాసైన్యం వలె ఉన్న భారత ‘నైటింగేల్స్‌’ అయిన మన నర్సులు ఎందరో ఉండగా విజ్ఞత కలిగిన పాలకులుంటే అద్భుతాలు సాధించవచ్చు.

ఒక నగరాన్ని మాత్రమే లాక్‌డౌన్‌ చేసిన వూహాన్‌ నమూనా మన దేశానికి పనికి రాదు. కరోనా కత్తిని తునాతునకలు చేసే సన్నద్ధత, విజయం అధిక నిధుల కేటాయింపు, దీర్ఘకాలికంగా కొనసాగే ఆరోగ్య ప్రణాళికతోనే సాధ్యం. చేష్టలుడిగి ఇంట్లో ఏదో వ్యాపకంతో మన మధ్యతరగతి కొన్నిపదుల రోజులు ఈడ్చుకురాగలుగుతుందేమో కానీ రెక్కాడితే డొక్కాడని పేదలకు సాధ్యంకాదు. ఏ ఉద్దీపనలైనా యుద్ధప్రాతిపదికనే జరగాలి. జనతా కర్ఫ్యూ మొదలు ఇప్పటిదాక నిలబెట్టుకున్న ఇమేజ్‌కు తగ్గ కార్యాచరణ ఉండాలని మన దేశం ఆశిస్తున్నది.

కరోనాకు కట్టడి ఏదంటే గడప దాటి మృత్యు కిరీటాన్ని మనం ముద్దాడకపోవడమే. మశూచి, పోలియో, సార్స్‌లపై జీవన పతాక ఎగిరేసిన భారత్‌ వ్యూహాత్మక, ఆచరణాత్మక ముందడుగు కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. కరోనా భయంకరమైన అంటువ్యాధి అనేది నిజమే కాని, ఇంతకంటే మృత్యుశీతలమైన అనేక వ్యాధులను ప్రపంచం, దేశం, మానవాళి ఓడించి నిలబడిందన్న సందేశం, సంకేతం కశ్మీర్‌ నుండి కన్యాకుమారి దాకా అవసరం. కరోనాకు ఏ మందు లేదు.. చావే దాని మరో పేరు, ఇప్పట్లో వ్యాక్సిన్‌ రాదు అంటూ కరోనా చావులను డిజిటల్‌ సౌండ్‌లో వినిపించడంలో మైండ్‌గేమ్‌ కంటే ప్రమాదముంది. ధైర్యంతో, హేతుబద్ధతతో కూడిన..
లాక్‌డౌన్‌ జిందాబాద్‌ కరోనా ముర్దాబాద్‌.


డా. చెరుకు సుధాకర్‌
వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
మొబైల్‌ : 98484 72329

మరిన్ని వార్తలు