ఈసీని బద్నాం చేస్తే లాభమేంటి?

17 Apr, 2019 01:54 IST|Sakshi

ఏపీ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన వ్యవహారంపై అధికారపక్షం గగ్గోలు పెట్టడంతో ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత ప్రమాదంలో పడినట్లయింది. ఎన్నికల కమిషన్‌ తీరు వంకపెట్టలేనిదేమీ కాదు. అలా అని దాన్ని ఊరకే నిందిస్తూ కూర్చున్నా ఫలితం లేదు. నిష్పక్షపాతంగా దాని పనితీరు మదిం పుచేసి లోపాలను, బలహీనతల్ని  అధిగమించేలా, స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసేలా ఎలా తీర్చిదిద్దాలో రాజకీయపక్షాలన్నీ ఆలోచించాలి. దాని పని తీరును ఎత్తిచూపే రాజకీయ పార్టీలు, తాము అధికారంలోకి వస్తే ఎలా దాన్ని బలోపేతం చేస్తామో చెప్పాలి. అదేసమయంలో ఆ రాజ్యాంగ సంస్థని అధికార పక్షం పంజరంలో చిలుకగా మార్చినట్టు చెప్తున్న ప్రతిపక్షాలు, దానిని బయట నుండి పుల్లలతో హింసించి ప్రయోజనం లేదు. లక్షలాది ఓట్లు గల్లంతు కావడం ఆ సంస్థ పనితీరుకు శోభనివ్వదు. సరికదా బాధ్యతారాహిత్యంగా అనుకోవాల్సి వస్తుంది. ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తపరిచినపుడు, ఆ సందేహాన్ని ప్రాక్టికల్‌గా నివృత్తి చెయ్యాలి తప్ప, అడిగిన వారి డిగ్రీలు, అర్హతలు గురించి మాట్లాడకూడదు.

ఇక ప్రతిపక్షాలు 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించాలని కోరడంలో లాజిక్‌ తెలియడం లేదు. ఈవీఎంల నిక్కచ్చితనంపై సందేహం ఉంటే తేల్చుకోడానికి అంత స్థాయిలో శాం పిల్‌ అక్కరలేదు. రాండమ్‌గా కొంత శాతం సరిపోతుంది. లేదూ, వాటిని ట్యాంపర్‌ చేసి ఫలితాల్ని ప్రభావితం చేశారేమో అనుకున్నా అప్పుడు 50 శాతం లెక్కించినా ప్రయోజనం లేదు. 99శాతం లెక్కించినా మిగిలిన ఒక్క శాతంలో గడబిడ జరిగి ఫలితాలు మారొచ్చు కదా. కాబట్టి విశ్వసనీయత అన్నది అయితే సంపూర్ణం లేదా సున్నా తప్ప కొంచెం కొంచెం ఉండదు. 50శాతం లెక్కింపు తో ప్రయాస తప్ప, విశ్వసనీయతలో ప్రగతి ఏముం టుంది? అయితే అందరూ ఒప్పుకోవాల్సింది ఒకటి. ఎన్నికల కమిషన్‌కి స్వయం ప్రతిపత్తి ఉండాలి. స్వతంత్ర నిర్ణయాలు అమలుచేసే శక్తి ఉండాలి. సిబ్బంది ఉండాలి. అలా చెయ్యాలంటే అవసరమైన రాజ్యాంగ సవరణలకు ఒప్పుకునే పార్టీలుండాలి. రేపు అధికా రంలోకి రాబోయే వారికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఎన్నికలు ముగిశాక, తమకు ఇబ్బంది కలిగించే సంస్కరణలకు వత్తాసు పలికేలా పార్టీలు ఆలోచిస్తా యా అన్నది సందేహం. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఆ తరహా సంస్కరణలు తప్పనిసరి అవసరం.
-డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం

మరిన్ని వార్తలు