కొన్ని మెరుపులు.. కాసిన్ని మరకలు

27 Dec, 2018 01:34 IST|Sakshi

2018లో బాబ్రీ మసీదు–రామ జన్మభూమి వివాదం నుంచి ఆధార్‌ కార్డు చెల్లుబాటు వ్యవహారం, రఫెల్‌ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం వరకు భిన్నమైన కేసులను విచారించిన సుప్రీం కోర్టు అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. సెక్షన్‌ 377ను పునర్నిర్వచించి స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. వివాహేతర సంబంధాలను క్రిమినల్‌ నేరంగా పరిగణించడం సరికాదు అంది. శబరిమలలో మహిళ ప్రవేశాన్ని అనుమతించాలంది. జస్టిస్‌ లోయ అనుమానాస్పద మృతి, మానవ హక్కుల నేతల అరెస్ట్‌పై పిటిషన్లను కొట్టివేసింది. బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదంపై విచారణ, ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ న్యాయబద్ధత, అలోక్‌ వర్మ పిటిషన్లతో 2019 స్వాగతం పలుకుతోంది.

కొన్ని మంచి రోజులున్నట్టే... కొన్నిసార్లు గడ్డు రోజులు కూడా దాపురిస్తాయి. సుప్రీం కోర్టుకు సంబంధించినంత వరకు 2018 ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులకు చెందిన సంవత్సరం. సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు అనూహ్యంగా విలేఖరుల సమావేశం ఏర్పాటుచేయడంతో ఈ ఏడాది మొదలయ్యింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి తమకు కేసులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నారని వారు ఆ సమావేశంలో ఆరోపించి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. ఇప్పుడు మన ఏడాది చివరికి వచ్చేశాం. ఆ నలుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు పదవీ విరమణ చేయగా, నాలుగోవారైన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.

ఏడాది ప్రారంభంలో పైస్థాయి న్యాయవ్యవస్థలో చాలా నియమాకాలు అపరిష్కృతంగా ఉండేవి. అయితే, అక్టోబర్‌లో గొగోయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. అక్టోబర్‌ నుంచి వివిధ హైకోర్టుల్లో వందలాది నియామకాలు జరిగాయి. సుప్రీం కోర్టులో కూడా కొన్ని ఖాళీలు భర్తీ చేశారు. బాధ్యతలు స్వీకరించినవారిని చూసి కొంతమంది కళ్లెగరేశారు, మరికొందరు పెదవి విరిచారు. ఆయా పదవులను చేపట్టిన తర్వాతైనా వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. 

అనూహ్యమైన తీర్పులు 
ఎన్నో రకాలుగా సుప్రీంకోర్టుకు 2018 చాలా కీలకమైన సంవత్సరం. ఎన్నో విభిన్నమైన కేసులను ఈ ఏడాది సుప్రీం కోర్టు విచారించింది. బాబ్రీ మసీదు–రామ జన్మభూమి వివాదం నుంచి ఆధార్‌ కార్డు చెల్లుబాటు వ్యవహారం, రఫెల్‌ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం వరకు భిన్నమైన కేసులను విచారించిన న్యాయస్థానం అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయాలతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన సందర్బాలను కూడా గుర్తుచేసుకుంటే బావుంటుంది.  

లోక్‌ ప్రహారీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల దిశగా న్యాయస్థానం ముందడుగు వేసింది. 1961నాటి ఎన్నికల నిబంధనలను మార్పు చేయాలని ఆదేశించింది. దీంతో అభ్యర్థులు, వారి అనుయాయుల ఆదాయ వివరాల అఫిడవిట్‌ను స్వయంగా దాఖలు చేయాల్సి ఉంటుంది.  

ççహదియా కేసుగా అందరికీ తెలిసిన షఫీన్‌ జహాన్‌ వర్సెస్‌ అశోకన్‌ కేఎం కేసులో తనకు నచ్చినవారిని వివాహం చేసుకునే హక్కు వారికుందని పునరుద్ఘాటించింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే దిశగా తీర్పు వెలువరిస్తూ కోర్టు సంరక్షకుడి పాత్ర పోషించింది. ‘సామాజిక కట్టుబాట్లు, నైతిక విలువలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అయితే, ఆ విలువలు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛకంటే ఎక్కువకాదని’ సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వ్యాఖ్యానించింది. 

కామన్‌ కాజ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రతి భారతీయుడికీ హుందాగా మరణించే హక్కుందని పేర్కొంది. నిరంతరం మిషన్‌ల సహాయంతో మాత్రమే జీవించగలిగేవారికి, వాటిని తొలగించడం ద్వారా సహజంగా మరణించే అవకాశం కల్పించవచ్చని తీర్పు చెప్పింది. అయితే, ఇందుకు అవసరమైన విధానపరమైన సూచనలను కూడా సవివరంగా వెల్లడించింది.

స్టే కాలపరిధి ఆరు నెలలే
ఆసియన్‌ రిసర్ఫేసింగ్‌ ఆఫ్‌ రోడ్‌ ఏజెన్సీ వర్సెస్‌ సీబీఐ కేసులో సివిల్, క్రిమినల్‌ కేసుల విచారణ  సుదీర్ఘకాలం ఆలస్యం కాకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొన్నిసార్లు స్టేను కేసు విచారణను సాగదీయడానికి వాడుకుంటున్న నేపథ్యంలో; సివిల్, క్రిమినల్‌ కేసుల విచారణలో ఇచ్చే స్టే ఆరు నెలల తర్వాత రద్దవుతుందని పేర్కొంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం కేసును ముగించడం కంటే, స్టేను కొనసాగించడమే ముఖ్యమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.  

తహ్సీన్‌ పూనావాలా పిటిషన్‌ను విచారించిన కోర్టు దేశంలో మూకదాడులు ఎక్కువైపోవడంపై స్పందిస్తూ నిందితులను పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది.  
సెప్టెంబర్‌ చివరికొచ్చేసరికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొన్ని ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది. నవతేజ్‌ సింగ్‌ జోహార్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సెక్షన్‌ 377ను పునర్నిర్వచించి స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ చరిత్రాత్మకమైన తీర్పు వెలు వరించింది.

జోసెఫ్‌ షైన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సెక్షన్‌ 497 కొట్టివేస్తూ భార్య భర్త సొత్తుకాదని, వివాహేతర సంబంధాలను క్రిమినల్‌ నేరంగా పరిగణించడం సరికాదు అంది. దీనివల్ల మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అంతేకాదు, ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో శబరిమలలో మహిళా ప్రవేశాన్ని అనుమతించాలని తీర్పు చెప్పింది. పది నుంచి యాభై ఏళ్ల వయసు కలిగిన మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది. 

అన్నీ అనుకూలమైనవి కావు
ఇటీవలి ఈ తీర్పులన్నీ దేశంలోని పౌరులందరికీ మేలు చేయాలని సుప్రీంకోర్టు తీసుకున్నవే. ఈ తీర్పులపై వ్యాఖ్యానించే ముందు కోర్టు పెద్దన్న తరహాలో హక్కులను ధారాదత్తం చేయలేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రాజ్యాంగంలో పొందుపరిచిన వాటినే మరోసారి పునర్నిర్వచించింది. అంతమాత్రనా కోర్టు ప్రతి సందర్భంలోనూ పౌరుడి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పడం కాదు. ఆధార్‌ కార్డు చెల్లుబాటును సవాల్‌ చేసిన కేఎస్‌ పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో జనవరి నుంచి వాదనలు సాగాయి. చివరికి సుప్రీం కోర్టు ఆధార్‌ కార్డుకు చట్టబద్ధత కల్పించింది. ప్రైవేట్‌ పార్టీలు కూడా ఆధార్‌ కార్డును డిమాండ్‌ చేయడం వంటి అంశాలను మాత్రం కొట్టివేసింది.  

చీకటి కోణాలు 
కొన్ని కేసుల విషయంలో అనేక వివాదాలు ఈ ఏడాది సుప్రీం కోర్టును చుట్టుముట్టాయి. సొహ్రాబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తున్న జస్టిస్‌ లోయ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే, భీమా కోరేగావ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఐదుగురు మానవ హక్కుల నేతలను అరెస్ట్‌ చేయడంపై సమగ్రమైన స్వతంత్ర విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.

ప్రభుత్వం రఫెల్‌ విమానాల కొనుగోలు చేయడంపై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కూడా కోర్టు తోసిపుచ్చింది. సీల్డ్‌ కవర్‌లో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించే విధానాన్ని అవలంబించడం చాలా చర్చకు తావిచ్చింది. ఈ తీర్పు విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి కాగ్‌ సమర్పించే నివేదికపై కోర్టు ఆధారపడింది. అయితే, అటువంటి నివేదిక ఏదీ అప్పటికి కాగ్‌ సమర్పించలేదు. దీంతో తీర్పులో తప్పులను దిద్దాలంటూ కేంద్రం దరఖాస్తు చేసుకుంది.  

రాబోయే 2019వ సంవత్సరం కూడా కీలకంగానే కనిపిస్తోంది. కోర్టు ప్రారంభం కాగానే బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదంపై కేసు విచారణకు తేదీ ఖరారు చేయాల్సి ఉంది. తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ న్యాయబద్ధతపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అలాగే, సీబీఐ డైరెక్టర్‌గా తనను తొలగించడంపై అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషనపై కూడా కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.  

సుప్రీంకోర్టుకు సంబంధించి మరో ఏడాది 2018 కూడా కాలప్రవాహంలో కలిసిపోతోంది. సుప్రీంకోర్టు ఈ ఏడాది తనను తాను ఒక బృంద సంస్థగా నిలబెట్టుకుంది. ఎవరో ఒకరు పెత్తనం చేయడం కుదరదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడలేకపోయినా, సామాజిక నైతిక చట్రం నుంచి పౌరులను కాపాడే విషయంలో అండగా నిలిచింది. రాజ్యాంగ నైతికతను కాపాడటానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, అస్పష్ట భావనతో, ఇంద్రియ జ్ఞానంకంటే వ్యక్తిత్వంపైనే ఎక్కువ ఆధారపడుతుంది. కొన్ని మంచి సమయాలు, మరి కొన్ని చెడు సమయాలు.
 

వ్యాసకర్తలు: సంజయ్‌ హెగ్డే, ప్రెంజాల్‌ కిషోర్‌.. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు
 – ‘ది వైర్‌’ సౌజన్యంతో

మరిన్ని వార్తలు