రాజధానికి మాహిష్మతి సోకులు

24 Sep, 2017 14:49 IST|Sakshi

‘అమరావతి’ ఇటీవల కాలంలో ఎక్కువ వివాదాస్పదంగా మారుతోంది. రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే తమ భూములను బలవంతంగా చంద్రబాబు లాక్కుంటున్నారని ఆ ప్రాంతంలోని రైతులు ఇటీవల ప్రపంచ బ్యాంకు పర్యటన సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచ బ్యాంకు సైతం మూడు పంటలు పండే భూములను సందర్శించింది. ‘వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన రాజేంద్రసింగ్‌ రాజధాని ప్రాంతంలో నదీగర్భానికి భంగం కలిగించే విధంగా భూములను రైతుల నుంచి తీసుకోవడాన్నీ, అలాగే నదీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు జరిగిన తీరునూ ఎండగడుతూ నదులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడటానికి తాను ఉద్య మించగలనని స్పష్టంగా చెప్పారు. చిన్న నీటి వనరులను, నదులను పరిరక్షించి నదులు సజీవంగా తయారు కావడానికి విశేష కృషి చేసిన కారణంగా ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘రామన్‌ మెగసెసె’ అవార్డును బహూకరించారు. అలాంటి విశిష్ట వ్యక్తి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే పచ్చ చొక్కాల నాయకులు ఆయనపై దాడి చేయడం సభ్య సమాజానికే అవమానం.

ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేస్తున్న లింగమనేని అతిథిగృహంతో సహా దాదాపు 51 మందికి అక్రమంగా నదీ గర్భంలో నివాసముంటున్నారని ఇటీవలే హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే రాజధాని ప్రాంతంలో పచ్చని పంటలను కబళించి పర్యావరణానికి అంతరాయం కలిగిస్తున్నారని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఓ కేసు నడుస్తోంది. ఇది కాక రాజధాని ప్రాంతంలో రైతులు తమకు జరుగుతున్న అన్యాయాలపై హైకో ర్టును ఆశ్రయించి అనేక కేసులు వేశారు. ఇదంతా ఎందుకు జరిగింది? రాజధాని ప్రాంతం ఎన్నుకోవడంలో చంద్రబాబు అన్యాయమైన ఆలోచనలు పునాదిగా ఉండటం వల్లనే జరిగాయి.

అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం ఎంతటి వినాశనాన్ని తెచ్చిపెట్టిందో మనకు నేడు అనుభవంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పులివెందులలో వైఎస్సార్‌ కుటుంబం ప్రకటించిన సందర్భంగా గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేస్తామని, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు అక్కడి నుంచే ప్రజల భాగస్వామ్యంతో జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందులో ప్రజలు భాగ స్వామ్యం కావాలి. ఈ రాష్ట్రం నాది, మనది అనే అభిప్రాయం ప్రజలు భావించాలి. రాష్ట్రంలో జరిగే పారిశ్రామికాభివృద్ధి అన్ని ప్రాంతాల్లో విస్తరించాలి.

బాబు ఈ చర్యలేవీ పాటించకుండా అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆయన జపాన్, సింగపూర్, చైనా తదితర దేశాలన్నీ పర్యటించి సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపి రాజధానిపై ఓ అవగాహన కుదిరిందనే సంకేతాలు మనకు చెబుతూ వచ్చారు. మరి నేడు సినీ దర్శకుడు రాజమౌళితో ఈ చర్చలేమిటి? రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపించి ప్రజల కళ్లకు గంతులు కట్టడానికి తప్ప మరేమీ కాదు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు, నిర్మాత అయిన కేవీరెడ్డి మాయాబజార్‌తో రాజమౌళి నిర్మించిన బాహుబలి చిత్రాన్ని పోలుస్తూ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఒక దేశ ఉప రాష్ట్రపతిగా కాకుండా సంకుచిత భావంతో బాబు గౌరవాన్ని కాపాడటానికి ఒక దినపత్రికలో వ్యాసం రాయడం గర్హనీయం. సీమవాసుల, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా అభివృద్ధి అంతా ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలాగ చేసుకుపోతూ రాజధాని కోసం సేకరించిన భూములతో చెలగాట మాడటం చంద్రబాబు మానుకోవాలి. లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఏర్పడి భవిష్యత్తులో విభజనోద్యమాలకు పునాదులు వేసిన పాపం కూడా బాబు మూటగట్టుకోగలరు.

- ఇమామ్‌
వ్యాసకర్త కదలిక సంపాదకులు 99899 04389 

మరిన్ని వార్తలు