కిమ్‌.. నువ్వెంత..?

24 Sep, 2017 14:59 IST|Sakshi

బీ-1బీ బాంబర్స్‌ పంపిన అమెరికా

ఉత్తర కొరియా ప్రమాదకరంగా ఉందన్న పెంటగాన్‌

కట్టడి చేయాలంటున్న అమెరికా రక్షణ శాఖ వర్గాలు

అమెరికా.. ఉత్తర కొరియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? జపాన్‌, దక్షిణ కొరియాల రక్షణ కోసం అమెరికా రంగంలోకి దిగిందా?  కిమ్‌ను ట్రంప్‌ భయపెట్టగలడా? ఇరుదేశాల మధ్య అణు యుద్ధం తప్పదా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి. తాజాగా జపాన్‌, దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలో అమెరికా.. యుద్ధ విమానాలు మొహరించింది.

వాషింగ్టన్‌ : ఉత్తర కొరియాపై చర్యలకు అమెరికా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా వరుస అణు పరీక్షలతో సరిహద్దు జపాన్‌ సహా ప్రపంచ దేశాలకు వణకుపుట్టిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ‘మిషన్‌ నార్త్‌ కొరియా’ ప్రారంభించింది. అమెరికా బాంబర్‌, ఎస్కార్ట్ ఫ్లయిట్స్‌ ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ గగనతలంపై అమెరికా యుద్ధవిమానాలు గస్తీ కాస్తున్నట్లు పెంటగాన్‌ వర్గాలు ధృవీకరించాయి. అమెరికా, మిత్రదేశాల రక్షణ విషయంలో ఎటువంటి ప్రమాద సంకేతాలు వెలువడినా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి డానా వైట్‌ స్పష్టం చేశారు. అవసరమైతే మిలటరీ చర్యలకు సైతం సిద్ధంగా ఉన్నామని.. అధ్యక్షడు ట్రంప్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అయన చెప్పారు.

ఉత్తర కొరియా చేపట్టిన అణ్వాయుధ పరీక్షలు.. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను కల్పించాయని, ఇది అంతర్జాతీయ భద్రతకు పెను సవాలుగా మారిందని వైట్‌ అన్నారు. అమెరికా, కూటమి దేశాలపై ఉత్తర కొరియా దాడి చేయాలని భావిస్తే.. అందుకు తగిన మూల్యం ఆ దేశం చెల్లించుకుంటుదని ఆయన అన్నారు.

అమెరికాకు చెందిన మీ-1బీ బాంబర్స్‌, ఎఫ్‌-15సీ యుద్ధవిమానాలు జపాన్‌లోని ఒకినావా ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నట్లు పెంటగాన్‌ వర్గాలు తెలిపాయి.  బీ-1బీ బాబర్ ఫ్లయిట్స్‌ అమెరికా న్యూక్లియర్‌ ఫోర్స్‌లో ఒక భాగం. అణుబాంబులతో సహా.. ఇతర శక్తివంతమైన బాంబులను ఈ విమానాలు నిర్దేశిత లక్ష్యం మీద జారవిడుస్తాయి.

మరిన్ని వార్తలు