ప్రయోగం.. ఉపసంహారం తెలిసిన మోదీ

31 May, 2020 01:01 IST|Sakshi

సందర్భం 

శతృ సంహారం చేస్తూ, తన ప్రజలను కాపాడుకోవడంలోనే ఒక రాజకీయ నాయకుడికి, రాజనీతిజ్ఞుడికి మధ్య తేడా కనబడుతుంది. కరోనా కాలంలో  ఈ విషయం ప్రపంచం మొత్తానికి తేటతెల్లమైపోయింది. కొన్ని దేశాల నేతలు కేవలం ప్రజలను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారు. మరికొంతమంది కేవలం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉంచడానికే పెద్ద పీట వేశారు. ఆ క్రమంలో ప్రజలు చచ్చినా పట్టించుకోలేదు. ఒక్క మన ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే, ఆర్థిక వ్యవస్థనూ కట్టు తప్పకుండా రక్షించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అమెరికా మొత్తం జనాభాలో కరోనా బాధితులు 0.51 శాతం. ఇదే స్పెయిన్లో అయితే 0.6 శాతం. ఇక, ఇటలీ, బ్రిటన్లో అయితే 0.38 శాతం. అవన్నీ అతి తక్కువ జనాభా ఉండే దేశాలు.

అదే 125 కోట్ల జనాభా కలిగిన భారతదేశ జనాభాలో బాధితుల శాతం ఎంతో తెలుసా? కేవలం 0.01 శాతం. కరోనా కార ణంగా ప్రపంచంలో ప్రతి లక్ష మందికి 4.4 మంది చనిపోతున్నారు. భారతదేశంలో ఇది కేవలం 0.3 మంది మాత్రమే. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ మరణాల రేటు. మన దేశంలో రికవరీ శాతం 40 శాతానికిపైనే. మరణాల రేటు మూడు శాతా నికిలోపే. లాక్‌డౌన్‌ అమలు, కేసులను సమయానికి గుర్తించడం, మెరుగైన నిర్వహణ ఇందుకు కారణం. కరోనా అడుగుపెట్టినప్పుడు దేశంలో ఉన్నది ఒకే ఒక ల్యాబ్‌. కానీ, కేవలం రెండే రెండు నెలల్లో 624 ల్యాబ్‌లు సిద్ధమయ్యాయి. మోదీ సర్కారు దక్షతకు ఇది నిదర్శనం.  

పుణేలోని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌. ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల ఉత్పత్తిదారు. అక్కడి పరిశోధన, అభివృద్ధి విభాగానికి అధిపతి ఉమేశ్‌ సాలిగ్రామ్‌. ప్రతి రోజూ అర్ధరాత్రి కావడానికి కొద్దిసేపటి ముందు ఆయనకు ఓ వాట్సాప్‌ మెసేజ్‌ వస్తుంది. ‘టీకాల తయారీ ఎంత వరకూ వచ్చింది? మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం కావాలా?’ అని అందులో ఉంటుంది. కొద్ది క్షణాల్లోనే సంబంధిత నివేదికను సాలిగ్రామ్‌ పంపించేస్తారు. తమకు ఏమైనా అనుమతులు కావాలంటే ఆ వివరాలూ పేర్కొంటారు. ఇంతకీ, ఆ వాట్సాప్‌ మెసేజ్‌ ఎవరి నుంచి వస్తుందో తెలుసా? ప్రధాన మంత్రి మోదీ ప్రధాన శాస్త్ర సలహాదారు కె.విజయ రాఘవన్‌ నుంచి. ప్రపంచమంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న కోవిడ్‌ టీకాను సాధ్యమైనంత త్వరగా తీసుకు రావడానికి ప్రభుత్వం ఎంత చురుకుగా, ఎంత వేగంగా చర్యలు తీసుకుం టోందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఇది. 

నిజానికి, మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో రెండో సారి అధికార పగ్గాలు చేపట్టి ఏడాది. విజయాలు, సంస్కరణల పరంపరతో అప్రతిహతంగా దూసుకుపోతున్న మోదీ సర్కారు పండుగ చేసుకోవాల్సిన సమయమిది. అప్పటి వరకూ స్కాములే ఉపసర్గ (ప్రిఫిక్స్‌)గా ఉన్న భారతదేశానికి ముందు స్కీములు చేర్చిన ఘనత మోదీదే. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను తొలి ఐదేళ్లలో పట్టాలపైకి ఎక్కించారు. అంతర్గతంగా ప్రజలకు, అంతర్జాతీయంగా దేశ భద్రతకు భరోసా కల్పించారు. అందుకే, రెండో సారి అప్రతిహత విజయం దక్కించుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ నినాదంతో ఐదు ట్రిలియన్‌ డాలర్ల నవ భారతాన్ని కలగన్నారు. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తూనే అందుకు ఎన్నో చట్టాలనూ సవరించారు. సంస్కరణలు తీసుకొచ్చారు. ఆర్టికల్‌ 370 నిర్వీర్యం వంటి చర్యలు చేపట్టి దేశ ప్రజల్లో విశ్వాసం కల్పించారు. ఫలితంగా, ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బ తిన్నా.. భారత్‌ మాత్రం నిలకడగా సాగుతోంది.

సరిగ్గా ఈ సమయంలోనే కరోనా ముప్పు ముంచుకొచ్చింది. దీని తీవ్రతను కూడా ఆయన ముందుగానే ఊహించారు. మార్చి ఏడో తేదీ హోలీ రోజునే జాగ్రత్తగా ఉండాలని దేశవాసులను హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కేవలం 500 కేసులు ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇది సుదీర్ఘంగా కొనసాగితే దేశ ప్రజలు ఇబ్బందులు పడతారని గుర్తించారు. ఏకంగా రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. జన్‌ధన్‌ లబ్ధిదారులు కాలు బయటకు కదపకుండా వారి ఖాతాలకే రూ.500, రైతులకు 2 వేలు చొప్పున బదిలీ చేశారు. నిరుపేదల ఇళ్లకే బియ్యం పంపించారు. పనులు లేక వాళ్లు ఇబ్బందులు పడతారని ఒక్కో కుటుంబానికి నెలకు రూ.1000 చొప్పున నగదు అందించారు. టోల్‌ గేట్లు, జాతీయ రహదారులు.. ఎక్కడికక్కడే వలస కార్మికులకు ఉపాధి, వసతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు, సంప్రదింపులు జరుపుతూ కరోనా కట్టడికి విశేష కృషి జరిపారు. సంక్షోభ సమయంలో రాజకీయాలకు తావు లేకుండా ప్రజలను, దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారు.
ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మందిలో కదలిక సమాజాన్ని కదిలిస్తుంది. అందుకే కరోనాపై అవగాహన కల్పించడానికి, దాని కట్టడికి దృఢంగా వినూత్న మార్గాలను అనుసరించాడు. బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం వంటివి మొత్తం 23 ఉన్నాయి. వాటిని సాధించడం, ప్రయోగించడం మాత్రమే కాదు.. ఉపసంహరణ కూడా తెలియాలి. అలాగే, కరోనా కష్ట కాలంలో లాక్‌ డౌన్‌ విధించడమే కాదు.. దాని నుంచి క్షేమంగా బయటపడే మార్గమూ తెలియాలి. మనమంతా లాక్‌ డౌన్‌ 3 అనుకుంటున్నాం కదా.. నిజానికి అది, లాక్‌డౌన్‌కు కొనసాగింపు కాదు.. ఉపసంహరణ (ఎగ్జిట్‌ ప్లాన్‌) 1. ఇప్పుడు కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ 4 కూడా ఎగ్జిట్‌ ప్లాన్‌ 2 అని నిపుణులు భావిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం భారతదేశంలో మాత్రమే అత్యంత వ్యూహాత్మకంగా, పూర్తి అప్రమత్తతతో అమలు చేసిన ప్రణాళిక. 

కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ వాళ్ల మనసులో సుస్థిర స్థానం కల్పిస్తుంది. కరోనా కష్ట కాలంలో మోదీ విషయంలోనూ ఇది నూటికి నూరు శాతం నిజం. ప్రపంచమంతా పిల్లిమొగ్గలు వేస్తుంటే సరైన సమయంలో లాక్‌డౌన్‌ అనే సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రతిష్ఠ మరింత పెరిగింది. ఆపద ముంచుకు వచ్చినప్పుడు మోదీ అందించిన ఆపన్నహస్తం కొన్ని కోట్ల మందిని ఆకలి నుంచి ఆదుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడడమే తక్షణ కర్తవ్యం అంటూ తీసుకున్న నిర్ణయాలు ప్రజల మనసులో మోదీకి సుస్థిర స్థానాన్ని కల్పించాయి. నిజానికి, ఉచిత పథకాలు ప్రకటించాలని, రాయితీలు ఇవ్వాలంటూ ఎంతోమంది ఎన్నో డిమాండ్లు చేశారు. కానీ, అవినీతిపరుడు అయినా కాకపోయినా ఫక్తు రాజకీయ నాయకుడు ఓట్లు, ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే.. దూరదృష్టి ఉన్న నిజమైన నాయకుడు మాత్రం ప్రజల సంక్షేమంతోపాటు దేశ భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును, దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తాడు. 

దేశానికీ దృఢమైన భవిష్యత్తును నిర్మించే నేపథ్యంలో నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రధాని మోదీ కూడా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి అనే ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీని ప్రకటించినా, ఆర్థిక క్రమశిక్షణకే పెద్దపీట వేశారు. కష్టకాలంలో ప్రజలను, పరిశ్రమలను ఆదుకుంటూనే, ప్రజల బంగారు భవిష్యత్తుకు బాట వేశారు. అందుకే, మోదీ మన వెంటే (సాత్‌) ఉన్నాడనే విశ్వాసం ప్రతి ఒక్కరికీ (సబ్‌ కా) కలిగింది. మన దేశ ప్రతిష్ట దశ దిశలా వెలగాలంటే ప్రధాని మోదీ ఈ ఏడాది కాలంలో మనకు చూపించిన దిశలోనే కరోనా కాలంలో, ఆ తర్వాత కూడా మనం ముందుకు సాగాలి. ఈ దిశగా భారత మాత సేవకు, భారతీయుల సేవకు పునరంకితమవుతున్నాము.

వ్యాసకర్త : జి. కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
ఈ–మెయిల్‌: gkishanreddy@yahoo.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా