రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్‌

22 Jul, 2020 00:31 IST|Sakshi

సందర్భం

విస్తరణవాద పాలక బీజేపీకి వ్యతిరేకంగా అస్తిత్వ పోరా   టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి–రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కూ, అతని డిప్యూటీ సచిన్‌ పైలట్‌కూ మధ్య వైరం దాపురించాల్సిన సమయం అయితే కాదు. కొద్ది వారాల క్రితమే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్‌ పార్టీ విధేయుడు, జనాకర్షణ కలిగిన నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుచేసి బీజేపీలో చేరి, తనకు విధేయులైన ఎమ్మెల్యేల సహాయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దించేశారు.రాజస్తాన్‌లో ఆయన మిత్రుడు, చిరకాల పార్టీ సహచరుడు సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు బావుటాను లేవనెత్తి, 19 మంది దాకా సహచర ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ పాలనలో ఉన్న హరియాణాలోని ఒక హోటల్‌లో ఉంచారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్‌గా, ఉప ముఖ్యమంత్రిగా అధికార పదవులు నిర్వహించిన ఈ వారసత్వ నాయకుడు కూడా గెహ్లోత్‌ ప్రభుత్వాన్ని దించడానికి బీజేపీ సహాయాన్ని తీసుకోవటానికి విముఖత చూపబోరని తెలుస్తోంది. గోవా, మణిపూర్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రజాదరణ పొంది ఓట్లు, సీట్లు గెలిచిన తరువాత కూడా ఆయా రాష్ట్రాలను బీజేపీకి కోల్పోయిన కాంగ్రెస్, ఇప్పుడు రాజస్తాన్‌ను కూడా చేజార్చుకునే పరిస్థితిలో ఉంది. ఇది రెండు నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగానే జరిగివుండేది కానీ, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అప్రమత్తత వలన, ఆయనకున్న ప్రాంతీయ రాజకీయ బలం వలన ఆ ప్రమాదం తప్పిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ, జాతీయ నాయకత్వపు పరస్పర విరుద్ధమైన దృక్పథంతో నడిచే సంఘటనలు ఇలా మలుపు తిరగటం దీర్ఘకాలంగా పరిస్థితులను గమనిస్తోన్న కాంగ్రెస్‌ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించలేదు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే, కాంగ్రెస్‌ నాయకత్వానికి తన ప్రతిభను కలిపివుంచడానికి ఏదైనా వ్యూహం ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది.

మధ్యప్రదేశ్‌లో, నెలల తరబడి సంకేతాలు అందుతూవున్నప్పటికీ, దాని అత్యంత ప్రజాకర్షణ కలిగిన జ్యోతిరాదిత్య సింధియా నుండి సూచనలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ హైకమాండ్‌ సింధియా ఎప్పటికీ బీజేపీతో చేతులు కలపగలరని నమ్మలేదు. తననెంత ఊపిరాడకుండా చేసి, పక్కకు నెట్టివేశారో సింధియా కాంగ్రెస్‌ నాయకత్వానికి తెలిసేలా చేశారు. అప్రమత్తమైన బీజేపీ ఈ పగుళ్లను మరింత పెద్దవి చేసి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. రాజస్తాన్‌లో కూడా ఇదే విధమైన అవకాశాన్ని పళ్ళెంలో పెట్టి మరీ బీజేపీకి అందించింది కాంగ్రెస్‌. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చేదు సంఘటనలను గమనిస్తే ఇలాంటిదేదో జరుగబోతోందని తెలుస్తూనే వుంది. తన డిప్యూటీ ఇలాంటి మురికిచర్యకు పాల్పడతాడని తానెప్పుడో అనుమానించినా, దాన్ని ఎప్పుడూ బహిరంగపరచలేదని ఇప్పుడు గెహ్లోత్‌ అంటున్నారు. 2018లో ప్రభుత్వం ఏర్పడేనాటికే వీరిద్దరి మధ్యా కనీసం మాట్లాడుకునేపాటి సంబంధాలు కూడా లేవు.

ఇప్పుడు యుద్ధం బట్టబయలుగానే ఉంది. పైలట్, బీజేపీలపై అందరినీ దిగ్భ్రాంతిపరిచే భాషలో గెహ్లోత్‌ మెరుపుదాడి చేశారు. వాస్తవానికి, ప్రభుత్వాన్ని కాపాడటానికి గెహ్లోత్‌ ముందుండి పోరాడుతున్నారు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, పైలట్‌తో సున్నితంగా వ్యవహరించాలనే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశాలను కూడా ఆయన విస్మరిస్తున్నారు. హైకమాండ్‌ ఇప్పటికీ పైలట్‌ను నిలుపుకోవాలనుకుంటోంది గానీ గెహ్లోత్‌ దాన్ని అంగీకరించే మానసిక స్థితిలో లేరు. అందువల్ల, పైలట్‌ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం కష్టమయ్యేలా చేస్తున్నారు గెహ్లోత్‌. పార్టీ మీద హై కమాండ్‌ ప్రాబల్యం తగ్గిందేమోననే సంకేతాన్నిస్తున్నట్టుగా.. పైలట్‌ బీజేపీతో రాసుకుపూసుకు తిరిగాడనీ, అతడు ‘పనికిమాలినవాడ‘ని తనకెప్పుడో తెలుసుననీ చెలరేగిపోయారు.  

ఇప్పటికైతే గెహ్లోత్‌కు సంఖ్యాబలం ఉన్నట్టే కనబడుతోంది; విశ్వాస పరీక్షలో నెగ్గుతాననే  నమ్మకమూ ఉన్నట్టుంది. పైలట్‌ మీద, ఇతర తిరుగుబాటుదారుల మీద అనర్హత వేటు వేసి, మ్యాజిక్‌ నంబ రును తగ్గించేదాకా ఆయన విశ్రమించరు. ఇప్పటికైతే తిరుగుబాటుదారులకు స్పీకర్‌ కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారు. వీటికి స్పందించే అనుకూల పరిస్థితి లేదని పైలట్‌ వాటిని సవాల్‌ చేస్తున్నారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు జూలై 24 వరకు వేచి చూడమని స్పీకర్‌ను కోరింది. పైలట్‌ పిటి షన్‌ మీద ఆరోజు ఆదేశం వెలువడే అవకాశం ఉంది.

వ్యాసకర్త
లక్ష్మణ వెంకట్‌ కూచి , సీనియర్‌ జర్నలిస్టు
ఈ–మెయిల్ ‌: kvlakshman@gmail.com

మరిన్ని వార్తలు