ప్రపంచానికి సంజీవని యోగా 

21 Jun, 2020 00:34 IST|Sakshi
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

సందర్భం

ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా చూపిన చొరవతో, ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబర్‌ 11న ఆ సంస్థ తీర్మానించింది. ఈ తీర్మానం అద్భుతం అనిపించుకోవడానికి కారణం దానికిగల సార్వత్రిక స్వభావం. పైగా యోగాకు ఇప్పుడు యావత్‌ ప్రపంచ ఆమోదం కూడా లభించింది. ఈ తీర్మానంతో, భౌగోళికంగా విడిపోయి ఉన్న ప్రపం చం.. యోగాతో ఐక్యతవైపు మళ్లిందన్నది వాస్తవం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 177కుపైగా దేశాలు మద్దతు పలుకగా, మరో 175 దేశాలు తీర్మానాన్ని సమర్థించడమే ఇందుకు నిదర్శనం.  

అంతేకాకుండా ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన ఏ తీర్మానానికి కూడా ఇంత అత్యధిక సంఖ్యలో సమర్థన లభించకపోవడం విశేషంగా భావించాలి. పైగా ఐక్యరాజ్యసమితిలో ఒక దేశం ప్రతిపాదన ప్రవేశపెట్టి, దాన్ని 90 రోజుల్లోగా సాకారం చేసుకోగలగడం కూడా సర్వసభ్య సమావేశాల చరిత్రలో ఇదే తొలిసారి కావడం మరీ విశేషం. ముఖ్యంగా ‘5,000 ఏళ్ల చరిత్ర కలిగిన మన ప్రాచీన వారసత్వానికి వాస్తవమైన గుర్తింపును ఆపాదించే యోగా’కు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కలిగించే దిశగా దేశంలో ఇన్ని దశాబ్దాలుగా ఎన్నడూ ప్రయత్నమే జరగలేదు.  

అలాంటి పరిస్థితిలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక కేవలం ఆరు నెలల్లోనే ఈ అద్భుతం సాధించారు. ఆరోగ్యం–శ్రేయస్సు దిశగా మానవాళి ఆకాంక్షకు యోగా ఒక ప్రతీక అని ఆయన చక్కగా వివరించారు. పైగా పైసా ఖర్చులేని ఆరోగ్యధీ(బీ)మా లభిస్తుందని చాటారు. ప్రపంచం అనారోగ్యం నుంచి ఆరోగ్యంవైపు వెళ్లేందుకు యోగా మార్గం చూపించిందన్నారు. ‘‘యోగా ఒక మతం కాదు... శ్రేయస్సు. అది యవ్వనోత్సాహంతో కూడిన మనస్సు,శరీరం, ఆత్మల నిరంతర అనుసంధాన శాస్త్రం’’.  మానవాళి శాంతిసామరస్యాలను ప్రతిబింబించే సందేశాన్ని ప్రపంచానికి యోగా అందిస్తుంది. ఇది ‘ఆత్మనుంచి ఆత్మవైపు, ఆత్మద్వారా పయనం.’ ‘‘పతంజలి యోగ సూత్రం’’ పేరిట పతంజలి మహర్షి రూపొందించిన గ్రంథం జగత్ప్రసిద్ధం. అలాగే  భగవద్గీత, ఉపనిషత్తుల వంటి ప్రసిద్ధ హిందూ గ్రంథాల నుంచి యోగా–యోగాభ్యాసాల సారాంశాన్ని అనువదించిన ఘనత శ్రీ అరబిందోకు దక్కింది.  

ఇక బి.ఎస్‌.అయ్యంగార్, మహర్షి పరమహంస యోగానంద వంటివారు ఈ యోగా జ్ఞానా న్ని ప్రపంచవ్యాప్తం చేసి గౌరవాదరాలు పొందారు.  ఆ మేరకు వారు ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారానే గాక తమ క్రమశిక్షణ, ప్రేరణాత్మకమైన జీవనశైలి ద్వారా ప్రపంచమంతటా యోగాను విస్తృతంగా వ్యాప్తి చేశారు. పాశ్చాత్య దేశాలలో యోగా ఘనతను, ప్రాముఖ్యాన్ని గొప్పగా చాటిన భారతీయులలో స్వామి వివేకానంద అగ్రగణ్యుడుగా ఘనత పొందారు. పాశ్చాత్య ప్రపంచానికి వేదాం తం, యోగా వంటి భారతీయ తత్వశాస్త్రాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించింది ఆయ నే. భారతీయ తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతపై ఆయన వాగ్ధాటి షికాగోలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది. 

ప్రపంచీకరణవల్ల విశేషంగా విజయవంతమైన అంశాల్లో యోగా కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది మానవాళి చైతన్యం, శ్రేయస్సుకు సంబంధించి అత్యంత విస్తృతంగా నిర్వహించుకునే వేడుకగా మారింది. ప్రాంతాలు, మతాలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నేడు ఆరోగ్యం–ఆనందం కీలకాంశాలుగా భిన్నధోరణులు గల ప్రపంచాన్ని ఒక్కతాటి పైకి చేరుస్తున్న అత్యంత విజయవంతమైన సంధానకర్త ఇదే. భిన్న ధ్రువాల ప్రపంచంలో కుటుంబం, సమాజం, దేశాలను ఐక్యం చేయగల బలమైన శక్తి యోగా. 

పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా వినియోగంలో ఉన్న అనుబంధ ఆరోగ్య విధానంగా యోగా వెలుగొందుతోంది. అంతేకాకుండా యోగాతో తమ జీవితాలకు సమకూరే లబ్ధి గురించి కూడా ప్రపం చం నేడు తెలుసుకుంటోంది. యోగాతోపాటు ధ్యానం చేయడంవల్ల వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయవచ్చని, అనేక వ్యాధుల బారినుంచి రక్షణ లభిస్తుందని అమెరికా జాతీయ వైద్య గ్రంథాలయం ప్రచురించిన నివేదిక పేర్కొనడం ఇందుకు నిదర్శనం.  

యోగాభ్యాసంతో వ్యక్తుల మానసిక వికాసంతోపాటు జీవితకాలం కూడా పెరుగుతుంది. యోగా భౌతికంగా ఆరోగ్యం బాగుపడటానికేగాక భావోద్వేగపరమైన, మానసిక శ్రేయస్సుకూ దోహ దం చేస్తుంది. ఇది మీ జీవిత కాలానికి మరిన్ని సంవత్సరాలను జోడించడమేగాక ఆ సంవత్సరాలకు జీవాన్ని కూడా జోడిస్తుంది. శరీరంలో రోగనిరోధక కణాల ప్రసరణను ప్రోత్సహించే పరమాణు మార్పులకు యోగా సాధన దోహదం చేస్తుందని పరిశోధనల ఫలితాలు పేర్కొంటున్నాయి.  

యోగా మనోభారాన్ని తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఆరోగ్యం, వ్యాయామ విద్యలో యోగా విడదీయలేని అంతర్భాగంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి నేటి ప్రపంచం సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో యోగా కేవలం బోధనాత్మక విద్యలోనే కాకుండా ‘అనుభవపూర్వక అభ్యాసం’లో కూడా భాగమవుతోంది. యోగాను ఒక అధికారిక క్రీడగా అమెరికా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఒలింపిక్స్‌లో పోటీపడే ఒక క్రీడగా కూడా యోగా మారగలదనే చర్చ కూడా సాగుతోంది. 

కోవిడ్‌–19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో నేడు హాలీవుడ్‌ నుంచి హరిద్వార్‌ వరకూ.. సామాన్యుల నుంచి మాన్యులదాకా అందరూ యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలను శ్రద్ధగా గమనించారు. నేను స్వయంగా హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ వాసిని. ఈ ప్రాంతం యోగా, ఆయుర్వేదాలకు పుట్టినిల్లు. వైరస్‌ మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడే మార్గం కోసం సకల ప్రపంచం ఇప్పుడు మనవైపు చూస్తోంది. నాలుగు గోడల మధ్య బందీ అయిన ప్రపంచానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీవన సమతౌల్యం నిలబెట్టుకోవడంలో యోగా అత్యంత సమర్థ ఆరోగ్య సాధనంగా ఆవిర్భవించింది.  

సాధారణంగా అయితే, మనం గతంలోలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకునేవారం. కానీ, ఇప్పుడు కోవిడ్‌–19 కారణంగా సామాజిక దూరం పాటిస్తూ మన కుటుంబంతో, పరిమితమైన ప్రదేశాల్లో ఈ వేడుక చేసుకోవాల్సి వస్తోంది. గత ఐదేళ్లుగా మనం సాధించిన యోగా దినోత్సవ స్ఫూర్తి కోవిడ్‌–19 వల్ల భగ్నం కారాదని అన్ని దేశాలకు, మొత్తంగా అంతర్జాతీయ సమాజానికి నా వినతి. కోవిడ్‌–19వల్ల పడిన మానసిక ప్రభావాన్ని ఉపశమింపజేయడానికి యోగా, ధ్యానమే ఉత్తమ చికిత్సగా పలు నివేదికలు, పరిశీలన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మన శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయగల వివిధ ‘ప్రాణాయామ’ పద్ధతులు యోగాలో ఉన్నాయి. ఆ మేరకు కరోనా వైరస్‌ ప్రభావాలను ‘ప్రాణాయామం’ ఎలా ఎదుర్కొనగలదన్న అంశంపై అధ్యయనాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.  

సమాజం... సహజ నిరోధం... సమైక్యతలకు యోగా ఏకైక సాధనమన్నది నూటికి నూరుపాళ్లూ వాస్తవం. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికం యుగయుగాలుగా అంతర్జాతీయ సమాజానికి మనమిస్తున్న సందేశం. ఇది నాటికీ.. నేటికీ.. ఎన్నటికీ సాపేక్షమేనన్నది వాస్తవం. అంతేకాదు... నిస్సందేహంగా ప్రపంచ శాంతిసామరస్యాలకు యోగా ప్రవేశ ద్వారం. 

రమేష్‌ పోఖ్రియాల్‌
వ్యాసకర్త కేంద్ర మానవ వనరుల 
అభివృద్ధి శాఖ మంత్రి


 

మరిన్ని వార్తలు