ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం అతి ప్రమాదకరం

8 May, 2019 03:23 IST|Sakshi

సందర్భం

దేశం ఎన్నికల కొలిమి నుండి ఎండల కొలిమిలోకి నడుస్తోంది. ఈ వేడిలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాల్లో విసురుతున్న సవాళ్లల్లో కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోతున్నాము. అటువంటి వాటిలో ఒకటి పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య ఉండాల్సిన సంబంధం. మోదీ అధికారానికి రావటానికి ముందే ఈ దేశాన్ని కాంగ్రెస్‌ చెర నుండి విముక్తి చేయటం లక్ష్యంగా ప్రకటించుకున్నారు. అధికారానికి వచ్చాక దేశాన్ని ప్రతిపక్షం నుండి విముక్తి చేయటమే లక్ష్యమని సవరించుకున్నారు.  మరోవైపున ఆర్నెల్ల క్రితం ఎన్నికలు జరిగిన తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు, కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయనున్నట్లు వార్తలు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ జెండా కింద గెలిచిన దాదాపు పాతికమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పచ్చ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో కలిపేసుకున్నారు. కొద్దికాలం క్రితం జమ్ముకాశ్మీర్‌లో బీజేపీ, పీడీపీల పొత్తు వికటించిన తర్వాత పీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలో విలీనం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. చివరకు పీడీపీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు జతకట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని గవర్నర్‌ను కోరటంతో బీజేపీ రాష్ట్రపతి పాలన విధించింది. ప్రతిపక్షాన్ని కబళించటం పాలకపక్షం హక్కయింది. ఈ నేపథ్యంలో కొన్ని మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
ప్రతిపక్షం ప్రజాస్వామ్య మౌలిక లక్షణాల్లో ఒకటి. ప్రతిపక్షం అంటే ప్రశ్నించే శక్తి. ప్రభుత్వ తప్పొప్పులను పరిశీలించి జవాబుదారీతనం కోరే శక్తి. ఐదేళ్లకొకసారి ప్రజల ముందుకొచ్చే ఎన్నికల్లో ఏదో ఒక మోతాదులో ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకుతెచ్చే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయం ప్రతిపాదించటం అంటే పాలకపక్ష వైఫల్యాలను ముందు పరిశీలించాలి. విమర్శించాలి. ప్రజలకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని గుర్తించి అర్థం చేసుకుని నివారణ అవకాశాలను ప్రజల ముందుంచాలి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను, దొర్లిన పొరపాట్లను గుర్తించి ప్రజల ముందు ఎత్తి చూపాలి. బహుశా ప్రతిపక్షం ఉంటే తమ వైఫల్యాలు, చేతగానితనం బండారం ఒకరోజు కాకపోతే మరో రోజైనా బట్టబయలు కాక తప్పదన్న సూత్రాన్ని పాలక పార్టీలు అర్థం చేసుకున్నట్లు ఉన్నాయి. అందుకే అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే సరిపోతుందన్న అంచనాకు వచ్చినట్లున్నాయి. 

ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం గురించి చర్చించాలనుకున్నపుడు పురాణాల్లో ప్రతిపక్షం పాత్ర, ప్రతిపక్షం లేకపోవటం వల్ల కలిగిన నష్టాలను గుర్తు చేసుకోవటం అవసరం అనిపిస్తోంది. రామాయణంలో దశరధుడు రాముడిని వనవాసం పంపాలని నిర్ణయించినప్పుడు ఎందుకు, ఎలా అన్న ప్రశ్నలు ఎవ్వరూ వేయలేదు. సీతను అడవిలో విడిచి రమ్మని రాముడు ఆదేశించినప్పుడు ఇది నైతికమా, చట్టబద్ధమా, న్యాయసమ్మతమా అని ఎవ్వరూ ప్రశ్నించలేదు. రావణుడు సీతను అపహరించుకు వచ్చినప్పుడు మండోదరి మనకు ఇది తగదు అని చెప్పిందే తప్ప ప్రతిఘటించలేదు. రాముడితో కయ్యానికి కాలు దువ్వటం తగదు అని కనీసం విభీషణుడు ఎదురు తిరిగాడు. రావణుడు కాదు కూడదు అన్నప్పుడు లంక నుండి వాకౌట్‌ చేశాడు. ఇది ప్రతిపక్షం. ఇదే ప్రతిపక్షానికి తగిన బలం ఉంటే రామ రావణ యుద్ధం జరిగి ఉండేదే కాదు. ఇవి మినహా రామరాజ్యంలో ప్రతిపక్షానికి తావు లేదు. లంకలోని రావణ రాజ్యంలోనే ప్రతిపక్షానికి చోటు ఉంది. ఈ ప్రతిపక్షం మాట కూడా విననప్పుడు లంక రావణ కాష్ఠమైంది. 

మహాభారతంలో పాచికలాటలో ద్రౌపదిని పణంగా పెట్టేటప్పుడు కొలువులో ఉన్న పెద్దలందరూ ముఖముఖాలు చూసుకున్నారే తప్ప ఎవ్వరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. మహాభారతంలో పాలకుల నిర్ణయాలను ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని నాటి సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు నిలదీసి అడ్డుకుని ఉంటే మహాభారత యుద్ధం జరిగేదే కాదు. కౌరవసేనలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి తర్వాత పెద్దవాడు వికర్ణుడు. వస్త్రాపహరణ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ వికర్ణుడు కూడా వాకౌట్‌ చేస్తాడు. కనీసం వికర్ణుడు పోషించిన ప్రతిపక్ష పాత్రను కురువృద్ధులు, గురువృద్ధులు పోషించి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు. మహా భారత, రామాయణాలే ప్రతిపక్షం పాత్ర గురించి హెచ్చరిస్తున్నాయి. నాటి కథలన్నీ రాచరికమూ, నియంతృత్వమే. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మరెన్ని ఉత్పాతాలకు దారి తీయనున్నాయో ఆలోచించుకోవటం ఓటర్ల వంతు.


-కొండూరి వీరయ్య
వ్యాసకర్త రాజకీయ వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు