గిరిధర్‌గౌడ్‌ కుంచెకు సన్మానం!

29 Dec, 2018 01:13 IST|Sakshi

అక్షర తూణీరం

‘ప్యారిస్‌ ఆఫ్‌ ఆంధ్రా’ తెనాలికి సమీపంలో, సుక్షేత్రం సంగం జాగర్లమూడికి పది అంగల దూరంలో ఉంటుంది గరువుపాలెం. రాయన గిరిధర్‌ గౌడ్‌ అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే ఉంటున్నారు. తండ్రి తెలుగు ఉపాధ్యాయులు. బోర్డుమీద బొమ్మలు గీస్తూ, ఆసక్తికరంగా పాఠాలు చెప్పడం ఆయనకు ఇష్టం. అలా పరంపరగా గిరిధర్‌కి రేఖలు అంటుకున్నాయ్‌. తర్వాత అవి నిగ్గుతేలాయి. పది పదకొండేళ్ల వయసులో జాగర్లమూడిలో డ్రాయింగ్‌ మాస్టారు దీవి సుబ్బరాయశాస్త్రి కొంత శిక్షణ, మరింత ప్రోత్సాహం ఇచ్చారు. ఇంటర్మీడియట్‌ కాగానే మైసూరు చామరాజేంద్ర అకాడమీ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌ కళాశాలలో స్వయంప్రతిభతో సీటు సంపాయించుకున్నారు.

ఇక్కడ పట్టా తీసుకున్నాక రెండేళ్లు బెంగళూరులో ఉన్నారు. జానపద అకాడమీ వారి కోసం పలు మీనియేచర్స్‌ రచించి ఇచ్చే సదవకాశం వచ్చింది. లఘుచిత్ర క్షేత్రంలో పలువురు పెద్దలవద్ద మెలకువలు నేర్చుకున్నారు. చిత్రకారునిగా నిలదొక్కుకుంటున్న తరుణంలో, భుజంమీద వాత్సల్యాభిమానాలతో చేయివేసి కొండంత భరోసా ఇచ్చిన పోలీస్‌ ఉన్నతాధికారి కె. సదాశివరావుకి వినమ్రంగా శిరసు వంచుతాడు. తర్వాత మజిలీలో సద్విమర్శలతో ఆదరించిన కాండ్రేగుల నాగేశ్వరరా వుని అనుక్షణం గుర్తు చేసుకుంటారు. 

ప్రపంచ చిత్రకళకు హద్దులు చెరిపేసిన పికాసో ఎన్నో వినూత్న పంథాలకు దారులు వేశాడు. ఆయన దక్షిణ ఫ్రాన్స్‌లో మధ్యధరా సముద్ర తీరాన ఉన్న ఒక విశాల సౌధంలో ఉండేవాడు. అదొక చిన్న గ్రామం. అది పికాసో గ్రామం. అక్కడి చేతివృత్తుల వారితో పికాసో చెలిమి. వడ్రంగులు, కుంభకారులు, బెస్తవారు, నేతపని వారు, రైతులు, వీధి కళాకారులు వీరితో మాత్రమే కలిసేవాడు. వారితో ఆడేవాడు, పాడేవాడు, తాగి తందనాలాడేవాడు.

పికాసోని వేరొకరికి కలవడం, మాట్లాడ్డం అయ్యేపని కాదు. ప్రముఖ పాత్రికేయులు, నాటి ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ సంపాదకులు ఎ.ఎస్‌. రామన్‌ తను ఎంత శ్రమతో పికాసో దర్శనం చేసిందీ తన జ్ఞాపకాల్లో రాశారు. చివరకు జీన్‌ అనే ఒక వృద్ధుని ద్వారా సాధ్యపడిం దని చెప్పారు. గరువు పాలేన్ని గిరిధర్‌ గౌడ్‌ని కలిపి చూసినపుడు నాకీ సంఘటన జ్ఞాపకం వచ్చింది. గిరిధర్‌లోంచి ఆ గ్రామాన్ని బయటకు లాగలేం. ఆయనని కూడా గ్రామం నించీ లాగలేం. అదే ఆయనకు శ్రీరామ రక్ష. గిరిధర్‌కి చిన్నతనంలోనే ప్రఖ్యాత కళా స్రష్ట, విమర్శకులు సంజీవ్‌ దేవ్‌తో పరిచయమైంది. సంజీవ్‌ దేవ్‌ తుమ్మపూడిలో నిలబడి, రంగురంగుల ఊలుదారంతో భూగోళాన్ని బెలూన్‌గా ఎగరేసిన అసాధారణ వ్యక్తి. 

గిరిధర్‌ గౌడ్‌ పూర్తిగా జానపద కళాకారుడు. తన నేత పనులు చేత పనులు తన నట్టింట కూచుని నెలల తరబడి చేసుకుంటాడు. నగరాలలో ఉండే సంతల్లో ప్రదర్శించి సొమ్ము చేసుకుంటాడు. మళ్లీ కొత్త ఆలోచనలతో గరువుపాలెం వస్తాడు. కలువలు నిండిన ఊర చెరువు, పంట కాలువలు, రెల్లు దుబ్బులకు వేలాడే గిజిగాడి గూళ్లు, అవిశె చెట్లకు అల్లుకున్న తమలపాకు తీగెలు, పచ్చపచ్చని అరటి, నిమ్మతోటలు బోలెడు ఐడియాలిస్తాయి. గిరిధర్‌ ప్రాచీనులు వాడిన రంగుల్ని కొత్తగా వాడతాడు. గుంటూరు అన్నమయ్య లైబ్రరీలో గిరిధర్‌ చిత్రించిన పోట్రెయిట్స్‌ పదిదాకా కనిపిస్తాయ్‌. గాంధీ, ఠాగోర్, ఆదిభట్ల నారాయణ దాసు ఇత్యాదులంతా కళ్లెదుట కనిపిస్తారు. ఆయన చిత్రించిన వృషభధారా వాహిక ఒక అద్భుతం.

చాలా శాస్త్రీయంగా అధ్యయనం చేసి వేసిన ‘దశావతారం’ కన వేడుక. గిరిధర్‌కి చిత్ర శిల్పిగా కొన్ని లెక్కలున్నాయ్‌. వేసే బొమ్మపై పూర్తి అవగాహన లేకుండా రంగంలోకి దిగరు. చూసే కొందరికి ఇది చాదస్తం అన్పించవచ్చు. దాన్నాయన ఖాతరు చెయ్యరు. శ్రీనాథుడు తన రచనల్లో దేవుళ్లని మనుషుల్లోకి దింపేశాడని ప్రతీతి. గిరిధర్‌ ఒక సిరీస్‌లో అదే పని చేశాడు. పార్వతి కాళ్లమీద వేసుకుని గణపయ్యకి నీళ్లుపోస్తూ ఉంటుంది. ఎంత ముచ్చటైన ఆలోచన. గిరిధర్‌ కళారంగంలో చాలా విస్తృతంగా పరిశీలించాడు. పరిశోధించాడు. రూప లావణ్యాలలో ప్రత్యేకత ఉంది. రంగుల రంగరింపులో గిరిధర్‌ వేలిముద్ర కనిపిస్తుంది. చిత్ర కళారంగంలో ఉన్న శాఖలన్నింటిలో రాణకెక్కారు. ఇంకా వయసులో చిన్నవారు. గిరిధర్‌ గౌడ్‌లో ఉన్న కల్తీలేని నమ్రత ఆయనని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తుంది. సందేహం లేదు. అప్పుడు అందరం మా గిరిధర్, మా తెనాలి, మా తెలుగు, మన భారతీయుడు అని కాలర్‌ ఎగరేసుకుంటాం. తథాస్తు!
(జనవరి 4న గిరిధర్‌ గౌడ్‌ అజో,విభో అవార్డు అందుకుంటున్న సందర్భంగా)


వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు