హన్‌ దురహంకారం!!

21 Jun, 2020 00:20 IST|Sakshi

జనతంత్రం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం రోజు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం దేశ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. దేశభద్రత, సార్వభౌమాధికారాలకు సవాళ్లు ఎదురైనప్పుడు విభేదాలను పక్కన పెట్టి ఏకతాటిపై నిలబడగలిగే గొప్ప స్వభావం మన దేశ రాజకీయ వ్యవస్థకు ఉన్నదని నిర్ద్వంద్వంగా వెల్లడైంది. సమావేశానికి హాజరైన పార్టీల అధినేతలూ, ముఖ్యమంత్రుల్లో అత్యధిక సంఖ్యాకులు ప్రధానమంత్రి నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. తమ సలహాలనూ, సూచనల్ని కూడా కేంద్రానికి నివేదించారు.

భారత జాతి సమగ్రత కోసం కేంద్రానికి మద్దతు ప్రకటించిన నాయకులలో బీజేపీ ప్రత్యర్థి కూటమిలోని భాగస్వామ్య పక్షాల నాయకులైన శరద్‌ పవార్, స్టాలిన్‌లు ఉన్నారు. బీజేపీకి బద్ధ వ్యతిరేకమైన మమతా బెనర్జీ కూడా ఉన్నారు. ఏ కూటమితో సంబంధం లేని కేసీఆర్, వైఎస్‌ జగన్, నవీన్‌ పట్నాయక్‌ వంటి స్వతంత్ర నాయకులూ ఉన్నారు. ఎటొచ్చీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున హాజరైన సోనియాగాంధీ కొంత పెడసరంగా మాట్లాడారు. ఇక కమ్యూనిస్టుల సంగతి తెలిసిందే. అంతర్జాతీయవాదులైన కారణంగా వారి మాటల్లో ‘జాతీయాలు’, నుడికారాలు ఉండవు. మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో నిలిచిన ఈ సందర్భం దేశ ప్రజలకూ, అంతర్జాతీయ సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.

లద్దాఖ్‌లో చైనా పీపుల్స్‌ ఆర్మీ ఇప్పుడు కవ్వింపు చర్యలకు ఎందుకు దిగింది? అధికారికంగా భారత ప్రభుత్వం అంగీకరించకపోయినప్పటికీ, గడిచిన రెండు మాసాలుగా ‘భారతీయ’ భూభాగాల్లో (వాస్తవాధీన రేఖను దాటి) చైనా సైనికుల కదలికలు కనిపిస్తున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్న పదిహేనవ తారీఖు అర్ధరాత్రి భారత సైనిక బృందంపై దొంగదాడి చేసి కల్నల్‌ స్థాయి అధికారి, తెలుగువాడైన సంతోశ్‌బాబు సహా ఇరవైమందిని చైనా సైన్యం దారుణంగా హింసించి చంపేసింది. వెంటనే భారత సైన్యం చేసిన ప్రతిదాడిలో కొందరు చైనా సైనికులు కూడా చనిపోయినట్టు సమాచారం. చైనా సైన్యం కాలుదువ్విన ఈ ఘటన వెనుకగల కారణాలపై రకరకాల కథనాలూ, విశ్లేషణలూ వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భారతదేశం ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టినందువల్ల, ఇది సహించని చైనా పాలకులు ఒక హెచ్చరికగా ఈ దాడి చేశారని ఒక వాదన వుంది.

తన ప్రధాన శత్రువైన అమెరికాతో భారత్‌ స్నేహబంధం పెరగడం కూడా చైనా సహించలేకపోయిందని మరో అభిప్రాయం. తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ను అడ్డుకునేందుకే అమెరికా నాయకత్వంలోని ఇండో – పసిఫిక్‌ వ్యూహాత్మక కూటమిలో భారత్‌ చేరిందనీ, అందువల్ల దక్షిణాసియాలోనే భారత్‌ను కట్టడి చేసే విధంగా అటు నేపాల్‌ను రంగంలోకి దించడంతోపాటు ఇటు లద్దాఖ్‌లో తానే స్వయంగా రంగంలోకి దిగిందనే కథనాలు వచ్చాయి. ఇవన్నీ వాస్తవాలే. కాకపోతే ఇవన్నీ ఒక పెద్ద కథలో ఉపకథలు. ఆ పెద్ద కథను ఆసాంతం చదివితేనే స్వాభిమానం ముదిరి దురహంకారం దశకు చేరుకున్న హన్‌ జాతీయత దూకుడు వ్యవహారం అర్థమవుతుంది. ఇరవయ్యో శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ఫలితంగా బ్రిటన్‌ ‘ప్రపంచ వర్క్‌షాప్‌’గా మారినట్టే, ఇప్పుడు ‘ప్రపంచ వస్తూత్పత్తి కర్మాగారం’గా చైనా మారింది. బ్రిటన్‌ను వలసల వేటకు బయల్దేరదీసిన మాంచెస్టర్‌ బట్టల మిల్లుల సైరన్‌మోతల శంఖారావం ఇప్పుడు షెన్‌జెన్‌ కర్మాగారాల ఇంజన్‌ మోతల్లో వినబడుతున్నది.

చైనాకు సంబంధించినంతవరకు నాలుగువేల సంవత్సరాల అవిచ్ఛిన్న రాచరిక చరిత్ర మనకు అందుబాటులో ఉన్నది. ఈ నాలుగు వేల సంవత్సరాల కాలంలో చైనా ప్రజల్లో ఒక నమ్మకం చెక్కుచెదరకుండా నిలిచి ఉంది. ఈ ప్రపంచం మొత్తానికి చైనాయే కేంద్రస్థానం అనేది హన్‌ చైనీయుల విశ్వాసం. మూడువేల సంవత్సరాల తర్వాత మంగోల్‌ తెగల జైత్రయాత్రల ఫలితంగా దాదాపు రెండు శతాబ్దాల పాటు హన్‌ జాతీయులు రాజ్యాధికారానికి దూరమయ్యారు. మళ్లీ మింగ్‌ వంశం అధికారంలోకి వచ్చిన తర్వాత హన్‌ జాతీయభావం ఆకాశాన్నంటింది. ఈ కాలం నిజంగానే చైనా స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ జీడీపీలో మూడో వంతు సంపదను చైనా సృష్టించిందన్న అంచనాలు వెలువడ్డాయి. పదిహేడో శతాబ్దంలో మరోసారి చైనా సింహాసనం హన్‌ జాతీయుల చేజారింది. మంచూ జాతికి చెందిన చింగ్‌ రాజవంశం రెండున్నర శతాబ్దాల పాటు చైనాను పాలించింది. ఈ పాలకుల చివరి రోజుల్లో చైనా ప్రతిష్ఠ దెబ్బతిన్నది. జపాన్‌ దండెత్తి మంచూరియాను ఆక్రమించుకున్నది.

జపాన్‌ యూరప్‌ దేశాలు చైనా మెడలు వంచి అవమానకరమైన ఒప్పందాలపై చైనా పాలకుల చేత సంతకాలు చేయించుకున్నారు. హన్‌ జాతీయభావం గాయపడింది. చింగ్‌ రాచరికంపై సిన్హువా (నవచైనా) విప్లవం డాక్టర్‌ సన్‌యెట్‌ సేన్‌ నాయకత్వంలో విజయవంతమైంది. మావో జెడాంగ్‌ ఆధ్వర్యంలో జరిగిన కమ్యూనిస్టు విప్లవం అచ్చంగా ఒక జాతీయ విముక్తి పోరాటం తరహాలోనే జరిగిందని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. మావో రచనల్లోనూ, ఉపన్యాసాల్లోనూ చైనా చరిత్రపైనా, సంస్కృతిపైన ఒక ఆరాధనా భావం వ్యక్తమయ్యేది. కమ్యూనిస్టుల సమావేశాల్లో మాట్లాడినప్పుడు కూడా ఆయన చైనా సామెతలనూ, కథలను ఎక్కువగా ఉటంకిస్తూ ఉండేవారని ‘లాంగ్‌మార్చ్‌’ కాలంలో మావోను ఇంటర్వ్యూ చేసిన అమెరికన్‌ జర్నలిస్ట్‌ ఎడ్గార్‌ స్నో తన ‘రెడ్‌స్టార్‌ ఓవర్‌ చైనా’ పుస్తకంలో రికార్డు చేశారు. కచ్చితంగా చెప్పాలంటే చైనా జాతీయ పునరుజ్జీవనవిప్లవానికి కమ్యూనిస్టు పార్టీని ఒక వాహకంగా మావో ఉపయోగించారు. చైనా జాతీయత గురించి ప్రస్తావించేటప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఎక్కడా హన్‌ జాతి అనే మాట తెచ్చేవారు కాదు. జనాభాలో అత్యధిక సంఖ్యాకులు హన్‌ జాతివారే అయినప్పటికీ 55 రకాల ఇతర జాతులు కూడా చైనాలో ఉన్నాయి.

తన రాజకీయ పోరాటంలో భాగంగా మిగిలిన జాతులను కూడా కలుపుకొని పోవడానికి అందరినీ కలిపి ఆయన చైనా జాతిగా పేర్కొనేవాడు. ఆయన ఆశించినట్టుగానే ఈ డెబ్బయ్యేళ్లలో ఆ జాతులన్నీ ‘చైనీకరణ’ పొందాయి. అంటే, వాటి ఉనికిని కోల్పోయి హన్‌ జాతికి ఉపజాతులుగా మిగిలిపోయాయి. చైనా దురాక్రమణ చేసిన ప్రాంతాలైన టిబెట్‌లో టిబెటన్లు, షింజియాంగ్‌లో వీగర్‌ తుర్కీలు మాత్రం మిగిలారు. కానీ వారి మాతృ భూముల్లో వారు మైనారిటీలుగా మారిపోయి తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. 1960 ప్రాంతంలో ‘ది సన్‌డే టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌’ పత్రికకు తూర్పు ఆసియా కరస్పాండెంట్‌గా పనిచేసిన రిచర్డ్‌ హ్యూజ్‌ అభిప్రాయం ప్రకారం చైర్మన్‌ మావో జెడాంగ్‌ మొదట నేషనలిస్ట్, ఆ తర్వాతే కమ్యూనిస్టు. మావో విస్తరణవాద ఆకాంక్షలపై ఆయన కొన్ని కథనాలు రాశారు. ‘పూర్వపు చైనా సామ్రాజ్యపు భూభాగాలన్నీ చైనా ఆధీనంలోకి రావాలన్న కోరిక ఆయనకు ఉంది. ఆసియా ఖండం నుంచి అమెరికా ప్రభావాన్ని పూర్తిగా తొలగించి తన గుప్పిట్లోకి తీసుకోవాలనేది ఆయన మొదటి లక్ష్యం.

ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు దేశాలన్నింటికీ రష్యా బదులు తానే నాయకత్వం వహించాలనేది ఆయన రెండో లక్ష్యమని హ్యూజ్‌ అభిప్రాయపడ్డారు. టిబెట్‌ను ఆక్రమించిన తొలిరోజుల్లో చైర్మన్‌ మావో ‘అరచేయి – ఐదు వేళ్లు’ అనే ఒక కథను చెప్పేవారట. ఈ కథాక్రమం ఏమిటంటే టిబెట్‌ భూభాగాన్ని అరచేతిగా భావిస్తే దాని బొటనవేలు లద్దాఖ్, చూపుడువేలు నేపాల్, మధ్యవేలు సిక్కిం, ఉంగరం వేలు భూటాన్, చిటికెన వేలు అరుణాచల్‌. మరి అరచేయి ఎక్కడ వుంటుందో ఐదువేళ్లూ అక్కడే ఉండాలి కదా! మావో ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న షీ జిన్‌పింగ్, చైనా ఆర్థికంగా, సైనికంగా బలపడిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత దానిని ఆచరణలో పెట్టడానికి ప్లానింగ్‌ పూర్తిచేశారు. ఆ ప్లానింగే రోడ్‌ అండ్‌ బెల్ట్‌ ఇనీషియేటివ్‌(ఆర్‌బీఐ).

ప్రాచీన చైనా సామ్రాజ్యాల విస్తరణ కంటే మిన్నగా, మావో జెడాంగ్‌ ఆకాంక్షలకంటే విస్తృతమైన స్థాయిలో రోడ్‌ అండ్‌ బెల్ట్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమాన్ని షీ జిన్‌ పింగ్‌ ప్రభుత్వం డిజైన్‌ చేసింది. ఆర్థికవృద్ధి ఫలితంగా చైనాలో సంపన్నవర్గం, ఉన్నత మధ్య తరగతి, మధ్యతరగతి శ్రేణుల జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. చైనా రాజకీయ వ్యవస్థపై వీళ్ల మెదళ్లలో ప్రశ్నలు మొలకెత్తడం మొదలైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ఏకపక్ష నియంతృత్వ పాలన ఔచిత్యంపైనా, పెట్టుబడిదారీ వ్యవస్థ విధానాలను అమలు చేస్తూనే కమ్యూనిస్టు ముసుగు వేయడంపైనా వీరిలో అసంతృప్తి మొదలైంది. చైనా సమాజంలో బలీయమైన వర్గంగా తయారైన వీరందరినీ తన వెనుక సమీకృతం చేసుకోవలసిన అవసరం చైనా కమ్యూనిస్టు పార్టీకి ఏర్పడింది. దాని ఫలితంగానే హన్‌ చైనీయుల స్వాభిమానాన్ని పరుగులు పెట్టించే ఈ పథకాన్ని పార్టీ రూపొందించింది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 65 దేశాలను అనుసంధానించే ఈ బృహత్తర కార్యక్రమం నిజంగానే వాస్తవ రూపం దాల్చితే చైనా కేంద్రక ప్రపంచం సాకారమయినట్టే. సూపర్‌ పవర్‌గా చైనా తనను తాను ప్రకటించుకున్నట్టే.

ఈ పరిణామాన్ని ప్రస్తుత‘అధికారిక’ సూపర్‌పవర్‌ అమెరికా చూస్తూ ఊరుకోదు కదా! ఆర్‌బీఐని అడ్డుకోవడానికి పలు వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రారంభించింది. అందులో ముఖ్యమైనది ‘ఇండో–పసిఫిక్‌ స్ట్రేటజీ’. చైనాకు ప్రధాన శత్రువు అమెరికా. ఇండియా కాదు. కానీ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇండియా చురుగ్గా పాల్గొంటే చైనా ప్రతిష్టాత్మక పథకం ముందుకు కదలడం కష్టం. ఈ పథకం విజయవంతం కావడంపైనే చైనా రాజకీయ వ్యవస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకోసం ఇండియాను దక్షిణాసియాలోనే చికాకు పెట్టి దిగ్బంధం చేసే వ్యూహాన్ని చైనా అమలు చేస్తున్నది. చైనా వ్యూహాలను సరిగ్గా అర్థం చేసుకొని వ్యవహరించవలసిన అవసరం భారత్‌కు ఉన్నది. అంతే తప్ప కంటికి కన్ను – పంటికి పన్ను అనే ఆవేశపూరిత చర్యలు ఇక్కడ పనికిరావు. చైనా వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాలు తక్షణమే ఆచరణ సాధ్యమయ్యేవి కాదు. చైనా సూపర్‌ పవర్‌గా అవతరించడం భారత ప్రయోజనాలకూ భంగకరమే. ఆ పరిణామాన్ని అడ్డుకోవలసిందే. అందుకోసం బహుముఖీన యుద్ధసన్నద్ధత, దీర్ఘకాలిక ప్రణాళిక, వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటు అవసరం. హన్‌జాతీయ దురహంకార కవాతును నిలువరించడానికి భారత జాతీయ వాదులు ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉన్నది. ఆ దిశలో నిన్నటి అఖిలపక్ష సమావేశం తొలి అడుగును వేసింది.

వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు