8 మంది డీసీలకు త్వరలో పోస్టింగ్‌లు

20 Jul, 2015 01:33 IST|Sakshi

సీఎం ఆఫీస్‌లో ఫైల్ పెండింగ్
సాక్షి, హైదరాబాద్: వాణిజ్యపన్నుల శాఖలో ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ శాఖలో రాష్ట్రస్థాయి కేడర్‌లో పనిచేస్తున్న అధికారుల విభజన ప్రక్రియ ఇటీవల దాదాపుగా పూర్తయింది. ఏపీకి చెందిన 35 మంది అధికారులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల అధికారులు ఇక్కడికి వచ్చారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, సీటీవోల భర్తీ ప్రక్రియ వేగం అందుకుంది. ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను వివిధ డివిజన్‌లలో భర్తీ చేసేందుకు కమిషనర్ వి. అనిల్ కుమార్ ఫైలు తయారు చేసి ఇటీవలే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపించారు. ఈ మేరకు ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఫైలుపై సంతకాలు చేస్తే ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం డిప్యూటీ కమిషనర్లుగా ఆదిలాబాద్‌కు ఆనంద్ రావు, కరీంనగర్ కు ద్వారకానాథ్ రెడ్డి, హైదరాబాద్ రూరల్- కాశీ విశ్వనాథ్ రెడ్డి, పంజాగుట్ట- లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్- కె. హరిత, బేగంపేట- సాయి కిషోర్, వరంగల్ - లావణ్య, నల్లగొండ- గీతలను నియమించనున్నారు. వీరి భర్తీ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అసిస్టెంట్ కమిషనర్ల ఖాళీలను భర్తీ చేస్తారు.

వీటితో సీటీవోల భర్తీకి డీపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. పదోన్నతుల కోసం ఏర్పాటు చేసే ఈ కమిటీ సీనియారిటీ ఆధారంగా సీటీవోలకు అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తుంది. అలాగే డీసీటీవోలు సీనియారిటీ ఆధారంగా సీటీవోలు కానున్నారు. దీనికి సంబంధించి కమిషనర్ స్థాయిలో కసర త్తు సాగుతున్నా, వివిధ కారణాల వల్ల ఓ కొలిక్కి రాలేదు. డీసీల నియామకం పూర్తయిన వెంటనే ఈ ఫైలు కూడా కదులుతుందని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు