హైదరాబాద్‌ కొత్త సీపీ సందీప్‌ శాండిల్య | IPS Officer Sandeep Shandilya Has Been Appointed As New Hyderabad Commissioner Of Police - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ కొత్త సీపీ సందీప్‌ శాండిల్య

Published Sat, Oct 14 2023 2:37 AM

The new CP of Hyderabad is Sandeep Sandilya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన అధికారులు స్థానాల్లో కొత్త అధికారులు నియామకం అయ్యారు. ఈసీ ఆదేశాల మేరకు కీలక ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగంలో ఈ మేరకు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, వరంగల్‌ కమిషనరేట్లకు కొత్త పోలీసు కమిషనర్లను నియమించడంతోపాటు పది జిల్లాలకు ఎస్పీలను, నాలుగు జిల్లాలకు కలెక్టర్లను నియమించారు. అలాగే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖలకు కొత్త కమిషనర్లను నియమించారు.

సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ..
పనితీరుపై ప్రతిపక్షాల ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న నివేదికల ఆధారంగా 20మంది ఐపీఎస్, ఐఏఎస్, నాన్‌ కేడర్‌ ఎస్పీలను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ప్రతీ పోస్టుకు ముగ్గురు లెక్కన అధికారుల పేర్లను వారి నడవడిక, వార్షిక పనితీరు మదింపు, విజిలెన్స్‌ నివేదికలతో సహా తమకు పంపాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ జాబితాలను పంపగా.. సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తూ అధికారులను ఈసీ ఎంపిక చేసింది.

గతంలో నాన్‌ కేడర్‌ అధికారులు జిల్లాల ఎస్పీలుగా ఉంటే.. ఐపీఎస్‌ నుంచి నేరుగా రిక్రూటైన యువ అధికారులకు ఈసీ సూచనల మేరకు పోస్టింగ్‌లు లభించినట్టు సీఎస్‌ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఆయా అధికారుల సిన్సియారిటీ, కమిట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకుని, పలు ఇతర అంశాలపైనా పరిశీలన జరిపాక ఆయా పోస్టులకు సూచించినట్టు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement