శాంతి బాటపై తూటాలు

17 Jul, 2015 01:58 IST|Sakshi
పాక్ మోర్బార్ శకలాలను చూపిస్తున్న రణ్ బీర్ సింగ్ పురా వాసులు

చర్చలపై ముందుకు వెళ్లాలని మోదీ, షరీఫ్‌లు నిర్ణయించిన కొన్ని రోజుల్లోనే కాల్పుల చిచ్చు
♦  రెండు రోజులుగా పాక్ వైపు నుంచి భారత సైనిక శిబిరాలపై
♦  భారీగా కాల్పులు, మోర్టారు బాంబు దాడులు
♦  జమ్మూలో ఎల్‌ఓసీ వద్ద చొరబాటుకు ఉగ్రవాద మూక యత్నం..
♦  కేంద్ర మంత్రుల సమీక్ష... పాక్ దౌత్యాధికారికి భారత్ నిరసన
♦  కాల్పులు, చొరబాట్లను బలంగా తిప్పికొడతాం: దోవల్
♦  సరిహద్దులో పాక్ కాల్పుల హోరు  
♦  తిప్పికొట్టిన భారత బలగాలు


జమ్మూ/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానమంత్రులు ఒకవైపు శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తుండగా.. మరోవైపు రెండు దేశాల మధ్య సరిహద్దులో కాల్పుల చిచ్చు చెలరేగింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంట, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట.. బుధవారం కాల్పులకు తెగబడి ఒక మహిళ ప్రాణాలను బలితీసుకుని, ఐదుగురిని గాయపరచిన పాక్ సైనిక బలగాలు గురువారం ఉదయం కూడా భారత సైనిక శిబిరాలపై తుపాకులు, మోర్టార్లతో భారీ కాల్పులు కొనసాగించాయి.

ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని భారత సైనికాధికారులు తెలిపారు. పాక్ బలగాల కాల్పులను భారత సైనిక బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని పేర్కొన్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూలో పర్యటించనున్న నేపథ్యంలో.. గురువారం ఉదయం కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాద మూక ఒకటి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. దానిని భారత సైనిక బలగాలు భగ్నం చేశాయి. పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంపై.. భారత్ ఆ దేశానికి తన నిరసన తెలిపింది.

ఎలాంటి కవ్వింపూ లేకుండా పాక్ వైపు నుంచి జరిగే కాల్పులను, సీమాంతర ఉగ్రవాదాన్ని బలంగా తిప్పికొడతామని ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది. అయితే.. సరిహద్దులో కాల్పుల విరమణను ఉల్లంఘించింది భారతేనని, భారత బలగాల కాల్పుల్లో తమ పౌరులు నలుగురు చనిపోయారని పాక్ ప్రత్యారోపణ చేసింది.   
 
మంత్రులు, అధికారుల సమీక్ష...
మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు రష్యాలో కలుసుకుని.. శాంతి చర్చల పునరుద్ధరణపై అంగీకారానికి వచ్చి కొద్ది రోజులు కూడా గడవకముందే.. ఇరు దేశాల మధ్య మళ్లీ సరిహద్దులో కాల్పుల వివాదం రాజుకుంది. జమ్మూలోని కానాచక్ - అఖ్నూర్ సెక్టార్ నుంచి ఆర్‌ఎస్ పురా సెక్టార్ వరకూ పాక్ రేంజర్లు కాల్పుల వలయాన్ని విస్తరించారని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. పాక్ వైపు నుంచి  రెండు వారాలుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు పెరిగాయని ఉత్తర సైనిక కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్.హుడా పేర్కొన్నారు.

ఈ ఒక్క నెలలోనే 9 ఘటనలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్‌బాసిత్‌ను పిలిపించిన భారత ప్రభుత్వం పాక్ వైఖరిపై తీవ్ర నిరసన తెలిపింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్‌లు, పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారత దౌత్యాధికారి టి.సి.ఎ.రాఘవన్‌లతో బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకూ  చర్చలు జరిపారు.   హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌లు గురువారం ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిణామాలు, పరిస్థితులపై సమీక్షించారు.
 
కాల్పులను బలంగా తిప్పికొడతాం...
మంత్రులతో భేటీ అనంతరం దోవల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దులో శాంతి, సామరస్యాల స్థాపనకు అవసరమయ్యే చర్యలు చేపట్టేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. అయితే.. పాక్ వైపు నుంచి నిష్కారణమైన ఎటువంటి కాల్పులనైనా భారత బలగాలు సమర్థవంతంగా, బలంగా తిప్పికొడతాయన్న విషయంలో సందేహం అవసరం లేదన్నారు. చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం నుంచి సరిహద్దులను పరిరక్షించటంలో ఏమాత్రం ఉపేక్షించేదీ లేదని పేర్కొన్నారు. ‘సరిహద్దులో శాంతి, సామరస్యాలను బలోపేతం చేసే ఉద్దేశం, అభిలాష ఆ చర్చల లక్ష్యమైతే అందుకు భారత్ కట్టుబడి ఉంటుంది. అలాకాకుండా.. కవ్వింపు లేని కాల్పులు, చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం కొనసాగితే.. అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది’’ అని ఆయన బదులిచ్చారు.
 
ఆ ద్రోన్ మాది కాదు: భారత్
బుధవారం తమ భూభాగంలోకి వచ్చిన భారత్ ద్రోన్ ను కూల్చివేశామన్న పాక్ ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ తప్పుపట్టారు. భారత సైన్యం వద్ద ఆ తరహా డ్రోన్‌లు లేవని, అది చైనా తయారీ డ్రోన్‌గా కనిపిస్తోందనిఅన్నారు.  కాగా, ఈ ఉదంతానికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యా ధికారి టీసీఏ రాఘవన్‌ను పిలిపించుకుని నిరసన తెలిపింది.
 
నేడు మోదీ పర్యటన.. భద్రత కట్టుదిట్టం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం జమ్మూలో పర్యటించనున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థికమంత్రి గిరిధారిలాల్‌డోగ్రా శతజయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. సరిహద్దు వెంట తాజా పరిణామాల నేపథ్యంలో మోదీ పర్యటనకు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధానికి భద్రత కల్పిస్తున్న ఎస్‌పీజీ బృందం ఇప్పటికే జమ్మూ చేరుకుని.. కార్యక్రమం జరిగే జమ్మూ యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తోంది.
 
ఉఫా ప్రకటన చారిత్రక తప్పిదం: కాంగ్రెస్
సరిహద్దు వెంట తాజా పరిణామాల నేపథ్యంలో.. కొద్ది రోజుల కిందట రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షరీఫ్‌లు చేసిన సంయుక్త ప్రకటన.. చారిత్రక విజయం కాదని,  చారిత్రక తప్పిదమని కాంగ్రెస్ పేర్కొంది. పాక్‌కు తగిన జవాబివ్వటంతోపాటు, ముంబై దాడుల నిందితులను చట్టం ముందు నిలబెట్టే విషయంలో భారత వైఖరిని నీరుగార్చినందుకు మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్టీ నేత ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు