అక్కడి ఇళ్లకు ఆడ పిల్లల పేర్లతో నేమ్ ప్లేట్లు

6 Aug, 2016 18:26 IST|Sakshi

రాంచి: అదో గిరిజనుల గ్రామం. పేరు టిరింగ్. జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్‌భమ్ జిల్లాలో ఉంది. ఆ గ్రామంలో 170 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఇంటికి ఓ నేమ్‌ప్లేట్ ఉంటుంది. దానిపై పెళ్లికాని ఆడపిల్లల పేర్లు లేదా వారి తల్లుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఇంటి యజమాని పేరుగానీ, మగవాళ్ల పేర్లుగానీ ఏ ఇంటికి కనిపించవు. ఆడవాళ్ల పేర్లతోనే అక్కడి ఇంటి చిరునామాలను గుర్తిస్తారు.

ఇలా ప్రతి ఇంటికి ఆడవాళ్ల పేర్లు కలిగిన గ్రామం దేశంలో ఇదొక్కటేనని జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 170 కుటుంబాల ఇళ్లలో 61 ఇళ్లకు పెళ్లికాని ఆడపిల్లల నేమ్ ప్లేట్లు ఉండగా, మిగతా ఇళ్లకు తల్లుల పేర్లు ఉన్నాయి. గ్రామంలో ఏటేటా పడిపోతున్న ఆడపిల్లల సంఖ్యను, ఆడపిల్లల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసమే గ్రామస్థులు ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది మగ శిశువులు నమోదుకాగా, 786 మంది ఆడ శిశువుల సంఖ్య నమోదైంది. గ్రామంలోని మహిళల్లో అక్షరాస్యత 50.6 శాతం మాత్రమే ఉంది.

గ్రామం ఈ వినూత్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి గ్రామంలో ఆడ శిశువుల సంఖ్య పెరుగుతుండడమే కాకుండా ఆడవాళ్లలో ఆక్షరాస్యత కూడా పెరుగుతూ వస్తోందని జిల్లా పౌర సంబంధాల అధికారి సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ సరకులను తీసుకునేందుకు కుటుంబంలోని సీనియర్ మహిళ పేరును ఇంటి యజమానిగా తప్పనిసరి నమోదు చేయాలంటూ 2013లో కేంద్రం జాతీయ ఆహార భద్రతా చట్టం తీసుకరావడం కూడా వారి పాలిట వరమైంది.

అంతకుముందు ఇంటి యజమానిగా మగవారి పేర్లను మాత్రమే నమోదు చేయాల్సి ఉండేది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘బేటీ బచావో బీటే పడావో’ తరహాలో తాము మై డాటర్ ఈజ్ మై ఐడెంటిటి అనే నినాదం ఇప్పుడు ఈ గ్రామం నుంచి ప్రారంభమైందని జిల్లా డిప్యూటి కలెక్టర్ సంజయ్ పాండే తెలిపారు. శక్తికి, ఆశావహ దృక్పథానికి చిహ్నంగా ఇక్కడి ఇళ్ల నేమ్ ప్లేట్లకు పసుపు రంగును వాడుతున్నారు. వాటిపైనా బాలికలు, తల్లుల పేర్లను నీలి రంగులో రాస్తున్నారు.

మరిన్ని వార్తలు