ప్రభుత్వమంటే నేనే..!

23 Jul, 2015 01:43 IST|Sakshi
ప్రభుత్వమంటే నేనే..!

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
 
*  ఎల్జీ, సీఎం కేజ్రీవాల్ మధ్య మరో నియామక వివాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య నియామకాల విషయంలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో నియామకం వీరి మధ్య వివాదాన్ని రేపింది. ఢిల్లీ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా స్వాతి మలివాల్‌ను నియమిస్తూ కేజ్రీవాల్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని ప్రకటించడంతోపాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయం చేసిన వ్యాఖ్యలు ప్రకంపనాలు సృష్టించాయి.

‘ఢిల్లీలో ప్రభుత్వం అంటే నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్ గవర్నరే. ఉన్నతస్థాయి అధికారుల నియామకాలతోపాటు ముఖ్యమైన విషయాలను నిర్ణయించేది ఎల్జీనే’ అని జంగ్ కార్యాలయం ఒక లేఖను సీఎం కార్యాలయానికి పంపింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 239లో పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం నేషనల్ కేపిటల్ టెరిటరీకి ప్రభుత్వమంటే లెఫ్ట్‌నెంట్ గవర్నరే అని స్పష్టంచేసింది. ఆర్టికల్ 239ఏఏ ప్రకారమే ఎల్జీ నియామకం జరిగిందని వివరించింది. స్వాతి నియామకం  నిబంధనలకు విఘాతం కలిగిస్తుందని, అందువల్ల దానికి చట్టబద్ధత లేదని స్పష్టంచేసింది.
 
30 ఏళ్ల స్వాతి రెండు రోజుల కిందట మహిళా కమిషన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, ఎల్జీ కార్యాలయం తాజాగా ఆమె నియామకాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఆమె అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 29లోగా పంపాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిని ఎల్జీ కార్యాలయం ఆదేశించింది. అయితే, కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగానే స్పందించింది. ఈ నిర్ణయంపై పునరాలోచన ఉండదని, సీఎం కేజ్రీవాల్ రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఆమెను నియమించారని రవాణా మంత్రి గోపాల్ రాయ్ స్పష్టంచేశారు.
 
ఆఫీసుకు తాళం వేస్తామన్నారు
ఎల్‌జీ నజీబ్‌జంగ్ బుధవారం తనకు ఫోన్ చేసి రేపటి నుంచి ఆఫీసుకు రావొద్దని చెప్పారని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీనిపై వివరణ కోరగా... ఎల్‌జీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందని మాటమార్చారు. మరోవైపు జంగ్ కార్యాలయం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అయితే ఎల్జీ కార్యాలయం రాజ్యాంగబద్ధతను తాను గౌరవిస్తానని స్వాతి చెప్పారు. అయితే, ఇదేమంత పెద్దవిషయమేం కాదని, చాలా చిన్నదన్నారు. త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు