పాల ధరలు తగ్గించినా హెరిటేజ్ లాభం పెరిగింది!

23 Jul, 2015 01:46 IST|Sakshi
పాల ధరలు తగ్గించినా హెరిటేజ్ లాభం పెరిగింది!

♦ క్యూ2లో రూ. 26 కోట్ల నికర లాభం
♦ విదేశీ విస్తరణపై కంపెనీ దృష్టి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తొలి త్రైమాసిక ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది. గత త్రైమాసికంలో పాల ధరలు గణనీయంగా తగ్గడంతో లాభాలు తగ్గుతాయన్న మార్కెట్ వర్గాల అంచనాలను తల్లకిందులు చేస్తూ డెయిరీ వ్యాపార నికర లాభంలో 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో రూ. 23 కోట్లుగా (డెయిరీ విభాగం) ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 26 కోట్లకు చేరింది. ఇదే సమయంలో డెయిరీ అమ్మకాలు రూ. 404 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు చేరుకున్నాయి.

ఒక పక్క పాల సేకరణ వ్యయం తగ్గకుండా రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గించినా సంస్థకు లాభాలు మాత్రం పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. హెరిటేజ్ సంస్థ ఇతర కంపెనీల పోటీకి తలొగ్గి గత మూడు నెలల కాలంలో పాల విక్రయ ధరను లీటరుకు దాదాపు 15 శాతం తగ్గించింది. దీంతో ఇదే కాలంలో పాలసేకరణతో సహా ఇతర ముడి పదార్థాల వ్యయం(కన్సాలిడేటెడ్) రూ.343 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు పెరిగింది.

ఒకవైపు వ్యయం పెరిగి, మరోవైపు ధర తగ్గించినా లాభం మాత్రం పెరగటం విశేషమే. అన్ని వ్యాపారాలు తీసుకుంటే తొలి త్రైమాసికంలో రూ. 578 కోట్ల ఆదాయంపై సంస్థ రూ.11 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. గడిచిన ఏడాది నాల్గవ త్రైమాసికంలో రూ.544 కోట్ల ఆదాయంపై రూ. 13 కోట్ల నికరలాభం రావటం గమనార్హం. గతేడాది ఇదే కాలానికి రూ. 5 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 5 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 506 కోట్ల నుంచి రూ. 578 కోట్లకు చేరింది.

 విదేశీ మార్కెట్‌పై దృష్టి: విదేశీ మార్కెట్‌లో అవకాశాల కోసం యూరోప్‌నకు చెందిన ఒక అతిపెద్ద డెయిరీ ప్రోడక్టుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇండియాతో పాటు విదేశాల్లో డెయిరీ  ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించి ఒక భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్‌ను నియమించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా