జన్మభూమికి చుక్కెదురు!

2 Jan, 2016 13:21 IST|Sakshi

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమైన రెండో విడత జన్మభూమి కార్యక్రమం రసాభాసలకు దారితీస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి వంటి హామీలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన మహిళలు, యువత, రైతులు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొని అధికారులను నిలదీస్తున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రభుత్వ పథకాలన్నిట్లో టీడీపీ వాళ్లకే పట్టం కడుతున్నారని నిరసిస్తు.. విశాఖపట్నం, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాలలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా బొబ్బిలిలో ముఖ్యమంత్రి సభలో పాల్గొనేందుకు వెళ్తున్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆగ్రహించిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలు రోడ్డు పైన ధర్నాకు దిగారు.


 శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలసలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎల్లన్న కొండలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమాన్ని స్థానికులు బహిష్కరించారు.


 జన్మభూమి కార్యక్రమాన్ని అధికార పార్టీ కార్యక్రమంగా మర్చేసారని నిరసిస్తూ.. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో కార్యక్రమాన్ని బహిష్కరించారు. విజయనగరంలోని భోగాపురం ఏయిర్‌పోర్టు బాధిత గ్రామస్థులు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగి వారిని వెనక్కి పంపించేశారు.

మరిన్ని వార్తలు