రాష్ట్రంలో 3 కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

15 Oct, 2016 00:48 IST|Sakshi
రాష్ట్రంలో 3 కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

- పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు
- ఈసారి ఆలస్య రుసుముతోనూ చెల్లించే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫీజులు పెరిగాయి. ఐఐటీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు పెంచిన ఫీజులు, ఇతర వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను ముంబై ఐఐటీ శుక్రవారం వెబ్‌సైట్ jeeadv.ac.in అందుబాటులో ఉంచింది. జనరల్ అభ్యర్థులకు ఫీజును రూ.2,000 నుంచి రూ.2,400కు... మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.1,000 నుంచి రూ.1,200కు పెంచింది. అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు చేపడతామని పేర్కొంది. ఇంతకుముందు నిర్ణీత గడువు తర్వాత రిజిస్ట్రేషన్‌కు అవకాశమే లేకపోగా... ఈసారి ఆలస్య రుసుముతో మరో 2 రోజులు రిజిస్ట్రేషన్‌కు వెసులుబాటు కల్పించింది. రూ.500 రుసుముతో మే 3 ఉదయం 10 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్షను మే 21న రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో.. ఏపీలోని నెల్లూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది.

 విదేశాల్లోనూ పరీక్షా కేంద్రాలు
 ఈసారి కొత్తగా సార్క్ దేశాల్లోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ముంబై ఐఐటీ వెల్లడించింది. అక్కడ 135 డాలర్లు ఫీజుగా చెల్లించాలని.. ఆలస్యమైతే అదనంగా 80 డాలర్లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది. సార్క్ దేశాలు మినహా ఇతర దేశాల్లోని విద్యార్థులు 270 డాలర్లు ఫీజు చెల్లించాలని (గతంలో ఒక్క దుబాయ్ కేంద్రమే ఉండేది. అక్కడి వారు 220 డాలర్లు చెల్లించాలి).. నిర్ణీత గడువు దాటితే అదనంగా 80 డాలర్లు ఆలస్య రుసుము చెల్లించాలని తెలిపింది. ఎన్నారైలకు ప్రతి బ్రాంచీలో 10% సీట్లను కేటాయిస్తామని పేర్కొంది. అంధులు, డిస్‌లెక్సియా తో బాధపడే వారు సహాయకులను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీనికై వారు జోనల్ ఐఐటీలో ఉండే జేఈఈ అడ్వాన్స్‌డ్ చైర్మన్‌కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయాలని సూచించింది. వారికి పరీక్ష నిర్ణీత సమయం కంటే అదనంగా మరో గంట సమయం ఇస్తారని తెలిపింది. ఓబీసీ నాన్ క్రిమీలేయర్ విద్యార్థులు 2017 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన ఓబీసీ నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్లను అందజేస్తేనే ఆ కేటగిరీ రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా