6 లక్షల మందికి 5 క్వింటాళ్ల చేప ప్రసాదం

7 Jun, 2016 19:05 IST|Sakshi

చార్మినార్ : చేప ప్రసాదం పంపిణీలో భాగంగా మంగళవారం బత్తిని కుటుంబ సభ్యులు పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఏటా చేప పంపిణీ ప్రసాదానికి ముందు కుటుంబసభ్యులతో కలిసి ఈ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. పూజా కార్యక్రమాల్లో బత్తిని విశ్వనాథ్ గౌడ్, హరినాథ్ గౌడ్, శివానంద్ గౌడ్, శివ ప్రసాద్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్, సంతోష్ గౌడ్‌లతో పాటు దాదాపు 250 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాదం తయారీ కార్యక్రమం కొనసాగింది. బుధవారం ఉదయం 4 గంటలకు పూజల అనంతరం 6.30 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని బత్తిని సోదరులు తెలిపారు.

ఈసారి 6 లక్షల మందికి..
గతేడాది 3.5 క్వింటాళ్ల చేప ప్రసాదం పంపిణీ చేశామని... అయితే, అది చాలక పోవటంతో మరో 50 కిలోలను తయారు చేసి పంపిణీ చేసినట్లు బత్తిని గౌరీశంకర్ గౌడ్ తెలిపారు. ఈసారి అలాంటి సమస్య తలెత్తకుండా 5 క్వింటాళ్ల చేప ప్రసాదాన్ని ముందుగానే తయారు చేస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 34 లైన్లను ఏర్పాటు చేసి ఒక్కో లైన్‌లో నలుగురు చేప మందు పంపిణీ చేయనుండగా, వారికి మరో నలుగురు సహాయకులుగా పని చేస్తారన్నారు. 24 గంటల్లో మూడు షిప్టులలో తాము ప్రజలకు చేప ప్రసాదాన్ని అందజేయనున్నామన్నారు.

ఉచితంగా ఆహారం..
టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షుడు నాగ్‌నాథ్ మాశెట్టి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం చేప ప్రసాదం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి ఉచితంగా ఆహార పదార్థాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్ సైనీ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ శ్వేత మెహంతి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు