వెంకయ్య నోట చంద్రబాబు పాటా..! : అంబటి రాంబాబు

9 Aug, 2016 02:25 IST|Sakshi
వెంకయ్య నోట చంద్రబాబు పాటా..! : అంబటి రాంబాబు

ప్రత్యేక హోదా సంజీవని కాదా?: అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాడిన పాటనే ఇపుడు బీజేపీ కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు విమర్శించారు. సంజీవని కాదంటూ తాను ఇంకా పాట పాడితే ప్రజలు సహించరని తెలుసుకున్న చంద్రబాబే, ఇపుడు వెంకయ్య చేత ఈ పాట పాడిస్తున్నారనుకోవాలని ఎద్దేవా చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, లేకుంటే రాష్ట్రం బాగుపడదని లేవనెత్తిందే బీజేపీ అని, అది కూడా ప్రధానంగా వెంకయ్యే మాట్లాడారన్నారు.

ప్రత్యేక హోదా కావాలని విభజన జరిగిన నాటి నుంచీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లడాన్ని గమనించి ఇపుడు చంద్రబాబు తన నోటికి ప్లాస్టర్ వేసుకున్నారని, వెంకయ్య నోటికి కూడా 13 జిల్లాల ప్రజలు ప్లాస్టర్ వేసే పరిస్థితి రానీయవద్దని అంబటి హితవు పలికారు. అసలు వెంకయ్య మాటలపై చంద్రబాబు తన వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన గాంధీ విగ్రహాన్ని పడగొట్టడానికి చంద్రబాబుకు ఎంత కండకావరమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గాడ్సే ప్రభుత్వమని అభివర్ణించారు. గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు, దేవాలయాలు, మసీదులు, దర్గాలు కూల్చేస్తూ చంద్రబాబు శిశుపాలుడి మాదిరిగా తప్పులు చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు