‘బీసీ బిల్లును’ పార్లమెంట్‌లో ఆమోదించాలి

21 Jan, 2018 01:45 IST|Sakshi

కేంద్ర మంత్రి గెహ్లాట్‌ను కలిసిన బీసీ సంఘాల నేతలు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర సామాజిక న్యాయసాధికార శాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జి.రమేష్‌ తదితరులు కలిసి డిమాండ్‌ చేశారు. 

16 డిమాండ్లతో వినతిపత్రం 
పార్లమెంట్‌లో బీసీ బిల్లుపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కోరారు. లక్ష కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, కేంద్రంలో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో సాచురేషన్‌ పద్ధతిలో ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ స్కీం ప్రవేశపెట్టాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీం, విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. మొత్తం 16 డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చారు.

ఫిబ్రవరిలో బిల్లు పెడతాం: గెహ్లాట్‌ 
ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్‌ సెషన్‌లో బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందే విధంగా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.  

కేంద్రంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి 
కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చే బిల్లును సైతం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపజేయాలని కోరారు.  

మరిన్ని వార్తలు