జరభద్రం

23 Sep, 2016 03:29 IST|Sakshi
జరభద్రం

హైదరాబాద్‌లో నేడు అతి భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక
 
 వీలైనంత వరకు ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచన
 
- గ్రేటర్ పరిధిలో నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు
- అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
- రాత్రి కూడా కార్యాలయాల్లోనే ఉండాలని సూచన
 - లుంబినీ పార్కు సహా పలు పార్కుల మూసివేత
- సహాయక చర్యలకు ఏర్పాట్లు సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ
- అవసరమైతే సైన్యం సహకారం తీసుకోవాలని నిర్ణయం
- లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు
- గురువారం వర్షంతో పలుచోట్ల బీభత్సం
- జలదిగ్బంధంలోనే పలు కాలనీలు.. పొంగుతున్న నాలాలు
- ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు
 
 సాక్షి, హైదరాబాద్: మరో రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్ హై అలర్ట్ అయింది. ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన విలవిల్లాడుతున్న నగరం.. మరింత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనబోతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్ర, శనివారాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది. నగరం పరిధిలోని పార్కులన్నింటినీ మూసివేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యం సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మీ అధికారులతోనూ సంప్రదించింది. ప్రధాన శాఖల అధికారులంతా తప్పనిసరిగా విధుల్లో ఉండాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ అధికారులు రాత్రిళ్లు కూడా కార్యాలయాల్లోనే ఉండాలని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది.

 జల దిగ్బంధంలోనే..
 హైదరాబాద్ నగరంలో గురువారం కూడా కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు, బస్తీలు జలమయమయ్యాయి. నగరంలోని అన్ని చెరువులు, కుంటలు నిండిపోయాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసారంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి పదకొండు గంటల వరకు సగటున ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజిగిరి, నారాయణగూడ, అంబర్‌పేట్, వెస్ట్‌మారేడ్‌పల్లి, చిలకలగూడ, తిరుమలగిరి ప్రాంతాల్లో కుండపోత కురిసింది. పెద్ద సంఖ్యలో అపార్ట్‌మెంట్లు చీకట్లోనే మగ్గుతున్నాయి. సెల్లార్లు, అపార్ట్‌మెంట్లలో నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక, నిత్యావసరాలు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నా అవి సరిపోవడం లేదు. బేగంపేటలోని అల్లంతోట బావి ప్రాంతం నీటిలోనే ఉండిపోయింది. నాలాలు ఉప్పొంగడం, రోడ్లపైనే నీరు నిలవడంతో నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించి పోయింది. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు నీటి చేరికతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, హుసేన్‌సాగర్ నిండుకుండల్లా మారాయి. మల్కాజ్‌గిరి, నారాయణగూడ, వెస్ట్‌మారేడ్‌పల్లిలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 ఆర్మీ అధికారులతో సంప్రదింపులు
 భారీ వర్షాలతో అత్యవసర పరిస్థితి ఏర్పడితే సైన్యం సహకారం తీసుకోవాలన్న సీఎం సూచన మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ మేరకు గురువారం ఆర్మీ అధికారులను సంప్రదించారు. బేగంపేట, టోలిచౌకి, అల్వాల్, నిజాంపేట, హకీంపేట తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున సైన్యం సహకారం అవసరం కావచ్చని వివరించారు. దీనిపై స్పందించిన సైనికాధికారులు తాము కూడా పరిస్థితిని అంచనా వేయనున్నట్లు తెలిపారు.

 లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ
 లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. వారికి ఆహారం అందించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక  అధికారిని నియమించి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. సహాయ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. వరద బాధితులకు ఉచితంగా భోజనం అందించడానికి హరేకృష్ణ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ద్విచక్ర వాహనాలపై క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఇక గురువారం హైదరాబాద్ నగరవ్యాప్తంగా సుమారు 13 శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేశారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు సుమారు 865 భవనాలను కూల్చివేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ వెల్లడించారు.
 
 డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ: కేటీఆర్
 20 వేల కోట్లతో మెరుగుపరుస్తామని వెల్లడి

 హైదరాబాద్: హైదరాబాద్‌లోని డ్రైనేజీ వ్యవస్థను ఏడాదిన్నరలోపు రూ.20 వేల కోట్లతో ఆధునీకరిస్తామని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు రాకుండా, వాన నీటిలో మునిగిపోయే పరిస్థితి తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న నిజాంపేట, బేగంపేటలోని మయూరిమార్గ్, అల్లంతోటబావి ప్రాంతాలను మంత్రి కేటీఆర్ గురువారం పరిశీలించారు.  తాము మూడు రోజులుగా నీరు, కరెంట్, ఆహారం లేక అల్లాడుతున్నామని నిజాంపేట వాసులు మంత్రికి వివరించారు. వృద్ధులు, పిల్లలు ఇళ్లలోంచి బయటికి రాలేకపోతున్నారని చెప్పారు. అపార్ట్‌మెంట్లలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. సెల్లార్‌లలో నిలిచిన నీటిని తోడేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.   నాలాల పక్కన సుమారు 23 వేల ఆక్రమణలున్నాయని.. వాటిని తొలగించేందుకు ప్రస్తుతం రూ.20 వేల కోట్లు అవసరమని.. దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

 రాత్రి కూడా కార్యాలయాల్లోనే..: మరోవైపు జీహెచ్‌ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లు గురువారం రాత్రి తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు 100 నంబర్‌కు ఫోన్ చేస్తే, జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందుతుందని, అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు.

>
మరిన్ని వార్తలు