అసెంబ్లీపై నయీమ్ కన్ను!

11 Aug, 2016 01:37 IST|Sakshi
అసెంబ్లీపై నయీమ్ కన్ను!

భువనగిరి నుంచి చట్టసభలో అడుగుపెట్టే యోచన
నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు


ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్లాన్ రెడీ చేసుకున్నాడా? భువనగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావించాడా? అందుకు సన్నాహాలు కూడా చేసుకున్నాడా? అవుననే అంటున్నారు పోలీసు అధికారులు! ఇటీవల దందాలు పెంచడం, దుబాయ్ వెళ్లి ‘ఎన్-కంపెనీ’ ఏర్పాటుకు పథక రచన చేయడం.. అందులో భాగమనే చెబుతున్నారు. సుదీర్ఘకాలం అనేక అంశాల్లో పరోక్షంగా రాజకీయ నాయకులకు మద్దతు ఇచ్చి, కీలక సమయాల్లో వారి సహకారం పొందాడు. కానీ ఇలా నాయకుల నుంచి సాయం కోరడం కంటే తానే అధికారానికి కేంద్రం కావాలని అతడు భావించాడు. ఈ నేపథ్యంలోనే భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశాడని చెబుతున్నారు.

 
పట్టు పెంచుకునే యత్నాలు

భువనగిరి నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో నయీమ్ మద్దతు తీసుకున్నవారెందరో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు భువనగిరి మున్సిపల్ చైర్మన్(బీజేపీ), భువనగిరి, వలిగొండ ఎంపీపీలు, భువనగిరి జెడ్పీటీసీ, మరికొందరు సర్పంచ్‌లు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరారు. దీని వెనుక నయీమ్ ఉన్నాడని అంటున్నారు. అయితే ఇలా అధికార పార్టీలో తన పట్టును పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో నయీమ్ సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. రానున్న ఎన్నికల్లో గెలవడంతో పాటు మద్దతుదారుల్నీ గెలిపించుకోవాలని భావించాడు. ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు భారీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో దందాలు పెంచడంతోపాటు ప్రైవేట్ సైన్యాన్ని విస్తరించుకుంటున్నాడు.

హైదరాబాద్ కేంద్రంగా ఓ టీవీ ఛానల్ సైతం ఏర్పాటు చేసేందుకు సిద్ధమై.. అందుకు నల్లగొండకు చెందిన ఓ వ్యక్తికి భారీ మొత్తం ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఆ చానల్ లోగో కూడా సిద్ధమైనట్లు తెలిసింది. ఓటర్లకు దగ్గరయ్యేందుకు భువనగిరి, వలిగొండ, నల్లగొండలో వినాయక చవితి, ఉర్సు ఉత్సవాలను పెద్దఎత్తున జరిపేందుకు సిద్ధమవుతున్నాడు. భువనగిరి నియోజకవర్గంలోని 30 వార్డుల్లో 30 వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుకు ప్రయత్నించాడు. అలాగే నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాలు సైతం చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

డిపోర్టేషన్ ద్వారా ‘సేఫ్ జోన్’లోకి..
తన రాజకీయ కలకు కేసులు ప్రధాన అడ్డంకిగా మారతాయని భావించిన నయీమ్.. ‘ఎన్-కంపెనీ’ ఆలోచనకు పదును పెట్టినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దుబాయ్ వెళ్లి, అక్కడ్నుంచి దందాలు నడపాలని భావించాడు. తర్వాత తనకు అనుకూలంగా ఉన్న పోలీసుల ద్వారా కథ నడిపించి దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై రావాలని భావించాడని తెలుస్తోంది. ఆపై బెయిల్ పొంది రాజకీయాల్లోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు