ఫ్లై ఓవర్‌పై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్

2 Mar, 2017 13:58 IST|Sakshi
ఫ్లై ఓవర్‌పై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్
ఉమ్మడి రాజధాని నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌ మీద ఒక వాహనం అదుపు తప్పింది. అది డివైడర్ మీదకు ఎక్కడంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అర్ధరాత్రి సమయంలో ఈ వాహనం ప్రమాదానికి గురైనట్లు సమాచారం. సినిమా షూటింగులకు, ప్రైవేటు ఫంక్షన్లకు విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే మొబైల్ జనరేటర్ వాహనం అదుపుతప్పి, డివైడర్ మీదకు ఎక్కి.. దాని మీద ఉన్న మొత్తం పూలకుండీలన్నింటినీ ధ్వంసం చేసింది. 
 
ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్ర మత్తే అని అంటున్నారు. ఈ ప్రమాదం వల్ల ఇంటర్ పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడింది. ఈ వ్యాన్ బీభత్సం తెల్లవారుజామున జరగడంతో వాకింగ్ కి వెళ్లేవారు  ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో డివైడర్ మీద ఉన్న విద్యుత్ స్తంభం విరిగి నేల మట్టం అయింది. 
 
 ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని అక్కడినుంచి తొలగించేందుకు భారీ క్రేన్ ఒకదాన్ని తెప్పించి, దాని సాయంతో బస్సును అక్కడినుంచి తీశారు. రోడ్డు మధ్యలో డివైడర్ మీద బస్సు ఉండటం, దాన్ని తొలగించేందుకు క్రేన్‌ను ఫ్లై ఓవర్‌కు ఒకవైపు అడ్డంగా పెట్టడంతో అటు నుంచి ఇటు వచ్చే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి.