భారీ జీతం.. మత్తెక్కించిన మద్యం.. ఆపై వీరంగం

19 Aug, 2013 16:47 IST|Sakshi
భారీ జీతం.. మత్తెక్కించిన మద్యం.. ఆపై వీరంగం

విక్రమ్ (శంషాబాద్): అమ్మానాన్నలకు ఒక్కర్తే కూతురు. అల్లారుముద్దుగా పెంచి మంచి చదువు చదివించారు. బాగా చదవడంతో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అది కూడా అలాంటి, ఇలాంటి  ఉద్యోగం కాదు. నెలకు దాదాపు లక్ష రూపాయల జీతం తెచ్చిపెడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం. హైటెమ్ సిటీలో ఉద్యోగం చేసుకుంటోంది. ఇంకా పెళ్లి కాలేదు. జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తోంది. ఆమె పేరు దీప్తి (25). కూకట్‌పల్లిలో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెతో పాటు విశాఖపట్నం ప్రాంతానికే చెందిన స్నేహితుడు ప్రసాద్ (27), స్వస్థలానికి చెందిన మేనమామ కొడుకులు రాధాకృష్ణ (28), పృథ్వీరాజ్(28), కారు డ్రైవర్ చంద్రశేఖర్ (25) శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ పబ్లో పార్టీ చేసుకున్నారు. పూర్తిస్థాయిలో మద్యం తాగారు. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత శంషాబాద్లో జరుగుతున్న మడ్ రేసింగ్ గేమ్ షోలో పాల్గొనేందుకు వెళ్లారు.

గేమ్ షోలో అక్కడే ఉన్న ఉద్యోగులకు సంబంధించిన కూర్చీలో దీప్తి కూర్చుంది. అందులో కూర్చోకూడదని ఉద్యోగి శివ ఆమెను వారించాడు. దీంతో ఆగ్రహంతో ఆ యువతి గొడవకు దిగింది. శివను దూషిస్తూ కుర్చీ ఖరీదు చెల్లిస్తానని వీరంగం సృష్టించింది. అంతటితో ఆగకుండా అతడిపై చేయి కూడా చేసుకుంది.

పరిస్థితి గమనించిన మిగతా ఉద్యోగులు విమానాశ్రయంలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతితో పాటు మిగతా నలుగురిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మడ్ రేసింగ్ గేమ్‌షో నిర్వాహకుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దాడిలో ఎవరికీ గాయాలు కాకపోవడం వల్ల నాన్ కాగ్నిజబుల్ కేసుగా నమోదు చేశారు.

మరిన్ని వార్తలు