‘శ్రీశైలం’ భద్రతపై కేంద్రం దృష్టి

13 Oct, 2016 00:47 IST|Sakshi
‘శ్రీశైలం’ భద్రతపై కేంద్రం దృష్టి

సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ పరీవాహకంలో వరదను ఎదుర్కొనే అంశంపై కేంద్ర  ప్రభుత్వం దృష్టి పెట్టింది. మునుపటి భయానక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు పెద్దపీట వేసే చర్యలను మొదలుపెట్టింది. వరదలకు కొంతమేర దెబ్బతిన్న శ్రీశైలం డ్యామ్‌కు తక్షణ మరమ్మతులు వచ్చే ఏడాది జూన్ కంటే ముందే పూర్తి చేయాలని భావిస్తోంది. శ్రీశైలం డ్యామ్ భద్రతను జాతీయ ప్రాధాన్యత గల జాబితాలో చేర్చిన కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17 తేదీల్లో రూర్కీలో జరిగే నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ(ఎన్‌సీడీఎస్) సమావేశంలో దీనిపై చర్చించనుంది.
 
 స్పిల్‌వే సామర్థ్యం పెంపు లక్ష్యంగా..
 216 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం కలిగిన శ్రీశైలం డ్యామ్ ఎత్తు 885 అడుగులు కాగా, పొడవు 512 మీటర్లు(1,680 అడుగులు). మొత్తంగా డ్యామ్‌కు 12 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి నిర్వహణ చేపడుతున్నారు. ఈ ఎత్తులో, ప్రస్తుతం ఉన్న క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తంగా 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. అంతకుమించి జలాలు వచ్చిన సమయంలో డ్యామ్ నిర్వహణ ఆషామాషీకాదు. అయితే 2009లో కృష్ణా నదికి వచ్చిన వరద శ్రీశైలం డ్యామ్ భద్రతను ప్రశ్నార్థకం చేసింది. వరదను ఎదుర్కొనే ముందస్తు సన్నద్ధతలో విఫలం కావడంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
 
 మరో రెండడుగుల నీరు చేరి ఉంటే డ్యామ్‌పై నుంచే నీరు పారే పరిస్థితి ఎదురైంది. ఈ అనుభవాల దృష్ట్యా 2014కు ముందు జరిగిన పలు సమావేశాల్లో దీనిపై చర్చించిన ఎన్‌సీడీఎస్ ప్రాజెక్టు స్పిల్‌వే సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. అయితే ఇవేవీ అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో దీనిపై మరోమారు పూర్తి స్థాయిలో చర్చించి తగు ముందస్తు చర్యలకు దిగాలని కేంద్రం భావిస్తోంది. డ్యామ్‌కు ఇరువైపుల కొండ ప్రాంతంలో ఐదేసి టన్నెల్‌లను తవ్వించి రిజర్వాయర్ నుంచి నీటిని డ్యామ్ కింది వైపు నేరుగా నదిలో వదలడానికి అవకాశాలను వచ్చే సమావేశాల్లో చర్చించి పూర్తి స్థాయి కార్యాచరణకు దిగనుంది.
 

>
మరిన్ని వార్తలు