వాళ్లు లాక్కెళ్లింది రోల్డ్‌గోల్డ్ చైన్!

9 Apr, 2016 21:29 IST|Sakshi
చాంద్రాయణగుట్ట : చైన్ స్నాచింగ్ జరిగిన 24 గంటల్లోనే సీసీ టీవీ కెమెరాల సాయంతో దక్షిణ మండలం పోలీసులు నిందితులను కటకటాల్లోకి పంపారు. అయితే నిందితులు లాక్కెళ్లింది రోల్డ్ గోల్డ్ చైన్ అని తేలింది. శనివారం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోదేఅలీషా కిడికీ ప్రాంతంలో ఈ నెల 7వ తేదీన ఒంటరిగా నడిచి వెళుతున్న కొప్పెర్ల రాణి (26) మెడలోని మంగళ సూత్రాన్ని బైక్‌పై వచ్చిన యువకులు తెంచుకుపోయారు. దీనిపై డబీర్‌పురా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
కాగా స్థానికంగా ఉన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నిందితులు పారిపోతున్నట్లు వీడియో ఫుటేజి లభించింది. దీని ఆధారంగా నిందితులను పహాడీ షరీఫ్ షాయిన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ తల్హా అలియాస్ అహ్మద్ (23), తలాబ్‌కట్టా అమన్‌నగర్ బి ప్రాంతానికి చెందిన ఉమర్ బిన్ ఆబేద్ అలియాస్ ఉమర్ ఖాన్(21)గా గుర్తించారు. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన వీరు తాగుడుకి డబ్బుల కోసం చైన్ స్నాచింగ్ చేశారు. అయితే అది బంగారు గొలుసు కాదని తెలుసుకున్న నిందితులు కంగుతిన్నారు. నిందితుల నుంచి లాక్కెళ్లిన గొలుసుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వార్తలు