కమీషన్ పేరుతో దగా

21 Apr, 2015 01:19 IST|Sakshi
కమీషన్ పేరుతో దగా

సుమారు రూ.10 కోట్లు కాజేసిన దంపతులు

 బంజారాహిల్స్: లక్ష రూపాయలు ఇవ్వండి... నెలకు 10 శాతం కమీషన్ ఇస్తాం.. కావాలంటే మీ డబ్బు మధ్యలోనే వాపస్ తీసుకోవచ్చు.. ఇలా మాయమాటలు చెప్పి.. అమాయకుల నుంచి పెట్టుబడి పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న కేటుగాడిని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు నగరం బండ్లమిట్టకు చెందిన కానుగుల శ్రీనివాసరావు, సురేఖ దంపతులు గతకొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని నవ నిర్మాణ్‌నగర్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని గ్రీన్‌వాల్ట్ గ్లోబల్ పేరుతో కార్యాలయం తెరిచారు.
 
 తమ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూజిలాండ్‌లో ఉందని, ఆంధ్రప్రదేశ్ శాఖకు తాను మేనేజర్‌నని  శ్రీనివాసరావు స్థానికులను నమ్మించాడు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం కమీషన్లు ఇస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉండే ఎస్‌కే మస్తాన్ కమీషన్‌కు ఆశ పడి తనతో పాటు బంధువులు, మిత్రులతో రూ. 53 లక్షలు కట్టించాడు. మూడు నెలల పాటు సక్రమంగానే కమీషన్లు ఇచ్చిన శ్రీనివాసరావు ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా అడిగేసరికి 2014 ఆగస్టు 3వ తేదీ రాత్రి బిచాణా ఎత్తేశాడు. బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలో దిగిన పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకోగా.. భార్య సురేఖ పరారీలో ఉంది.
 
 నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 420, 506 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, వీరి చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య భారీగానే ఉండవచ్చని పోలీసులకు అందిన ఫిర్యాదులు ద్వారా తెలుస్తోంది.  కూకట్‌పల్లికి చెందిన ఎం.మురళీకృష్ణ, చిక్కడపల్లికి చెందిన ఆదిత్య మోహన్, మెహిదీపట్నంకు చెందిన సూర్యప్రకాశ్, సురేందర్‌రాజు, శ్రీనివాస్, శంకర్  తదితరులు కూడా ‘గ్రీన్‌వాల్ట్ గ్లోబల్’లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి మోసపోయామని ఫిర్యాదు చేశారు.  వీరి ఫిర్యాదులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడు సుమారుగా 150 మంది నుంచి రూ. 10 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు