ఔటర్ వెంట సైక్లింగ్ అంట..

19 Feb, 2016 01:38 IST|Sakshi
ఔటర్ వెంట సైక్లింగ్ అంట..

 ఘట్‌కేసర్ నుంచి శామీర్‌పేట వరకు ట్రాక్ ఏర్పాటుకు నిర్ణయం
 అంతర్జాతీయ పోటీలకు అనువుగా నిర్మాణం
100రోజుల ప్రణాళికలో చేపట్టనున్న  హెచ్‌ఎండీఏ


 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం అంతర్జాతీయ సైక్లింగ్ పోటీలకు వేదిక కానుంది. ఇందుకోసం ఔటర్ రింగ్‌రోడ్డు వెంట అంతర్జాతీయ ప్రమాణాలతో సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో సైక్లింగ్ ట్రాక్ ప్రాజెక్టును చేపట్టాలని మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు హెచ్‌ఎండీఏకు నిర్దేశించారు. ఔటర్ వెంట ఇందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు  హెచ్‌ఎండీఏ సర్వే నిర్వహిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా మెయిన్ కారేజ్ వేకు- సర్వీసు రోడ్‌కు మధ్యలో 25 మీటర్ల వెడల్పులో రైల్వే కారిడార్ కోసం 158కి.మీ. మేర స్థలం కేటాయించారు. ఈ స్థలంలో కొంత భాగాన్ని సైక్లింగ్ ట్రాక్ కోసం వినియోగించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.

ప్రధానంగా ఘట్‌కేసర్ నుంచి శామీర్‌పేట వరకు సుమారు 25కి.మీ. దూరం అంతర్జాతీయ ప్రమాణాలతో సైక్లింగ్ ట్రాక్‌ను తీర్చిదిద్దేందుకు సన్నద్ధమైంది. ఇంటర్నేషనల్ సైక్లింగ్ పోటీలను నిర్వహించేందుకు అనుగుణంగా ట్రాక్ ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించడంతో హెచ్‌ఎండీఏ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్రాక్‌ను 3-5 మీటర్ల వెడల్పులో నిర్మించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ట్రాక్ నిర్మించాలంటే  భూ  ఉపరితలం (టాప్ సర్ఫేస్ ఫినిషింగ్) రబ్బర్‌తో  రూపొందించాల్సి ఉంటుంది. అసలు సైక్లింగ్ ట్రాక్‌ను రబ్బర్‌తోనా లేక సిమెంట్/గ్రావెల్‌తో నిర్మించాలా...? అన్నదానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా కల్వర్టులు, రోడ్ అండర్ పాస్‌లున్న చోట సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం ఎలా చేపట్టాలి..? 25 కి.మీ. మేర ట్రాక్ నిర్మించేందుకు ఎంత వెచ్చించాల్సి ఉంటుందన్నదానిపై ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఈ ప్రాజెక్టును 100 రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ పట్టుదలతో ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు