అంతరం..అవాంతరం..!

2 Sep, 2015 01:59 IST|Sakshi
అంతరం..అవాంతరం..!

- 16 రోడ్లకు పాతర !
- రేడియల్ రోడ్ల డీపీఆర్‌లు పక్కకు...!
- ఆర్‌అండ్‌బి,హెచ్‌ఎండీఏల మధ్య దూరం
- నిరుపయోగంగా‘జైకా’ మిగులు నిధులు
- ఔటర్‌కు అనుసంధానం ఇప్పట్లో అసాధ్యమే
సాక్షి, సిటీబ్యూరో:
రెండు శాఖల మధ్య సమన్వయ లోపం ఏకంగా 16 రేడియల్ రోడ్లకు పాతర వేసింది. ఓ విభాగం భూ సేకరణ చేస్తే... మరో విభాగం నిర్మాణం చేపట్టాలన్న నిబంధనను సాకుగా చేసుకొని ఎవరికి వారు భీష్మించుకోవడంతో రేడియల్ రోడ్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకొనేందుకు 373కి.మీ  33 రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 11 రోడ్ల నిర్మాణం పూర్తికాగా మరో 5 రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. అయితే మిగిలిన 16 రేడియల్ రోడ్ల విషయంలో  హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బి శాఖల మధ్య సమన్వయం లోపించడంతో అవి ఫైళ్లకే పరిమితమయ్యాయి.

హెచ్‌ఎండీఏ భూ సేకరణ చేస్తే తాము రోడ్లు నిర్మిస్తామని ఆర్ అండ్ బి  దాటవేస్తోంది. భూ సేకరణకు తమవద్ద సిబ్బంది లేనందున ఆ బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించాలని హెచ్‌ఎండీఏ సూచిస్తోంది.  భూసేకరణ , నిర్మాణ బాధ్యతలను ఒకరికే అప్పగించనందునే సమస్యకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. 180 కి.మీ. నిడివిగల 16 రేడియల్ రోడ్లు నిర్మించేందుకు దాదాపు రూ.1470కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. 9 రోడ్లకు డీపీఆర్‌లు కూడా సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి.
 
ఆర్థిక ఆసరా ఉన్నా.. : ఔటర్‌కు అనుసంధానం చేస్తూ మిగిలిన 16 రేడియల్ రోడ్లను కూడా నిర్మించి నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్‌ఎండీఏ భావించింది. ఔటర్ రింగ్ రోడ్డు రెండో దశ-బి నిర్మాణం కోసం జైకా నుంచి తీసుకొన్న రూ.3123.52కోట్ల  రుణంలో కొంత మిగులుబాటు లభించింది. ఈ నిధులతో 16 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ముందుకొచ్చినా   అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. అంతేగాకుండా రూ.1470కోట్లతో ఈ రోడ్లను నిర్మిస్తామని ప్రకటిస్తూ ఆర్‌అండ్ బి బడ్జెట్ నుంచే నిధులు వెచ్చించేలా  ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తగినట్లు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో రోడ్ల నిర్మాణాన్నిఅటకెక్కించారు.  ఔటర్ రింగ్‌రోడ్డుకు నగరం నుంచి అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ వత్తిడిని తగ్గించడం అసాధ్యమని ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడైంది.  ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని రేడియల్ రోడ్లను నిర్మించడంపై సీఎం చొరవ చూపకపోవడం విస్మయం కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు