Sakshi News home page

గృహ యజ్ఞం మెగా డ్రైవ్‌

Published Mon, Nov 27 2023 4:07 AM

mass house warming ceremony for 5 lakhs houses in ap - Sakshi

తొలిసారిగా ఇళ్లకు అడ్వాన్స్‌ నిధులు 
గతంలో ఏ ప్రభుత్వమూ పేదల ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్‌ నిధులు ఇచ్చిన దాఖలాల్లేవు. పెద్ద కాంట్రాక్టు సంస్ధలకు మాత్రమే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు చెల్లించేవి. తొలిసారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల లబ్ధిదారులకు అడ్వాన్స్‌ నిధులను మంజూరు చేసింది. ఇన్నాళ్లూ పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా నెలలు తరబడి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేసిన ప్రభుత్వాలనే చూశామని, గృహ నిర్మాణాలకు అడ్వాన్స్‌ నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి సమాచారం, అభ్యర్ధనల మేరకు నిరుపేద ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు అడ్వాన్స్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2,06,020 మంది లబ్ధిదారులకు రూ.376.82 కోట్లను అడ్వాన్స్‌గా విడుదల చేసింది. అడ్వాన్స్‌ నిధులు పొందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్‌ నెలాఖరు నాటికి తదుపరి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సూచించారు.  

సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహా యజ్ఞంలా కృషి చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్‌లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టగా అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.

పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌ ద్వారా డిసెంబర్‌ 1వతేదీ నుంచి జనవరి 31 వరకు క్షేత్రస్థాయిలో సచివాలయాలు కేంద్రంగా కార్యాచరణ సిద్ధమైంది. ఈమేరకు మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. బేస్‌మెంట్, లెంటల్, రూఫ్‌ స్థాయిలోని 4.18 లక్షల ఇళ్ల నిర్మాణాలను డ్రైవ్‌ ద్వారా జనవరి నెలాఖరులోగా పూర్తి చే­యాలని ఆదేశించారు. 10,044 సచివాలయాల వారీగా కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించారు.

డ్రైవ్‌పై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి గృహ నిర్మాణ సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌ను సోమవారాని కల్లా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లి నాలుగు దఫాలు సందర్శించడం ద్వారా ఇళ్ల పురోగతిని జియో ట్యాగింగ్‌ చేసి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. మెటీరియల్, నిర్మాణ సిబ్బందిని సమీకరించుకునేందుకు జిల్లా, మండల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని తేదీలతో సహా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆప్షన్‌–3 లబ్ధిదారుల ఇళ్ల పురోగతిని కూడా కలెక్టర్లు సమీక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

వలంటీర్ల కీలక పాత్ర 
గ్రామ, వార్డు వలంటీర్లు మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌లో కీలక పాత్ర పోషిస్తారని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్‌ అజయ్‌జైన్‌ తెలిపారు. వచ్చే నెల 1వతేదీ నుంచి జనవరి నెలాఖరు వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి మొత్తం నాలుగు సార్లు క్షేత్ర స్థాయిలో ఇళ్లను సందర్శిస్తారని వెల్లడించారు. తొలిసారి సందర్శనలో మెటీరియల్, లేబర్‌ అవసరాన్ని అంచనా వేస్తారన్నారు. రెండోసారి పురోగతిని యాప్‌లో అప్‌డేట్‌ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో జిల్లా స్థాయిలో మెబిలైజేషన్‌ సమావేశాలను నిర్వహించాలని ఆదేశించామన్నారు.

డిసెంబర్‌ 1వ తేదీన మండల, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో సమావేశాలు ఉంటాయన్నారు. డిసెంబర్‌ 4 నుంచి 6వ తేదీలోగా సచివాలయాల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. వలంటీర్ల తొలి విడత సందర్శన డిసెంబర్‌ 7 నుంచి 14 వరకు ఉంటుంది. రెండో విడత 15వ తేదీ నుంచి 31 వరకు జరుగుతుంది. మూడో విడత జనవరి 1వ తేదీ నుంచి 15 వరకు ఉంటుంది.

నాలుగో విడత సందర్శన జనవరి 16 నుంచి 31 వరకు ఉంటుందని జైన్‌ వివరించారు. ఫిబ్రవరిలో మరో ఐదు లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయాలు కేంద్రంగా మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌ ద్వారా జనవరి నెలాఖరు నాటికి 4.18 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వెల్లడించారు.

Advertisement

What’s your opinion

Advertisement