కారు బీభత్సం...

17 Nov, 2014 01:43 IST|Sakshi
కారు బీభత్సం...

* మద్యం తాగి డ్రైవింగ్
* అదుపుతప్పి డివైడర్ ఎక్కిన కారు
* పోలీసులపై యువకుల దాడి

లంగర్‌హౌస్: తప్పతాగి ఉన్న ఇద్దరు అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించారు. అదుపుతప్పిన కారు డివైడర్‌పై నుంచి దాదాపు రెండు వందల మీటర్ల దూరం దూసుకెళ్లి తర్వాత గాలిలో ఎగిరి  పడింది.  లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... టోలీచౌకి నదీం కాలనీకి చెందిన మొహమ్మద్ అన్వర్(33), తన స్నేహితుడు ఖుద్రత్ ఖాన్‌తో కలిసి పీ అండ్ టీ కాలనీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మద్యం తాగాడు.  

తెల్లవారుజామున 4 గంటలకు తన ఇన్నోవా కారులో టోలీచౌకిలోని ఇంటికి బయల్దేరారు. లంగర్‌హౌస్ బాపూనగర్ బస్టాప్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. వేగంగా దూసుకెళ్లి ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టి.. గాలిలోకి లేచి  30  మీటర్ల దూరంలో పడింది. బ్రిడ్జిపై ఉన్న 8 సిమెంట్ దిమ్మెలు చెల్లాచెదురైపడగా.. కారు టైర్లు నాలుగూ పగిలిపోయాయి. ఒక టైర్ అక్కడే పాల వ్యాపారం చేస్తున్నవారిపై పడింది. ఎయిర్‌బ్యాగ్స్  తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
 
మత్తులో వీరంగం....
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న వారిని బయటకు దించారు. స్టేషన్‌కు రమ్మని వారిని కోరగా..  మద్యం మత్తులో ఉన్న అన్వర్, ఖుద్రత్‌లు తాము సీఎం మనుషులమని, మమ్మల్నే స్టేషన్‌కు రమ్మంటారా అంటూ పోలీసులపై దాడి చేశారు.  జనం గుమిగూడటంతో  కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోయాడని, తమ డ్రైవర్ కూడా పారిపోయాడని వారిపై కూడా వీరంగం సృష్టించారు.
 
షెడ్డులో కారు...?
లంగర్‌హౌస్ పోలీసులు, టోలీచౌకి ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరగడానికి గంట ముందు వరకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి 7 కార్లు పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అయితే, మద్యం తాగి కారు నడపడమే కాకుండా డివైడర్‌పై దూసుకెళ్లిన కారును మాత్రం సీజ్ చేయనీకుండా ఆ యువకులు పోలీసులతో గొడవపడ్డారు.  మరమ్మత్తుల నిమిత్తం కారును బలవంతంగా షెడ్డుకు తీసుకెళ్లారు.   ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు సీజ్ చేయకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు