టాటూ..బ్లాసమ్‌!

5 Jul, 2017 02:22 IST|Sakshi
టాటూ..బ్లాసమ్‌!
- వాట్సాప్‌ గ్రూపుల్లో డ్రగ్స్‌కు కెల్విన్‌ కోడ్‌ భాష
- 1,276 మందికి మాదకద్రవ్యాల సరఫరా
- వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి డ్రగ్స్‌ దందా
- నగరంలోని ప్రముఖ మహిళా కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్‌
- రెండు ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, పలు ఇంజనీరింగ్‌ కాలేజీల స్టూడెంట్స్‌కూ సరఫరా
- డ్రగ్స్‌ కోసం కెల్విన్‌కు వారంలోనే 19 సార్లు ఫోన్‌ చేసిన నిర్మాత
- మరో నలుగురి అరెస్ట్‌.. వారిలో ముగ్గురు విద్యార్థులు, ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

సాక్షి, హైదరాబాద్‌: రెండు వాట్సాప్‌ గ్రూప్‌లు.. వాటి పేర్లు టాటూ.. బ్లాసమ్‌! టాటూ అంటే ఎల్‌ఎస్‌డీ. బ్లాసమ్‌ అంటే ఎండీఎంఏ డ్రగ్‌. ఈ గ్రూపుల ద్వారా ఒక్కరిద్దరు కాదు.. ఏకంగా 1,276 మందికి మాదకద్రవ్యాల సరఫరా! స్కూళ్లు, కాలేజీలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఎంఎన్‌సీ కార్పొరేట్లు, చివరికి ఓ ప్రముఖ మహిళా కాలేజీలో చదివే యువతులు.. అందరూ కస్టమర్లే!!

రాజధాని నగరంలో కెల్విన్‌ డ్రగ్‌ సామ్రాజ్యం ఇది. మూడు ఫోన్ల ద్వారా పన్నెండు సిమ్‌కార్డులను ఎప్పటికప్పుడు మారుస్తూ కెల్విన్‌ డ్రగ్స్‌ దందాను విస్తరించినట్టు తేలింది. వాట్సాప్‌ గ్రూప్‌ లిస్ట్‌లో ఉన్న వివరాలను కూపీలాగే పనిలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులున్నారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురిలో కెల్విన్‌దే ప్రధాన పాత్ర అని ఎక్సైజ్‌ పోలీసులు ధ్రువీకరించుకున్నారు. అతడు వాడిన మూడు ఫోన్లను సీజ్‌ చేసిన అధికారులు వాటి కాల్‌డేటా, వాట్సాప్‌ లిస్ట్‌ను చూసి బిత్తరపోయారు. 
 
ఆ కాలేజీలో 18 మంది అమ్మాయిలు
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మహిళా కాలేజీ కెల్విన్‌ డ్రగ్‌ వాట్సాప్‌ గ్రూపులో ఉండటం సంచలనం కల్గిస్తోంది. ఈ కాలేజీకి చెందిన 18 మంది విద్యార్థినులు కెల్విన్‌ ఏర్పాటు చేసిన రెండు వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్నారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. అత్యంత పేరు ప్రతిష్టలు కలిగిన ఈ కాలేజీకి చెందిన విద్యార్థినులు డ్రగ్స్‌కు అలవాటుపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ఈ కాలేజీ యాజమాన్యానికి నోటీసులిచ్చామని చెప్పారు. ఈ కాలేజీకి దగ్గర్లోని ఓ బేకరీని అడ్డాగా చేసుకొని విద్యార్థినులు ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులు స్వీకరిస్తున్నట్టు దర్యాప్తులో బయటపడిందన్నారు.

వీరు డ్రగ్స్‌ కోసం కెల్విన్‌కు ఆర్డర్‌ చేసిన ప్రతీసారి ఈ బేకరీలో పనిచేసే ఓ వ్యక్తికి అబ్దుల్‌ వహీబ్‌ కవర్‌ ఇచ్చి వెళ్లిపోయేవాడని తెలిపారు. విద్యార్థినులు మధ్యాహ్న సమయంలో బేకరీకి వచ్చి కవర్‌ తీసుకొని వెళ్లిపోయినట్టు గుర్తించామన్నారు. అలాగే కూకట్‌పల్లిలోని ప్రముఖ పాఠశాల, రెండు కీలక నగరాల పేరుతో ఉన్న ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, నగర శివారులో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి ఇంజనీరింగ్‌ కాలేజీ, సినిమా షూటింగ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన పాత రంగారెడ్డిలోని ప్రముఖ కాలేజీలకు చెందిన విద్యార్థులు కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు ఎక్సైజ్‌ అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే 25 కాలేజీలకు నోటీసులిచ్చి కౌన్సెలింగ్‌ నిర్వహించామని, మరో 25 కాలేజీలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులను కాలేజీ యాజమాన్యంతోపాటు, తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

చిక్కకుండా..దొరక్కుండా!
సాక్షి, హైదరాబాద్‌:
రాజధాని నగరంలో డ్రగ్స్‌ దందా నడుపుతున్న ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. విద్యాధికులు, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వాళ్లే పెడ్లర్స్‌ (సరఫరాదారులు)గా మారుతుండ టంతో నిఘాకు చిక్కని, పోలీసులు అందుకోలేని పంథాలో తమ ‘పనులు’ పూర్తి చేసుకుంటున్నారు. సాధారణంగా ఓ ప్రాంతంలో ఉన్న డ్రగ్‌ పెడ్లర్‌ వేరేచోట ఉన్న కస్టమర్‌కు సమాచారం చేరవేయాలంటే ఈ–మెయిల్‌ వాడుతాడు. అయితే ఒకవేళా ఆ పెడ్లర్‌ పట్టుబడితే అతడి.. మెయిల్‌ బాక్స్‌ను విశ్లేషించడం ద్వారా పోలీసులు మొత్తం నెట్‌వర్క్‌ను తెలుసుకో వచ్చు. దీన్ని గ్రహించిన పెడ్లర్స్‌ కొత్త టెక్నిక్‌ ఫాలో అవుతున్నారు. ఒక్క మెయిల్‌ కూడా పంపకుండా సమాచారాన్ని మాత్రం మార్పిడి చేసుకుంటున్నారు. అదెలాగంటే... పెడ్లర్‌కు చెందిన ఈ–మెయిల్‌ ఐడీలు, దాని పాస్‌వర్డ్స్‌ అతడికి డ్రగ్‌ సరఫరా చేసే వారితో పాటు కస్టమర్స్‌కు తెలిసే ఉంటుంది.

తాను చేరవే యాలనుకునే సమాచారం, విషయాన్ని మెయిల్‌ బాక్స్‌లో కంపోజ్‌ చేసే పెడ్లర్స్‌ దాన్ని ‘సెండ్‌’ చేయకుం డా కేవలం ‘డ్రాఫ్ట్స్‌’ బాక్సులో సేవ్‌ చేసేవాడు. నిర్దేశిత సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న అతడి నెట్‌వర్క్‌ మొత్తం అదే మెయిల్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేసుకుని ‘డ్రాఫ్ట్స్‌’లో సేవ్‌ చేసి ఉన్న సమాచా రాన్ని తెలుసుకునేవారు. తర్వాత ఆ సమాచారాన్ని డిలీట్‌ చేసేవారు.  మరికొం దరు పెడ్లర్స్‌ డిస్పోజబుల్‌ ఈ–మెయిల్‌ అడ్రస్‌ (డీఈఏ) అనే టెక్నిక్‌ వినియోగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉండటం, ఆ సమయం మించిన తర్వాత ఈ–మెయిల్‌తో పాటు దాని సమాచారం నమూనాలు చిరవకు సర్వర్‌లోనూ లభించకపోవడం ఈ–మెయిల్‌ ఐడీల ప్రత్యేకత అని వివరిస్తున్నారు.
 
సోషల్‌ మీడియా.. డార్క్‌ వెబ్‌!
డ్రగ్స్‌ ముఠాలు సోషల్‌ మీడియాతోపాటు డార్క్‌వెబ్‌/నెట్‌ను కూడా వినియోగిస్తు న్నట్టు పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్, టెలిగ్రాం వంటి సోషల్‌ మీడియా సైట్లతోపాటు డార్క్‌నెట్‌ను వాడు తున్నట్టు పేర్కొం టున్నారు. ఈ డార్క్‌నెట్‌ను ఇంటర్నెట్‌లో అథోజగత్తుగా చెబుతున్నారు. వీటిని సాధారణ సెర్చ్‌ ఇంజన్లు, సాఫ్ట్‌వేర్స్‌తో చూడలేరు.
 
ముందు ఫ్రీగా.. తర్వాత డబ్బుకు..
ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, ప్రముఖ కాలేజీల్లో విద్యార్థులు, ఎంఎన్‌సీ కంపెనీల ఉద్యోగులకు ముందుగా కెల్విన్‌ ఉచితంగా డ్రగ్స్‌ సరఫరా చేశాడని అధికారులు గుర్తించారు. వారం, పది రోజులు డ్రగ్స్‌కు అలవాటు చేసి, తర్వాత అవి లేకుండా ఉండలేని స్థితికి తీసుకువచ్చి అప్పట్నుంచి డబ్బులకు విక్రయించేవారు. ఇలా డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి వారి నుంచి కెల్విన్‌ భారీగా డబ్బులు దండుకున్నట్టు తెలిసింది. 9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులను టార్గెట్‌గా ఎంచుకొని వారికి డ్రగ్స్‌ ముఠా మత్తు అలవాటు చేసేదని, 19 ఎంఎన్‌సీ కంపెనీల్లోని పలువురు ఉద్యోగులను కూడా ట్రాప్‌ చేసిందని అధికారులు తెలిపారు.
 
సిల్లీగా గంజాయి ఏంటి?
2013లోనే నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కెల్విన్‌ను గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్ట్‌ చేశారు. రెండు నెలల పాటు జైలులో ఉన్న అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. మ్యూజీషియన్‌ కావడంతో స్టార్‌ హోటళ్లలో పలు ప్రోగ్రామ్‌లు కూడా చేశాడు. ఈ క్రమంలో గోవా నుంచి ఓ ఆఫర్‌ వచ్చింది. 2014 సంవత్సరంలో గోవాలోనూ ప్రోగ్రామ్‌ చేసేందుకు వెళ్లిన కెల్విన్‌కు అక్కడ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి ద్వారా డ్రగ్స్‌ లింకును అందిపుచ్చుకున్న కెల్విన్‌... షికాగో పెడ్‌లర్లను పట్టుకున్నాడు. అప్పట్నుంచి సిల్లీగా గంజాయి ఎందుకు సరఫరా చేయాలనుకున్న కెల్విన్‌.. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ తదితర డ్రగ్స్‌ను సరఫరా చేయడం మొదలుపెట్టినట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు.
 
వారంలో 19 సార్లు ఫోన్‌ కాల్‌
ఇక ఈ డ్రగ్స్‌ కేసులో తెరపైకి వచ్చిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు.. కెల్విన్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నాడని, ఇందుకు కాల్‌ డేటా ఆధారాలున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు. గోవాలో ఉండి కూడా తనకు డ్రగ్స్‌ కావాలంటూ సదరు నిర్మాత కెల్విన్‌ను ఆశ్రయించాడని ఆయన తెలిపారు. కేవలం వారం రోజుల్లో 19 సార్లు కెల్విన్‌కు ఫోన్‌ చేశాడని, లక్షల విలువైన ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. ఇందుకు గోవాలో ఉన్న కెల్విన్‌ స్నేహితుడు బ్యాంక్‌ అకౌంట్లోకి ఆ నిర్మాత రూ.3.5 లక్షల నగదును ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసినట్టు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
 
ఆ నిర్మాతను ఇప్పుడు ప్రశ్నించం
డ్రగ్‌ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ప్రముఖ నిర్మాత, దర్శకుడిని ఎప్పుడు ప్రశ్నిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ సమాధానం దాటేశారు. దానికింకా చాలా సమయం పడుతుందని, నాలుగు రోజల తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో డ్రగ్‌ కేసు దర్యాప్తునకు సరైన టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్, సిబ్బంది లేరని, దీంతో అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆ విభాగం అధికారులు చెబుతున్నారు. తమ విభాగంలో సరిగ్గా 40 మంది కూడా లేరని, ఇంత పెద్ద కేసును ఛేదించేందుకు ఇంకా సమయం పడుతుందని పేర్కొన్నారు.
 
పోలీస్‌ శాఖకు సమాచారమే లేదు
ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వెలుగులోకి తెచ్చిన ఈ డ్రగ్‌ రాకెట్‌లో అనేక స్కూళ్లు, కాలేజీలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, సినీ పెద్దలు.. ఇలా అనేక రంగాలకు చెందిన వారుండటం ఇప్పుడు పోలీస్‌ శాఖను ఇరకాటంలో పడేసింది. కేసును పట్టుకున్నది ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగమే అయినా.. ఈ రంగాలపై నిత్యం నిఘా పెట్టాల్సింది పోలీస్‌ శాఖనే. దీంతో ఆరోపణలెదుర్కొంటున్న స్కూళ్లు, కాలేజీల జాబితాను నగర పోలీస్‌తో పాటుసైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు అందించాల్సి ఉంటుంది. ఈ కాలేజీలు, పాఠశాలల్లోని విద్యార్థులపై నిఘా వేసి ఉంచాలని సూచించాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్సైజ్‌ విభాగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పోలీస్‌ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డ్రగ్‌ రక్కసిని ఎక్సైజ్‌ విభాగం నియంత్రించడం సా«ధ్యం కాదని, అందుకు తాము కూడా తోడ్పాటు అందిస్తామని వారు అంటున్నారు.
 
నిర్మాతే పెడ్‌లర్‌గా మారి..
కెల్విన్‌ ద్వారా గోవాలో డ్రగ్స్‌ స్వీకరించిన నిర్మాత.. పలువురు సినీ సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్‌ సరఫరా చేసి ఉంటాడని ఎక్సైజ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నిర్మాత కాల్‌డేటాను విశ్లేషించాలని భావిస్తున్నారు. కెల్విన్‌ విచారణలో కూడా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పెద్దగా సినిమాలు లేకుండా ఉన్న పలువురు సెలబ్రిæటీలకు సదరు నిర్మాత డ్రగ్స్‌ రవాణా చేసినట్టు కెల్విన్‌ చెప్పినట్లు సమాచారం. వాట్సాప్‌ ద్వారా ఒకట్రెండు సార్లు వారి పేర్లను కెల్విన్‌కు నిర్మాత షేర్‌ చేశాడని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత సెలబ్రిటీల కార్ల నంబర్లు, ఎక్కడ వెయిట్‌ చేయాలో వాటి లోకేషన్‌ తదితర వివరాలను నిర్మాత.. కెల్విన్‌కు షేర్‌ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. మాదాపూర్‌లోని ప్రముఖ మాల్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతంలో ఉండాలని, హోండా యాక్టివాపై రెడ్‌ కలర్‌ టీషర్ట్‌ వేసుకొని వచ్చే అబ్దుల్‌ వహీబ్‌ అనే వ్యక్తి ప్యాకెట్‌ ఇస్తాడని కెల్విన్‌ చెప్పినట్టు వాట్సాప్‌ సందేశాల్లో వెల్లడైనట్టు అధికారులు తెలిపారు. కాలేజీ విద్యార్థుల బైక్‌లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కార్ల నంబర్ల ద్వారా కస్టమర్లను గుర్తించి డ్రగ్స్‌ విక్రయాలు జరిపినట్టు కెల్విన్‌ తన విచారణలో బయటపెట్టాడు.
 
మరో నలుగురి అరెస్ట్‌.. డ్రగ్స్‌ స్వాధీనం
డ్రగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా కెల్విన్‌ అండ్‌ గ్యాంగ్‌ వెల్లడించిన అంశాల ఆధారంగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి ఎల్‌ఎస్‌డీ డ్రాప్స్‌ ఉన్న 2 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  అరెస్టయిన వారిలో అమన్‌ నాయుడు(25), రవి కిరణ్‌(34), నిఖిల్‌షెట్టి(23), కుందన్‌సింగ్‌(23) ఉన్నారు. వీరిలో రవి కిరణ్‌ ఓ గేమింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌. మిగతా ముగ్గురు అమన్‌ నాయుడు, నిఖిల్‌షెట్టి, కుందన్‌లు ఇంజనీరింగ్‌ విద్యార్థులని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. వీరు గోవా నుంచి ఈ డ్రగ్‌ తెప్పించారని, వీరికి కెల్విన్‌కు సంబంధాలున్నట్టు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటపడినట్లు తెలిపారు. ఈ కేసులో మరో ముగ్గురు కీలక నిందితులున్నారని, వారిని పట్టుకుంటే షికాగో, గోవాల నుంచి వస్తున్న ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌కు పూర్తి అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. 
 
కేసులు పెట్టం.. సహకరించండి
ఇప్పటివరకు డ్రగ్స్‌ తీసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విచారణకు సహకరించాలని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. డ్రగ్స్‌ సరఫరా చేసే వారే తమ టార్గెట్‌ అని, వారి వివరాలు చెప్పిన విద్యార్థుల వివరాలను గోప్యంగా పెడతామని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు.
 
కేసు దర్యాప్తు అతి రహస్యం
- బడాబాబులు, వారి పిల్లలు ఉండటమే కారణం!
సాక్షి, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు ఎంత రహస్యంగా జరుగుతున్నాయో.. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్న డ్రగ్స్‌ కేసు దర్యాప్తు అంతకంటే ఎక్కువ గోప్యంగా సాగుతోంది. మొదట్లోనే కొన్ని లీకులు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత పూర్తి గోప్యతను పాటిస్తున్నారు. ఇందులో పలువురు సెలబ్రిటీలు, వీఐపీల పేర్లున్నాయని, కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులు, స్కూళ్ళు, కాలేజీల విద్యార్థులు సైతం డ్రగ్స్‌కు బానిసలుగా మారినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అయితే ఆ విద్యా సంస్థలు ఏవి అన్న అంశంపై అధికారులు నోరుమెదపటం లేదు. అరెస్టు చేసిన నిందితులపై కేసులు నమోదు చేయించారు. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను కూడా అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఆయా ఠాణాల ఇన్‌స్పెక్టర్లను సంప్రదిస్తే.. ఎఫ్‌ఐఆర్‌లు తమ వద్ద లేవని, దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారి వద్దనే ఉన్నాయని చెబుతున్నారు. బడాబాబులు, వారి పిల్లలతో ముడిపడి ఉన్న వ్యవహారం కావడం వల్లే ఈ గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
వరంగల్‌లోనూ గంజాయి మాఫియా
కాజీపేట అర్బన్‌: విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ముఠా వరంగల్‌ నగరంలో వెలుగుచూసింది. నగరంలోని షెట్టి సత్యనారాయణరెడ్డి పద్మాక్షి కాలనీలో పాన్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. నిత్యం ధూమపాన ప్రియులకు విదేశీ సిగరెట్లను అమ్ముతుంటాడు. దీనికి మరో అడుగు ముందుకేసి గంజాయి విక్రయాలను కూడా కొనసాగిస్తున్నాడు. నగరంలో కళాశాలల విద్యార్థుల కు గంజాయి సరఫరా చేస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టారు. సత్యనారాయణరెడ్డి మంగళవారం వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గంజాయిని దిగుమతి చేసుకుని పద్మాక్షికాలనీకి బయలుదేరాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కిలో 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా. నగరంలో పలు ప్రతిష్టాత్మకమైన కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు వెల్లడించాడని సుబేదారి సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.
>
మరిన్ని వార్తలు