నగరంలో మరో డ్రంకన్ డ్రైవ్ ప్రమాదం

6 Oct, 2016 03:48 IST|Sakshi
నగరంలో మరో డ్రంకన్ డ్రైవ్ ప్రమాదం

- ఎల్‌బీనగర్‌లో తాగిన మత్తులో పాదచారిని ఢీకొట్టిన క్యాబ్‌డ్రైవర్
- తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన యాదగిరి అనే వ్యక్తి
- ఇంకా విషమంగానే చిన్నారి సంజన ఆరోగ్య పరిస్థితి

 సాక్షి, హైదరాబాద్: నగరంలో మందుబాబుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. చిన్నారి రమ్య, చిన్నారి సంజన ఉదంతాలను మరువకముందే.. మంగళవారం రాత్రి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ గాయత్రినగర్‌లో మరో డ్రంకన్ డ్రైవ్ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గాయత్రినగర్‌లో నివసించే వ్యాపారి సీహెచ్ యాదగిరి(47) మంగళవారం రాత్రి ఇంటి సమీపంలోని కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టీఎస్08యూబీ1734 క్యాబ్ యాదగిరిని ఢీ కొట్టింది.
 
దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని కాళ్లపై నుంచి టైర్లు వెళ్లాయి. స్థానికులు యాదగిరిని సాయిసంజీవిని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ రత్నాకర్‌రెడ్డి అతిగా మద్యం సేవించి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రత్నాకర్‌కు బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కాగా, బాధితుడు యాదగిరికి రెండు కాళ్లకూ మల్టిఫుల్ ఫ్రాక్చర్ అరుునట్లు వైద్యులు తెలిపారు.
 
విషమంగానే చిన్నారి ఆరోగ్య పరిస్థితి..
హయత్‌నగర్ పెద్దఅంబర్‌పేట బస్టాపులో రోడ్డు దాటుతున్న తల్లీకూతుళ్లు శ్రీదేవి, సంజనను మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ ముగ్గురు యువకులు ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సంజన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తేగానీ ఏ విషయం చెప్పలేమని కామినేని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు.
 
సంజన తలపై తీవ్రగాయాలయ్యాయని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. బ్రెయిన్‌డెడ్ అయి0దనే వార్తలు అవాస్తవమన్నారు. చిన్నారి కాలుకు ఫ్రాక్చర్ అయి0దని, ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చిన్నారి సంజన తల్లి శ్రీదేవి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.
 
సంజన కుటుంబానికి ఉచిత వైద్యం అందించాలి: చంద్రకుమార్
 చిన్నారి సంజన కుటుంబానికి ఉచితంగా వైద్య చికిత్సను అందించడమే కాక ఆర్థిక సహాయం అందజేయాలని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన, తల్లి శ్రీదేవిలను  ఆయన పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ చిన్నారి సంజన, తల్లి శ్రీదేవిలను పరామర్శించారు.

మరిన్ని వార్తలు