కొరియర్‌ పార్శిళ్లపై డేగ కన్ను

24 Dec, 2016 00:58 IST|Sakshi
కొరియర్‌ పార్శిళ్లపై డేగ కన్ను

► హైదరాబాద్‌ నుంచి ఉత్తరాదికి వెళ్తున్న భారీ ప్యాకింగ్స్‌
►పాత నోట్లుగా అనుమానిస్తున్న దర్యాప్తు ఏజెన్సీలు
► రెండు సంస్థల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి


సాక్షి, హైదరాబాద్‌: రద్దయిన నోట్ల మార్పిడి నగరంలో కష్టసాధ్యం కావడంతో నగదు బయటి ప్రాంతాలకు తరలిపోతోందా..? దీనికి కొన్ని కొరియర్‌ సంస్థలు పరోక్షంగా సహకరిస్తున్నాయా..? ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ నేపథ్యంలో ప్రధానంగా రెండు సంస్థల కార్యకలాపాలపై డేగకన్ను వేసినట్లు తెలిసింది. వీటితో పాటు ఇతర సంస్థల నుంచి ఉత్తరాదికి వెళ్లే పెద్ద ప్యాకింగ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం.

పెరిగిన నిఘా.. కేసులు...
పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తర్వాత నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరమయ్యాయి. పోలీసులతో పాటు ఐటీ, సీబీఐ తదితర విభాగాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా పెద్ద ఎత్తున మార్పిడి ముఠాలు చిక్కడంతో పాటు లెక్కలు లేని నగదు సైతం స్వాధీనమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో నగరంలో ఈ ‘మార్పిడి’ సాధ్యం కాకపోవడంతో నల్ల కుబేరులు ఉత్తరాదికి చెందిన ముఠాలను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

‘రోడ్డు’ ద్వారా తరలించడం కుదరక...
నోట్ల రద్దు ప్రకటించిన తొలి రోజుల్లో ఎస్కార్ట్‌ హుండీ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ఈ దందాలో సిటీ నుంచి పాత నోట్లు ఉత్తరాదిలోని మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు అధికారులు అనుమానించారు. ఈ విధానంలో ఉత్తరాదిలో ఉన్న ఏజెంట్లు వివరాలు కేవలం నగదును పంపే వ్యాపారస్తులకు తెలుస్తుండేవి. వీరు ఓ కారు/ తేలికపాటి వాహనంలో పాత నోట్లును నేర్పుగా పేర్చి, ఈ కారును నమ్మకమైన వ్యక్తికి అప్పగించి ఉత్తరాదిలో చేర్పించారని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై దృష్టిపెట్టి దాడులు చేసేలోపే ఈ దందాకు బ్రేక్‌ పడింది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల సరిహద్దులు, ఇతర రాష్ట్రాల్లోనూ రహదారులపై తనిఖీలు పెరగడంతో ఈ దందాను వదిలేసినట్లు తెలిసింది.

ప్రత్యేక నిఘా...
నిబంధనల ప్రకారం నగదును కొరియర్‌ ద్వారా పంపే ఆస్కారం లేదు. అయితే కొన్ని సంస్థల నిర్వాహకుల సహకారంతో నల్లబాబులు ఈ దందా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల రెండో విడత స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇది మరింత జోరందుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలిసింది. ప్రధానంగా రెండు కొరియర్‌ సంస్థలు ఈ దందాకు సహకరిస్తున్నాయనే అనుమానంతో వాటి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఏం చేస్తారో  అంతు చిక్కట్లేదు..!
నగరం నుంచి రోజూ భారీగా కొరియర్‌ పార్శిల్స్‌ ద్వారా నగదు ఎక్కడికి వెళ్తోంది? అక్కడ వ్యవస్థీకృత ముఠాల ద్వారా మార్పిడికి పాల్పడుతున్నారా? ఆదాయం చూపే ఆస్కారం ఉన్న బినామీల ద్వారా డిపాజిట్లు చేయిస్తున్నారా? అనే అంశాలపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనుమానిత లావాదేవీలు, కార్యకలాపాలకు సంబంధించి జాబితా సిద్ధం చేసుకున్న అధికారులు త్వరలో దాడులు చేయడానికీ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

మరిన్ని వార్తలు