ఆదాయమా...ఎక్కడున్నావ్?

4 Jan, 2015 00:49 IST|Sakshi
ఆదాయమా...ఎక్కడున్నావ్?

ఆర్థిక ఆసరాకు హెచ్‌ఎండీఏ యత్నాలు
ఖాళీగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు
లీజ్ బకాయిలను పట్టించుకోని వైనం

 
సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న హెచ్‌ఎండీఏ ఇప్పుడు ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. కొత్త లేఅవుట్లు, భూ వినియోగ మార్పిడి, ఇతర అనుమతుల కోసం ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. సిబ్బందికి నెలవారీ జీతభత్యాలు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, పార్క్‌ల నిర్వహణ వంటివి తలకుమించిన భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తన ఆధీనంలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షాపులు, కార్యాలయాలను లీజ్‌కు ఇచ్చి ఎంతో కొంత ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఆరాటపడుతోంది. అయితే... రాష్ట్రం రెండుగా విడిపోవడంతో కొందరు తమ వ్యాపారాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించారు. దీంతో అమీర్‌పేటలోని మైత్రీ వనం, మైత్రీ విహార్, స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్స్‌లలో అనేక షాపులు ఖాళీ అయ్యాయి. గతంలో నిర్ణయించిన లీజ్ మొత్తం అధికంగా ఉందంటూ మరికొందరు ఖాళీ చేసి వెళ్లారు. దీంతో ఈ కాంప్లెక్స్‌లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిని భ ర్తీ చేసేందుకు అధికారులు అనేకసార్లు టెండర్లు పిలిచారు. అయినా లీజ్‌కు తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. గతంలో నిర్ణయించిన లీజ్ మొత్తాన్ని కొంత తగ్గించి టెండర్ పిలిస్తే ప్రయోజనం ఉండేది.

దీనికి అధికారులు సాహసించట్లేదు. లీజ్ మొత్తాన్ని తగ్గిస్తే... ఇప్పటికే ఆ కాంప్లెక్స్‌లలో ఉన్న వారు తమకు కూడా తగ్గించాలని గొడవ చేసే అవకాశం ఉందని...దీని వల్ల ఆదాయం మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు సంశయిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతో ఏళ్ల తరబడి కొన్ని షాపులు ఖాళీగా ఉంటున్నాయి. ఫలితంగా లీజ్ రూపంలో వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం అందకుండా పోతోంది. విద్య, వాణిజ్య  వ్యాపార సంస్థలతో కిటకిటలాడే అమీర్‌పేటలో హెచ్‌ఎండీఏకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. కొందరు అధికారులు లీజ్‌దారులకు వక్రమార్గాన్ని సూచిస్తూ ప్రయోజనం పొందుతుండటంతో సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. ఈ కాంప్లెక్స్‌లలో షాపును లీజ్‌కు తీసుకోవాలన్నా.... ఉన్న వారు ఖాళీ చేయాలన్నా అధికారులు సవా లక్ష ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న అపవాదును సంస్థ మూటగట్టుకొంది. కొందరు అక్రమార్కులు లీజ్‌దారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకొంటూ సంస్థకు రావాల్సిన లీజ్ మొత్తాన్ని బకాయిగా చూపుతున్నారు. వారి నుంచి స్వీకరించిన డిపాజిట్ మొత్తాన్ని మినహాయించుకొని వెంటనే ఖాళీ చేయించాల్సి ఉండగా... చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు బకాయిలు పేరుపోయాయి. అక్రమార్కులను సంస్కరించకుండా ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా... ప్రయోజనం ఏమిటన్నది ఉన్నతాధికారులకే తెలియాలి.
 
 
లీజ్‌కు షాపులు
 
అమీర్‌పేటలోని మైత్రీ వనం, స్వర్ణ జయంతి, మైత్రి విహార్‌లలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లలో షాపులు, కార్యాలయాలను లీజ్‌కు కేటాయించనున్నట్లు హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. తార్నాకలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లోనూ అనేక షాపులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.  ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం ఠీఠీఠీ.జిఝఛ్చీ.జౌఠి.జీలో  సంప్రదించాలని అధికారులు సూచించారు. తార్నక, అమీర్‌పేటలోని కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోదలచిన వారు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. సీల్డ్ టెండర్‌ను ఈనెల 6 నుంచి 23లోగా తార్నాకలోని ఆర్ అండ్ డీఓ సెక్షన్‌లో అందజేయాలని ఆ ప్రకటనలో కోరారు. నేరుగా దరఖాస్తు చేసుకోదలచిన వారు తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ఆర్ అండ్ డీఓ సెక్షన్ నుంచి దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం 9989336917 లేదా 9849902556 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హెచ్‌ఎండీఏ కార్యాలయంలో తెరిచి అర్హులకుఆ కాంప్లెక్స్‌ల లో షాపులు, కార్యాలయాలు కేటాయిస్తామని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు