రాజరికపు జ్ఞాపకం... అనుభూతుల సంతకం

3 Jan, 2016 10:14 IST|Sakshi
రాజరికపు జ్ఞాపకం... అనుభూతుల సంతకం

న్యూ ఇయర్ పార్టీ మూడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానిని ఈ వీకెండ్ దాకా సిటీ కంటిన్యూ చేస్తోంది. ఉర్రూతలూగించిన నైట్‌పార్టీకి తోడుగా ప్రశాంతతను, రొటీన్‌కు భిన్నమైన ఆనందాన్ని  పొందేందుకు వీకెంట్ టూర్ చేయాల్సిందే. ఇలా ఆలోచించేవారికి సిటీకి అతి చేరువలో ఉన్న భువనగిరి కోట ఒక చక్కని గమ్యం. - ఓ మధు
 
గిరులు కోటలకు ఆవాసాలుగా మారిన తార్కాణాలెన్నో... గోల్కొండ, చంద్రగిరి, భువనగిరి ఆ కోవలోకి వచ్చే కోటలే... 12 వ శతాబ్దంలో కట్టిన ఈ కోట నేటికి రాచఠీవి కోల్పోకుండా తన దర్పాన్ని చూపిస్తుంది.
 
సిటీకి దగ్గరగా... రొటీన్‌కు దూరంగా...
నల్లగొండ జిల్లాలో సిటీకి 48 కి.మీ దూరంలో ఉన్న ఈ కోట సిటిజనులకు చక్కటి వీకెండ్ స్పాట్.  ఈ కోట  నిర్మాణ కౌశలం నేటికి ఆకట్టుకుంటోంది. చాళుక్య త్రిభువనమల్ల విక్రమాదిత్య ఈ కోటను నిర్మించాడని ఆయన పేరు మీదనే ఈ కోటకు త్రిభువనగిరి అని పిలిచేవారని చరిత్ర.  తర్వాత కాలంలో ఇది భువనగిరికోటగా స్థిరపడింది.
 
విశేషాలెన్నో...
మత్తగజంలా కనిపించే శిలపై నిర్మించిన ఈ కోట మనను దూరం నుంచే ఆహ్వానిస్తున్నట్లుంటుంది. అంతటి నునుపైన శిలపై కోట ఎలా నిర్మించారో అర్థం కాదు. మొత్తం 50 ఎకరాలలో, 500 అడుగుల ఎత్తున్న ఏకశిల చూస్తే ప్రకృతి విచిత్రమే అనిపిస్తుంది.  ఈ శిలకు రెండు వైపులా ద్వారాలున్నాయి. మెట్ల ద్వారా లేదా ట్రెక్కింగ్ చేస్తూ కోటకు చేరుకోవాల్సి ఉంటుంది.  నేల మాలిగలు, ఆయుధాలు దాచే రహస్య స్థావరాలు, శత్రువులను తప్పు దోవ పట్టించే మార్గాలు, లోతైన కందకం ఇలా  కోటలో విశేషాలు అనేకం. ఆవరణలో 2 తటాకాలు, కొన్ని లోతైన బావులు ఉన్నాయి. వాన నీటిని నిలువ చేసేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్‌లో తామర తుండ్లు వికసించటం నేటికి చూడవచ్చు.  భువనగిరి నుంచి గోల్కొండకు రహస్య మార్గం ఉండేదని అంటారు.

రుద్రమదేవి, ఆమె మనవడు ప్రతాపరుద్రుడి కాలంలో ఎంతో వైభవంగా వెలిగింది ఈ కోట. ఎన్నోసార్లు శత్రువుల దాడులకు లోనయినా, దుర్భేద్యంగా నిలిచిన భువనగిరి కోట 15 వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ల చేతికి చిక్కింది. వారి ఫిరంగులు, గన్‌పౌడర్ దాడులకు తలొగ్గాల్సి వచ్చింది. వారి ఏలికలో ఇస్లామిక్ శైలిలో కోటకు కొన్ని మార్పులు జరిగాయి. ఆ తర్వాత 18 శతాబ్దం నుంచి ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఉన్న ఈ కోట నేడు దాదాపు శిథిలావస్థకు చేరింది. అయినప్పటికీ ఈ కోట ఆర్కిటెక్చర్ ఆధునికులను  ఆశ్యర్యపరుస్తుంది.
 
కోట పై భాగానికి చేరి భువనగిరి నగరాన్ని వీక్షిస్తుంటే, గతం మిగిల్చిన జ్ఞాపకాల నుంచి బయటపడి కొత్త ఏడాదిలోకి ప్రయాణం మొదలు పెట్టడానికి కావలసిన బలాన్ని, ఉత్తేజాన్ని అక్కడి గాలి మనకు అందిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడికి చేరువలోనే యాదగిరి గుట్ట, సురేంద్రపురి మ్యూజియం ఉన్నాయి.

మరిన్ని వార్తలు