‘సాక్షి’ ఎరీనాకు సర్కారు మద్దతు

23 Jan, 2017 01:48 IST|Sakshi
‘సాక్షి’ ఎరీనాకు సర్కారు మద్దతు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిభ కలిగిన ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘సాక్షి’ మీడియా సంస్థ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఎరీనా వన్‌ యూత్‌ఫెస్ట్‌కు రాష్ట్ర క్రీడా శాఖ తరఫున ఏటా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని క్రీడలు, యువజన సర్వీసులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. ఎరీనా పోటీల్లో గెలుపొందే క్రీడాకారులకు వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీ బహుమతులు అందజేస్తామన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియం లో కన్నుల పండువగా సాగిన ‘సాక్షి’ ఎరీనా వన్‌ యూత్‌ ఫెస్ట్‌ రెండో ఎడిషన్‌ ఉత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఫొటో గ్యాలరీ : ( సాక్షి ఎరీనా యూత్‌ఫెస్ట్‌ )

వివిధ ఇంజనీరింగ్, వృత్తివిద్యా కళాశాలల సమాచారం ఉన్న ‘ఎక్సలెన్సీ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్రికెట్, కబడ్డీ తదితర క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన వివిధ కాలేజీ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాకారులకు ఇతోధికంగా ప్రోత్సాహం అందజేస్తున్నార న్నారు. క్రీడలకు గతేడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో రూ.64 కోట్లు కేటాయించామన్నా రు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ను భారీగా పెంచుతామని చెప్పారు. యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ద్వారా బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలతో పాటు ఒలింపిక్‌ పథకాలు సాధించిన క్రీడాకా రులకు ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు నగదు ప్రోత్సాహకం అందజేస్తోందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠకుల ఆదరాభిమానాలు చూరగొన్న ‘సాక్షి’ మీడియా సంస్థ క్రీడాకారులను ప్రోత్సహించడం, ప్రతిభ కలిగిన వారిని వెలుగులోకి తీసుకురావడం అభినందనీ యమని కొనియాడారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 600కు పైగా కళాశాలలు ఈ ఎరీనా పోటీల్లో పాల్గొనాలని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. అన్ని రకాల క్రీడల్లో హైదరాబాద్‌ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు.

క్రీడాస్ఫూర్తితోనే రాణిస్తాం
ప్రతి ఒక్కరూ అన్ని అంశాల్లో నూటికి నూరుశాతం సంపూర్ణంగా ఉన్నప్పుడే గొప్పవిజయాలు సాధించవచ్చని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అన్నారు. క్రీడాస్ఫూర్తితో పనిచేసినపుడే అనుకున్న పనిలో రాణించగలమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ బలం, బలహీనతలను బేరీజు వేసుకొని గొప్ప లక్ష్యాలను నిర్దేశించు కోవాలని, ఎవరినీ గుడ్డిగా అనుసరించరాదని సూచించారు. యువతే దేశ సంపద అని సోషల్‌ మీడియాతో విలువైన సమయాన్ని వృథా చేయరాదన్నారు. సమాజంపై యువత చూపే ప్రభావంతోనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి యువతను ఆకట్టుకున్నారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. సృజనాత్మకత, సమయస్ఫూర్తి వంటి ఉత్తమ లక్షణాలు క్రీడల ద్వారానే అలవడతాయ న్నారు.

ప్రముఖ హకీ క్రీడాకారుడు, అర్జున, పద్మశ్రీ అవార్డుల గ్రహీత ముఖేశ్‌ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించినవారు చదువుతోపాటు ఇతర రంగాల్లో చురుగ్గా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్‌పర్సన్‌ రుద్రమదేవి, సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ విద్యాసంస్థల కార్యదర్శి జాఫర్‌ జావీద్, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్, సింగర్‌ శ్రీనివాస్, హోండా(ఆంధ్రప్రదేశ్‌ సేల్స్‌ విభాగం) సంస్థ అసిస్టెట్‌ మేనేజర్‌ అనంత్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సాక్షి ఫైనాన్స్‌ విభాగం డైరెక్టర్‌ వైఈపీ రెడ్డి, సాక్షి కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం డైరెక్టర్‌ రాణీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉరకలెత్తిన ఉత్సాహం..
వేలాది మంది కుర్రకారు కేరింతలు.. జయజయధ్వానాలు.. వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులతో ఉత్సాహంగా సాగిన మార్చ్‌ఫాస్ట్‌.. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటా.. పాటలతో ‘సాక్షి’ ఎరీనా వన్‌ యూత్‌ ఫెస్ట్‌ రెండో ఎడిషన్‌ సంబురాలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకల్లో 230కి పైగా కాలేజీలకు చెందిన సుమారు 4,500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎల్బీస్టేడియం కిటకిటలాడింది. వివిధ కాలేజీ విద్యార్థులు ఆలపించిన సినీ నేపథ్య గీతాలు, స్వయంగా రూపొందించిన మ్యూజిక్‌ ఆల్బమ్స్, సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆహూతులను మైమరపించాయి. పలు క్రీడాంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు వెల్లువెత్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలరించిన సెలబ్రిటీలు  
థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని పృథ్వీ పేల్చిన డైలాగులు, ప్లే బ్యాక్‌ సింగర్‌ హేమచంద్ర, రాప్‌ సింగర్స్‌ ’హే పిల్లా’ టీమ్‌ పాడిన పాటలు విద్యార్థులను ఉర్రూతలూగించాయి. వీరు పాడిన పాటలకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు స్టెప్పులేశారు. అష్టాచమ్మా, ఊహలు గుసగుసలాడే ఫేమ్‌ అవసరాల శ్రీనివాస్‌ తన మాటలతో యువతకు మార్గనిర్దేశనం చేశారు. లాస్య నటించిన త్వరలో విడుదల కానున్న ’రాజా మీరు కేక’చిత్రంలోని  డైలాగులతో అలరించింది. 

>
మరిన్ని వార్తలు