‘దత్తత’లో... పెత్తందారీ!

23 Aug, 2015 06:07 IST|Sakshi

అధికార పార్టీ నేతలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గ్రామజ్యోతి కార్యక్రమం పుణ్యమాని వారంతా వారం రోజులుగా ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మండలానికో గ్రామాన్ని, ఎమ్మెల్సీ అయితే నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని గులాబీ దళపతి హుకుం జారీ చేశారు.  ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్సీ కూడా ఉన్న చోటే చిక్కంతా వచ్చి పడింది. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ఇప్పుడిది హాట్ టాపిక్. కన్నతల్లిని, సొంతూరిని మరవకూడదన్న వాక్కును తు.చ. పాటించాలని ఓ ఎమ్మెల్సీ భావించారు. తన సొంతూరిని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ, ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీనికి మోకాలడ్డారు. తానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పేచీ పెట్టారు.

చివరకు సొంతూళ్లో కూడా ఆ ఎమ్మెల్సీకి పేరు రావద్దన్నది ఆ ఎమ్మెల్యే వ్యూహం అని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆదివారంతో గ్రామజ్యోతి వారోత్సవాలు ముగుస్తున్నాయి. ఇప్పటికీ ఆ గ్రామ దత్తత విషయం తేలలేదు. చివరకు తన ఊళ్లో ఏ పనీ జరగొద్దనే ఎమ్మెల్యే కిరికిరి పెడుతున్నాడని సదరు ఎమ్మెల్సీ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇది ఫక్తు రాజకీయ వ్యవహారమే.. ఆధిపత్య పోరులో భాగమే అంటున్నారు మరికొందరు ...!!
 

మరిన్ని వార్తలు