గ్రేటర్ షో

27 Jan, 2016 00:57 IST|Sakshi

మా హయాంలోనే అభివృద్ధి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆల్విన్‌కాలనీ: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందని, టీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి, వివేకానందనగర్, ఆల్విన్‌కాలనీ, గౌలిపురా డివిజన్లలో మంగళవారం  నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే టీఆర్‌ఎస్ నాయకులు వారు చేసినట్టుగా  ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలు చేసేవారికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కూకట్‌పల్లి డివిజన్ అభ్యర్థి కూన అమ్రేష్‌గౌడ్, వివేకానందనగర్ డివిజన్ అభ్యర్థి విద్యాకల్పన, ఆల్విన్‌కాలనీ అభ్యర్థి నర్సింహా యాదవ్‌లను గెలిపించాలని కోరారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, రవికుమార్ పాల్గొన్నారు.
 
అభివృద్ధిలో సగం వాటా మాదే

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
చంపాపేట: టీఆర్‌ఎస్ చేసిన నగరాభివృద్ధిలో సగం వాటా తమకే దక్కుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా సగం ఉందని పేర్కొన్నారు. చంపాపేట చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. 2020 నాటికి అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. భాగ్యనగర అభివృద్ధికి మజ్లిస్ అరాచక శక్తులు అడ్డుతగులుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు, దానికి మద్దతిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇతర పార్టీల ప్రగల్భాలు, ప్రచార ఆర్భాటాలకు లొంగకుండా స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న చంపాపేట బీజేపీ అభ్యర్థి వంగా మధుసూధన్‌రెడ్డికే ఓటేయాలని కోరారు.
 
 భాగ్యనగర అభివృద్ధికి మజ్లిస్ అరాచక శక్తులు అడ్డుతగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు, వారికి మద్దతిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి
 
 
అభివృద్ధి చేశాం.. ఇంకా చేస్తాం
మంత్రి కేటీఆర్
 ఎల్‌బీనగర్‌జోన్ బృందం:  టీఆర్‌ఎస్ ప్రభుత్వం 18 నెలల్లోనే నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, ఎన్నో విదేశీ పెట్టుబడులను తెచ్చిందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్‌లో అధికారం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. నాగోలు, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ, గడ్డిఅన్నారం డివిజన్లలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. నగరాభివృద్ధికి తమకు ఒక్క అవకాశమివ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పడి ఏడాది కాకుండానే విద్యుత్ కోతలు లేకుండా చేశామని, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.

పేదలందరికీ ఇళ్లు
హైదరాబాద్‌లోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, ఈ ఏడాది 10 వేలు, 2017లో 25వేలు, 2018లో 50వేల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే సెటిలర్స్‌పై దాడులు చేస్తారని అప్పటి ప్రభుత్వ పెద్దలు, సమైక్య పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. 18 నెలల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్టడం కాదు కదా.. కనీసం గిల్లిన సందర్భాలు కూడా లేవన్నారు. 
 
సీమాంధ్రులు ఆలోచించి ఓటేయాలి..  
బీఎన్‌రెడ్డి నగర్ కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య, సచివాలయనగర్‌లోని భూమి సమస్యలు పరిష్కారం కావాలంటే అధికార పార్టీకే ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వనస్థలిపురం రైతుబజార్ వద్ద ఆయన మాట్లాడుతూ సీమాంధ్రులు ఆలోచించి ఓటేయాలని కోరారు. సీమాంధ్రులంతా తెలంగాణ వాదులేనని పేర్కొన్నారు. విడిపోవడం వల్ల రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకూ 85వేల పట్టాలిచ్చామని, వనస్థలిపురం రైతుబజార్ వద్ద గుడిసెవాసులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని, ఆటోనగర్ ఇసుక లారీల అడ్డాను తొలగిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచామని, కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’లా మారిందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి దోహదం చేస్తాయన్నారు. ప్రచారంలో మంత్రి జగదీష్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఇంచార్జి రాంమోహన్‌గౌడ్, నాగోలు, కొత్తపేట, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ డివిజన్ల అభ్యర్థులు చెరుకు సంగీత, జీ.వి.సాగర్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీప్రసన్న, పద్మానాయక్, సామ రమణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
 
సెటిలర్స్‌పై దాడులు చేస్తామని సమైక్యవాదులు తప్పుడు ప్రచారం చేశారు. 18 నెలల కాలంలో కొట్టడం కాదు కదా.. కనీసం గిల్లిన సందర్భాలు కూడా లేవు
 
నగరాభివృద్ధి తాత, నాన్న చలవే..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది మా తాత, నాన్నలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని డివిజన్లలో ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు. కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, ఐడీపీఎల్ చౌరస్తాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు. సైకిల్ జోరందుకుందని.. టీఆర్‌ఎ్‌స్ కారు టైరు పంక్చర్ అయిందని ఎద్దేవా చేశారు. మేయర్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాయమాటలతో 70 ఎం.ఎం. సినిమా చూపిస్తున్నారని, సీఎం అయ్యాక 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, టీడీపీ అభ్యర్థులు గడ్డం స్వాతికా రెడ్డి, బొడ్డు కామేశ్వరి, మన్నెరాజు, మెటె శ్రీనివాస్, కొట్టె రాధిక, సుజాతలు పాల్గొన్నారు.

అధికారమిస్తే మరింత అభివృద్ధి...
టీడీపీ, బీజేపీకి పట్టం కడితే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని లోకేష్ అన్నారు. మల్కాజిగిరి సర్కిల్‌లోని ఆరు డివిజన్లలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ‘గూగుల్‌లో హైదరాబాద్‌ను వెతికితే కనిపించే చార్మినార్, బుద్ధుడు, హైటెక్ సిటీల్లో.. రెండింటిని టీడీపీనే ఏర్పాటు చేసింద’ని లోకేష్ అన్నారు. టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడితే 400 ఏళ్ల చరిత్ర అంటున్నారని, కానీ 40 ఏళ్ల చరిత్ర తిరిగేస్తే టీడీపీ అభివృద్ధి తెలుస్తుందన్నారు. కేసీఆర్‌కు ముఖం చెల్లక కేటీఆర్‌ను ప్రచారానికి పంపించారని విమర్శించారు. తెలంగాణకు తక్కువ ఇల్లు కేటాయిస్తే చంద్రబాబునాయుడు ప్రధానితో మాట్లాడి 50 వేల ఇల్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 100 సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరి మాటమార్చారని విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కేటీఆర్ రాజీనామా చేయించి.. ఆయన వారిని తిరిగి గెలిపించుకుంటే, తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. టీడీపీ, బీజేపీ కూటమితోనే నగరాభివృద్ధి జరిగిందని ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావులు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులు మండలి విజయ్‌కుమార్ యాదవ్(మల్కాజిగిరి), శ్యామల (గౌతంనగర్), పిట్టల రేణుక(వినాయకనగర్), బీజేపీ అభ్యర్థులు బాబూసింగ్(ఈస్ట్ ఆనంద్‌బాగ్), సునీత(మౌలాలి), ప్రసన్న నాయుడు(నేరెడ్‌మెట్)లను లోకేష్ పరిచయం చేశారు. ప్రచారంలో సీతక్క, మండలి రాధాకృష్ణ యాదవ్  పాల్గొన్నారు.  
 హైదరాబాద్‌ను గూగుల్‌లో వెతికితే కనిపించే చార్మినార్, బుద్ధుడు, హైటెక్ సిటీల్లో రెండింటిని టీడీపీనే ఏర్పాటు చేసింది

మరిన్ని వార్తలు