ఆగాగు.. హెల్మెట్ ఏదీ..?

2 Aug, 2015 11:08 IST|Sakshi
విజయనగరంలో హెల్మెట్ ధరించని వాహన చోదకుల నుంచి అపరాధ రుసం వసూలు చేస్తున్న పోలీసులు

సాక్షి నెట్‌వర్క్ : రోడ్లపై దూసుకుపోతున్న టూ వీలర్లకు ‘హెల్మెట్’ బ్రేకులు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి హెల్మెట్ తప్పనిసరన్న నిబంధన అమల్లోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేట్టారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను ఆపి, వందేసి రూపాయలు ఫైన్ వేశారు. అప్పటికప్పుడు హెల్మెట్ కొనుక్కొని వచ్చిన వారికి వాహనాలను తిరిగి ఇచ్చారు. వెంటనే కొనడానికి డబ్బుల్లేవని చెప్పిన వారికి జరిమానా విధించారు.

మరికొన్ని జిల్లాల్లో హెల్మెట్ లేని వారిని ఆపినప్పటికీ, జరిమానాలు వసూలు చేయలేదు. హెల్మెట్ వల్ల ఉపయోగాలు చెప్పి, వెంటనే కొనాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో వాహనాల యజమానులు హెల్మెట్ కొనడానికి కొద్ది రోజులు గడువిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోయినా 2 నెలలపాటు జరిమానాలు విధించవద్దని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు.

కర్నూలు జిల్లాలో హెల్మెట్ల వాడకాన్ని ఈ నెల రెండో వారం నుంచి కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. హెల్మెట్ నిబంధనను వైఎస్‌ఆర్ జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేశారు.  హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారి వాహనాలను నిలిపివేశారు. హెల్మెట్ కొనుక్కుని వచ్చి చూపించాక వదిలేశారు. అప్పటికప్పుడు కొనలేని వారికి రూ.100 జరిమానా వేశారు.

విజయనగరంలో హెల్మెట్ ధరించని వాహన చోదకుల నుంచి అపరాధ రుసం వసూలు చేస్తున్న పోలీసులు
 

మరిన్ని వార్తలు