చలో అంటే చలానే

17 Oct, 2015 00:30 IST|Sakshi
చలో అంటే చలానే

ఫలితాలిస్తున్న కాప్‌లెస్ జంక్షన్లు
నెలలో 6400 కేసులు నమోదు
అత్యధికం సిగ్నల్ ఉల్లంఘనలే
విస్తరణకు ఉన్నతాధికారుల కసరత్తు

 
చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని సిగ్నల్స్ బేఖాతరు చేస్తూ దూసుకుపోతున్నారా? జాగ్రత్త... వాళ్లు మీ కంటికి కనిపించకపోయినా మీపైన కన్నేసే ఉంటారు. ఏ ఉల్లంఘనకు పాల్పడినా మరో జంక్షన్‌కు చేరేసరికి చలాన్ సిద్ధమవుతుంది. ఇదీ ‘కాప్‌లెస్ జంక్షన్’ ప్రత్యేకత. రహదారి నిబంధనలపై వాహన చోదకుల్లో అవగాహనతో పాటు క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసినవే కాప్‌లెస్ జంక్షన్స్. ప్రయోగాత్మకంగా 13 చోట్ల అమలవుతున్న ఈ విధానం ప్రారంభమై నెల రోజులైంది. ఈ కాలంలో ట్రాఫిక్ కాప్స్ ఉల్లంఘనులపై 6,441 కేసులు నమోదు చేసి... రూ.31.5 లక్షల జరిమానా విధించారు.  
 
 సిటీబ్యూరో: ఓ ప్రాంతంలో సిగ్నల్స్ ఏర్పాటు చేశారంటే నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసుల ద్వారా మాన్యువల్‌గా నియంత్రించాల్సిన అవసరం లేదని అర్థం. నగరంలో మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా... లేకున్నా సిబ్బంది మోహరింపు తప్పనిసరిగా మారిపోయింది. అలా లేకుంటే వాహన చోదకులు నిబంధనలను ఉల్లంఘించి దూసుకుపోతూ ప్రమాదాలబారిన పడటం... ప్రమాదాలకు కారకులుగా మారడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులూ సృష్టిస్తున్నారు. ఈ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నగర పోలీసులు ‘కాప్‌లెస్ జంక్షన్స్’ అంశాన్ని తెరమీదికి తెచ్చారు.

కెమెరాలు, చాటు బృందాలు...
ప్రస్తుతం నగరంలో 13 చౌరస్తాల్లో కాప్‌లెస్ జంక్షన్స్ విధానం అమలులో ఉంది. అత్యధికంగా మారేడ్‌పల్లి, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు, మూడేసి జంక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ చౌరస్తాల్లో ఎక్కడా పాయింట్ డ్యూటీల్లో ట్రాఫిక్ సిబ్బంది కనిపించరు. కాస్త దూరంలో మాటు వేసి ఉల్లంఘనలకు పాల్పడే వాహనాలను గుర్తిస్తుంటారు. వీరి కంటే ఎక్కువగా చౌరస్తాల్లోని కెమెరాలతో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిబ్బంది ఉల్లంఘనులపై కన్నేసి ఉంచుతారు. ఎవరైనా వాహన చోదకుడు నిబంధనలు బేఖాతరు చేస్తూ దూసుకుపోతే తక్షణం గుర్తిస్తారు. ఆ వ్యక్తి వెళ్తున్న మార్గంలో ముందున్న చౌరస్తాకు సమాచారం ఇస్తారు. దీంతో అక్కడి సిబ్బంది ఉల్లంఘనులను ఆపి... జరిమానా విధిస్తారు.
 
 క్రమశిక్షణ పెంచేందుకే ...
 కాప్‌లెస్ జంక్షన్లు అనేవి పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణం. అక్కడ రోడ్లపై ఎక్కడా పోలీసులు కనిపించరు. అయినప్పటికీ పక్కా నిఘా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసి ఉండటంతో ఎవరికి వారు క్రమశిక్షణతో మెలుగుతారు. ఇదే విధానాన్ని హైదరాబాద్ వాహనచోదకులకు అలవాటు చేసి... క్రమశిక్షణ పెంచాలన్నదే ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం.
 - ఎం.మహేందర్‌రెడ్డి, కొత్వాల్
 
 మరోచోట వినియోగిస్తున్నాం
 ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాప్‌లెస్ జంక్షన్ల నుంచి ఉపసంహరిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సేవలను మరోచోట వినియోగిస్తున్నాం. వాహన చోదకుల్లో స్వీయ క్రమశిక్షణ కు తోడ్పడే ఈ జంక్షన్ల సంఖ్యను త్వరలో 25కు పెంచాలని యోచిస్తున్నాం. వీటి నిర్వహణలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర.
 - జితేందర్, ట్రాఫిక్ చీఫ్
 
 
 

మరిన్ని వార్తలు