‘రిషిత’ ఇంట విషాదఛాయలు

21 Jul, 2014 09:19 IST|Sakshi
‘రిషిత’ ఇంట విషాదఛాయలు

 జగద్గిరిగుట్ట(బాచుపల్లి), నల్లకుంట:  హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి  రిషితారెడ్డి ఇంట ఆదివారం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె  మృతదేహం ఆదివారం లభించినట్లు అధికారులు వెల్లడించారు.  గల్లంతైన వారిలో నగరానికి చెందిన 16 మందిలో ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక నల్లకుంటకు చెందిన శ్రీహర్ష ఆచూకీ లభించాల్సి ఉంది. గల్లంతైన 42 రోజుల తరువాత రిషితారెడ్డి మృతదేహం లభ్యమైందన్న సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె మరణ వార్త తెలియడంతో కుప్పకూలిపోయారు.
 
 అమ్మానాన్నల కుటుంబాల తరఫున..
 రిషితారెడ్డి  అమ్మ తరఫున, ఇటు నాన్న బంధువుల్లో ఒకే ఒక ఆడపడుచు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఖ: సాగరంలో మునిగిపోయారు.
 
 అంత్యక్రియలకుఏర్పాట్లు
 రిషిత అంత్యక్రియలను బాచుపల్లి గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు.  అంత్యక్రియల కోసం కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు, బాచుపల్లి  పంచాయతీ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
 
 ఇంకా ఎదురుచూపులే..

 ఇక కల్లూరి శ్రీహర్ష (19) ఆచూకి నేటికి తెలియరాలేదు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మ కుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో ఉండే అడ్వకేట్ కేఆర్‌కేబీ.ప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు కల్లూరి శ్రీహర్ష (19) గత నెల 8న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆదివారం మరో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు లభ్యం కాగా గల్లంతైన వారిలో నల్లకుంటకు చెందిన శ్రీ హర్ష జాడ నేటికి తెలియరాలేరు.
 

మరిన్ని వార్తలు