హార్ట్‌ఎటాక్‌పై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ

14 Jul, 2016 18:51 IST|Sakshi

హైదరాబాద్ (రాంగోపాల్‌పేట్) : హఠాత్తుగా గుండె నొప్పికి గురయ్యే వారిని రక్షించేందుకు నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు కిమ్స్ ఆస్పత్రి ఈ నెల 16వ తేదీన ఓ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ హయగ్రీవచారి గురువారం వెల్లడించారు. హృదయ సంబంధిత వ్యాధితో  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని రక్షించేందుకు ఉపయోగించే కార్డియో పల్మనరీ రిసషియేషన్ విధానంపై పోలీసులకు వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు.

గుండె సంబంధిత ఇబ్బందులకు గురయ్యే వారిని ఆస్పత్రికి చేర్చేలోపు ముందుగా శ్వాస సక్రమంగా అందించడంతోపాటు రక్తప్రసరణ మెరుగయ్యేలా చూడటం వంటివి ఈ విధానంలో ఉంటాయని పేర్కొన్నారు. అకస్మాత్తుగా గుండె సంబంధ ఇబ్బందులు ఎదుర్కొనే వారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో పాటు ముందుగా ఇలా చేయడం ద్వారా  వారి ప్రాణాలు నిలబెట్టవచ్చని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల శిక్షణ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్, డీసీపీలు ఎల్‌ఎస్ చౌహాన్, ఏవీ రంగనాథ్ పాల్గొంటారని డాక్టర్ హయగ్రీవచారి వివరించారు.

>
మరిన్ని వార్తలు