కాళేశ్వరం భేష్‌!

28 Jan, 2018 04:09 IST|Sakshi

     కాళేశ్వరం, మిషన్‌ కాకతీయలకు అంతర్జాతీయ ప్రశంసలు

     కోటి ఎకరాల సాగు ప్రణాళికపై ఆశ్చర్యం

     విదేశీ ప్రతినిధులకు ప్రజెంటేషన్‌ ఇచ్చిన స్పెషల్‌ సీఎస్‌ జోషి  

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. కోటి ఎకరాల సాగు దిశలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్య క్రమాలు, చేపట్టిన పథకాలపై 19 దేశాల ప్రతినిధులు నీటిపారుదల శాఖను అభినందనలతో ముంచెత్తారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తిచేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం ఇథియోపియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, బ్రూనై, అల్జీరియా, మాల్దీవులు, మారిషస్‌ వంటి 19 దేశాలకు చెందిన ప్రతినిధులు 4 వారాల పర్యటన నిమిత్తం శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (అస్కీ) విదేశీ ప్రతినిధుల పర్యటనను సమన్వయపరచగా, ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌.కె.జోషి శనివారం ఇక్కడ జలసౌధలో వారికి సాగునీటి రంగంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

గొలుసుకట్టు చెరువులతో పాటు మొత్తం చిన్న నీటి వనరులను పరిరక్షించేందుకు, వాటి పునరుద్ధరణకుగానూ మిషన్‌ కాకతీయ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని, దీని ద్వారా 46వేల చెరువులను దశలవారీగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు ఈ పథకం విజయవంతానికి ప్రతివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారని, నిరంతర పర్యవేక్షణతో సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు. చెరువు మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతుతో పాటు, ఆ చెరువును నమ్ముకున్న రజక, బెస్త, ముదిరాజులకు జీవన భృతి దొరుకుతోందని వివరించారు.

ఈ ప్రజెంటేషన్‌ పట్ల విదేశీ ప్రతినిధులంతా నివ్వెరపోయారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇరిగేషన్‌లో సాధించిన ప్రగతి అద్భుతమని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు, రైతుల జీవితాన్ని మార్చబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విదేశీ ప్రతినిధులకు జోషి వివరించినప్పుడు ఆయా ప్రతినిధులు విస్తుబోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాడుతున్న అత్యాధునిక సాంకేతిక విధానాలను తెలుసుకుని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్న విధానాలు, రైతులు, ఇతర రంగాల వారికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు వంటి అంశాలపై ఆయన్ను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు