చంపేసి పాతిపెట్టారు

23 Aug, 2016 02:50 IST|Sakshi
చంపేసి పాతిపెట్టారు

- నయామ్ చేతిలో హత్యకు గురైన వంట మనిషి నస్రీన్ మృతదేహం లభ్యం
- మంచిరేవుల వద్ద గుర్తించిన పోలీసులు
- నిద్ర మాత్రలిచ్చి చంపేశారు: సిట్ చీఫ్ నాగిరెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ చేతిలో హతమైనవారి మృతదేహాలు బయటపడుతున్నాయి. తన సొంత అక్క భర్త నదీమ్ అలియాస్ విజయ్‌కుమార్‌ను మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుల్లో పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు వెలుగు చూడగా.. తాజాగా వంట మనిషి నస్రీన్ (17) మృతదేహం బయటపడింది. నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రామం వద్ద ఆమె మృతదేహం లభ్యమైనట్లు సిట్ ఛీప్ వై.నాగిరెడ్డి తెలిపారు. నయీమ్ సమీప బంధువుల ఫంక్షన్‌కు వారితో పాటు వస్తానని మారాం చేసినందుకే హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇంట్లో ఉండలేనంటూ ప్రాధేయపడినా వినకుండా నయీమ్ విచక్షణా రహితంగా కొట్టినట్లు ఆయన తెలిపారు. ఆ దెబ్బలకు తాళలేక సృ్పహ తప్పి పడిపోయిన నస్రీన్‌కు బలవంతంగా నిద్రమాత్రలు మింగించడంతో మృతి చెందిందని వివరించారు. ఆమె మరణించినట్లు నిర్ధారించుకొని మంచిరేవుల వద్ద పాతిపెట్టారన్నారు. అలాగే మిస్సింగ్‌గా భావిస్తున్న అలీముద్దీన్ భార్య, అతడి కూతురు ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. నస్రీన్ అస్థి పంజరం దొరికిన రోడ్డులోనే నెల రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు ఐదెకరాల భూమిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.

 శేషన్న కోసం గాలింపు
 గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు కుడిభుజంగా, గ్యాంగ్‌లో రెండో స్థానంలో కొనసాగిన శేషన్న కోసం సిట్ పోలీసులు గాలిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అతన్ని అదుపులోకి తీసుకుంటే నయీమ్‌కు సంబంధించిన అనేక విషయాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. నయీమ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శేషన్న మూడో వ్యక్తికి తెలియకుండా పనిపూర్తి చేసేవాడు. అందుకే శేషన్న పట్టుబడితే అనేక అంశాలు వెలుగు చూస్తాయని పోలీసు లు భావిస్తున్నారు. అలాగే నయీమ్ గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
 
 కుప్పలు తెప్పలుగా ఆస్తులు
 గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించిన ఆస్తులు కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. సిట్ విచారణలో ఇప్పటి వరకు వెయ్యికి పైగా భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. డాక్యుమెంట్ ప్రకారమే వాటి విలువ దాదాపు రూ.143 కోట్లు ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వీటి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు పది రెట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆస్తులన్నీ కూడా భార్య హసీనా, సోదరి సలీమా, ఇంట్లో పనిమనిషి ఫర్హానా పేరిట ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. త్వరలో వాటి విలువను మదింపు చేయనున్నారు.
 
 34 మంది అరెస్టు
 రాష్ట్ర వ్యాప్తంగా నయీమ్‌పై నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సోమవారం నల్లగొండలో మరో కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు నయీమ్‌పై నమోదైన కేసుల సంఖ్య 38కి చేరింది. అలాగే కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు.. ఇప్పటి వరకు నయీమ్ అనుచరులను దాదాపు 34 మందిని అరెస్టు చేశారు. అతని భార్య హసీనా, సోదరి సలీమాతో పాటు సమీప బంధులు ముఖ్య అనుచరులందరినీ అరెస్టు చేస్తున్నారు. తాజాగా సోమవారం మరి కొందరిని అరెస్టు చేశారు. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందిన గోపి అలియాస్ నార్సింగ్ గోపి, అదే జిల్లాకు చెందిన రమేశ్ అలియాస్ రాంబాబు ఉన్నారు.

మరిన్ని వార్తలు