వీణ-వాణీలకు వైద్య పరీక్షలు

7 Feb, 2015 12:09 IST|Sakshi
వీణ-వాణీలకు వైద్య పరీక్షలు

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణ, వాణిలను వేరు చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ వైద్యుల బృందం శనివారం నిలోఫర్ ఆస్పత్రికి చేరుకుంది.  లండన్ నుంచి వైద్యులు డునావే, జిలానీ.. వీణ-వాణిలకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.  అన్నీ సానుకూలంగా ఉంటే వీణా-వాణిలను లండన్‌కు తరలించి శస్త్రచికిత్స చేసే అవకాశముంది. ఈ ఆపరేషన్‌కు 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

 లండన్ వైద్యులు రెండు రోజుల పాటు వీణా వాణీలను ఇక్కడే క్షుణ్నంగా పరీక్షించి ఆపరేషన్‌తో వారిని విడదీసేందుకు అవకాశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని తేల్చనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా తదితర ఉన్నతాధికారులతో లండన్ వైద్య బృందం చర్చలు జరుపనుంది.

అవిభక్త కవలలను వేరు చేయడంలో లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి పేరు పొందింది. 2011లో ఇదే ఆస్పత్రిలో సూడాన్‌కు చెందిన ఏడాది వయస్సున్న అవిభక్త కవలలు రిటాల్, రిటాగ్‌లను  విజయవంతంగా వేరు చేశారు. అప్పట్లో ఈ ఆపరేషన్‌కు 6 కోట్లు ఖర్చయింది. ప్రస్తుతం 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన వీణ, వాణి  పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు.

మరిన్ని వార్తలు