ఆపరేషన్ అజయ్‌: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు

15 Oct, 2023 08:39 IST|Sakshi

ఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఓ రోజు రెండు విమానాలు భారత్ చేరాయి. 197 మందితో మూడో విమానం, 274 మందితో నాలుగో విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన భారతీయులకు జాతీయ జెండాలు ఇచ్చి కేంద్ర మంత్రి కౌషల్ కిషోర్ స్వదేశానికి స్వాగతం పలికారు. యుద్ధంతో సంక్షోభంలో ఉన్న ప్రాంతం నుంచి స్వదేశానికి తీసుకువచ్చినందుకు బాధితులు కేంద్ర ప్రభుత్వానికి ధన్వవాదాలు తెలిపారు. 

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి, రెండో విమానంలో 212, 235 మందిని వరుసగా ఇండియాకి తరలించారు. నాలుగో విమానం 274 మందితో టెక్‌ అవీవ్ నుంచి శనివారం రాత్రి 11:45కి ఇప్పటికే బయలుదేరింది. ఇప్పటివరకు దాదాపు 918 మందిని భారత్‌కి తరలించారు. 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులకు ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేశాయి. హమాస్ దళాలపై భూతల, వాయు, జల మార్గాల్లో దాడులు చేస్తున్నారు. ఇళ్లలో, సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై పట్టు వీడకుండా పోరాడుతున్నాయి. ఈ యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3500 మంది ఇప్పటికే మరణించారు. ఇజ్రాయెల్‌లో 1300 పైగా పౌరులు మరణించగా.. పాలస్తీనాలో 2000కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. 

తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్‌
భారత్‌ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఈ రెండు సర్వీసులు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్‌ఇండియా విమానం, అమృత్‌సర్‌ నుంచి స్పైస్‌జెట్‌ విమానం బయల్దేరతాయి. 

ఇదీ చదవండి: 235 మందితో రెండో విమానం రాక

మరిన్ని వార్తలు