‘ఎల్‌ఈడీ’ చిక్కులకు చెక్‌

5 Jan, 2018 02:00 IST|Sakshi

నోబెల్‌ గ్రహీత హిరోషీ అమానో

తక్కువ తీవ్రత ఉన్న బల్బుల సృష్టికి ప్రయత్నాలు

స్క్రీన్స్‌ తీక్షణత తగ్గించుకోవాలని సూచన

కొత్త రకం డయోడ్లతో ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడి

చిన్న పిల్లల్లో దృష్టి లోపాలు సరిచేయొచ్చని ఆశాభావం

సాక్షి, హైదరాబాద్‌
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించిన ఎల్‌ఈడీ బల్బులు భవిష్యత్తులో దృష్టి లోపాలను సరిదిద్దేందుకూ ఉపయోగపడొచ్చని నీలిరంగు ఎల్‌ఈడీల సృష్టికర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ హిరోషీ అమానో తెలిపారు. మనం విరివిగా వాడుతున్న తెల్లని ఎల్‌ఈడీ బల్బుల వల్ల నిద్రలేమి వంటి సమస్యలొస్తాయన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్లాటినమ్‌ జూబ్లీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎల్‌ఈడీల కాంతి మెలటోనిన్‌ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తున్న కారణంగా కొందరిలో నిద్రలేమి సమస్యలొస్తున్నాయని పేర్కొన్నారు. టీవీ, మొబైల్, కంప్యూటర్‌ స్క్రీన్‌ల కాంతి తీవ్రతను తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించొచ్చని సూచించారు.

1,500 సార్లు విఫలం..
నీలిరంగు ఎల్‌ఈడీ సృష్టికి జరిగిన ప్రయత్నాలు, ప్రాముఖ్యం గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘విద్యతో మానవుడి కష్టాలు తీర్చాలి’ అన్న తన ప్రొఫెసర్‌ మాటలు ఎంతో ప్రభావితం చేశాయని హిరోషీ పేర్కొన్నారు. అప్పటివరకు చదువుపై పెద్దగా అంతగా శ్రద్ధ పెట్టలేదని, ఆ తర్వాతే ఏదైనా చేయాలనే తపనతో కృషి చేసినట్లు వివరించారు. నీలి రంగు ఎల్‌ఈడీలు చేసేందుకు ఒకే ప్రయోగాన్ని 1,500 సార్లు చేసి విఫలమయ్యానని, అయినా పట్టు వదలకుండా ప్రయత్నించినట్లు వివరించారు. చివరికి గాలియం నైట్రైట్‌ అనే పదార్థంతో విజయం సాధించినట్లు పేర్కొన్నారు.

నీలిరంగు ఎల్‌ఈడీ ఎంతో కీలకం..
ఎరుపు, పచ్చ రంగు ఎల్‌ఈడీలు దశాబ్దాల కిందే తయారైనా, విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించేందుకు.. అందరికీ అనుకూలంగా ఉండే తెల్లటి బల్బుల కోసం నీలి రంగు ఎల్‌ఈడీలు తయారు చేసే సాంకేతికత ఎంతో కీలకమైందని చెప్పారు. నీలిరంగు బల్బులకు ప్రత్యేక పదార్థపు పొరను జోడించడంతో తెలుపు ఎల్‌ఈడీలు తయారయ్యాయని వివరించారు. సాధారణ బల్బుల కంటే ఎన్నో రెట్లు తక్కు విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే ఎల్‌ఈడీలు పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వివరించారు.

ఐఐసీటీతో కలసి పనిచేయాలని..
తెలుపు ఎల్‌ఈడీలతో వస్తున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు 360 నానోమీటర్ల స్థాయి తరంగాలను వెదజల్లే డయోడ్లు పనికొస్తాయని హిరోషీ వివరించారు. ఈ రకమైన బల్బుల తయారీకి ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే చిన్న పిల్లల్లో కనిపించే హ్రస్వదృష్టిని సరిచేసేందుకు కూడా అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందని.. తాము మాత్రం ఇంటర్నెట్‌ ఆఫ్‌ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. వైర్‌లెస్‌ పద్ధతిలో 120 మీటర్ల దూరానికి కూడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఉపయోగపడే ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. 20 నుంచి 60 నిమిషాలు మాత్రమే గాల్లో ఎగరగల డ్రోన్లను ఇంటర్నెట్‌ ఆఫ్‌ ఎనర్జీ ద్వారా రోజంతా ఎగిరేలా చేయొచ్చని పేర్కొన్నారు. దీంతో రోడ్లపై వాహనరద్దీ తగ్గించే ఎయిర్‌ ట్యాక్సీలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ విషయంలో ఐఐసీటీలోని యువ శాస్త్రవేత్తలతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు